Chapati: చపాతీలు సుతిమెత్తగా రావాలా? పిండిలో వీటిని కలపండి చాలు
08 November 2024, 10:30 IST
Chapati: ఇంట్లోనే మృదువైన చపాతీలు చేయాలనుకుంటున్నారా? వీటిని చేయడం కష్టమేమీ కాదు, చిన్న చిట్కాలు పాటిస్తే చాలు సుతిమెత్తని చపాతీలు సిద్ధమైపోతాయి. ఇక్కడ మేము కొన్ని పదార్థాలను ఇచ్చాము. వీటిని ఉపయోగిస్తే సాఫ్ట్ చపాతీలు తయారైపోతాయి.
సాఫ్ట్ చపాతీలు
చపాతీలు మెత్తగా వస్తేనే తినగలరు. కానీ కొంతమంది చపాతీలు చేయడం సరిగా రాదు, అవి గట్టిగా ఉండేలా చేస్తారు. హోటల్‌లో చపాతీలు మాత్రం చాలా మెత్తగా ఉంటాయి. అలా హోటల్ స్టైల్లో చపాతీలను మెత్తగా ఎలా చేయాలో తెలుసుకోండి. హోటల్ చపాతీల వలె మృదువుగా ఉండాలంటే చిన్న చిట్కాలను పాటించడం ద్వారా ఇంట్లో కూడా వీటిని మెత్తగా అయ్యేలా చేయవచ్చు. చపాతీ పిండిని కలిపేటప్పుడు, అలాగే గోధుమపిండిలోనూ కొన్ని రకాల పదార్థాలను కలపడం ద్వారా చపాతీలు మెత్తగా వచ్చేలా చేయవచ్చు.
వేడి నూనె
చపాతీ పిండిని కలపడానికి ముందు నూనెను వేడి చేయాలి. ఆ పిండిలో ఆ వేడి నూనెను ఒక స్పూను కలపాలి. పిండిని కొద్దిగా నీళ్లు పోస్తూ పిండిని కలుపుతూ ఉండాలి. చివరగా పైన కొద్దిగా నూనె పోసి మరోసారి కలిపి పది నిమిషాలు మూత పెట్టి వదిలేయాలి.
గుడ్లు
మీరు గుడ్డు తినేవారైతే చపాతీ పిండి తయారు చేసేటప్పుడు గుడ్లను ఉపయోగించవచ్చు. గుడ్డులోని తెల్లసొనను వేరు చేయండి. అందులో 2 చుక్కల నిమ్మరసం వేసి బాగా గిలకొట్టాలి. గోధుమపిండి కలుపుతున్నప్పుడు ఆ గుడ్డు మిశ్రమాన్ని వేసి కలుపుకోవాలి. ఆ పిండితో చేస్తే మెత్తని చపాతీలు వస్తాయి.
పెరుగు
కోడిగుడ్లు వేయడం ఇష్టం లేకపోతే పెరుగును వాడవచ్చు. గోధుమపిండిని కలుపుతున్నప్పుడు పెరుగను వేసుకోవచ్చు. పిండి కలుపుతున్నప్పుడే గోరువెచ్చటి నీటితో కలిపి, రెండు చెంచాల పెరుగు వేసుకుని బాగా కలపాలి. పైన మూత పెట్టి పదినిమిషాలు వదిలేయాలి. ఈ మిశ్రమంతో చపాతీ చేస్తే చాలా రుచిగా ఉంటుంది.
బేకింగ్ సోడా
పిండికి మెత్తదనాన్ని ఇవ్వడానికి బేకింగ్ సోడా కలుపుతారు. గోధుమపిండిలో అర కప్పు గోరువెచ్చని పాలు, నీరు వేసి కలపాలి. అప్పుడే చిటికెడు బేకింగ్ సోడా వేసి కలుపుకోవాలి. ఆ తర్వాత పిండిని 10 నుండి 15 నిమిషాలు మూతపెట్టాలి. తరువాత చపాతీలు చేసుకోవాలి.
నెయ్యి
నెయ్యి వేస్తే చపాతీ మెత్తగా అవుతుంది. గోధుమ పిండిని కలపడానికి ముందు ఒక టీస్పూన్ వేడి నెయ్యి వేసి అందులో వేసి కలపాలి. తరువాత నీళ్లు పోసి బాగా కలపాలి. ఈ పిండితో చపాతీలు చేస్తే మెత్తగా ఉంటాయి. ఇవి చాలా రుచిగా ఉంటాయి.
చపాతీలు కలిపేటప్పుడు నీళ్లే కాదు, పాలను కూడా ఉపయోగించవచ్చు. పాలతో కలిపిన చపాతీల్లో పోషకాలు కూడా ఎక్కువే ఉంటాయి. ఎప్పుడైనా చపాతీ పిండి కలిపి తే ఒక గంట పాటూ పక్కన పెట్టండి… ఆ తరువాత చపాతీలు చేస్తే చాలా మెత్తగా, రుచిగా ఉంటాయి. చపాతీలు కలిపేటప్పుడు చల్లని నీళ్లు కలిపితే అవి మెత్తగా కాకుండా గట్టిగా వస్తాయి. కాబట్టి వేడినీళ్లతో పిండిని కలిపితే ఎంతో మంచిది.
కాల్చిన చపాతీలను గాలికి వదిలేయకుండా హాట్ బాక్సులో పెట్టి మూత పెట్టండి. అలా పెడితే ఎక్కువ సేపు మెత్తగా ఉంటాయి. లేకుంటే గాలికి గట్టిగా అయిపోతాయి.
టాపిక్