తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Dondakaya Recipes: గుంటూరులో చేసే స్పెషల్ దొండకాయ నిమ్మకారం రెసిపీ, సాంబార్ అన్నంతో సైడ్ డిష్‌గా అదిరిపోతుంది

Dondakaya Recipes: గుంటూరులో చేసే స్పెషల్ దొండకాయ నిమ్మకారం రెసిపీ, సాంబార్ అన్నంతో సైడ్ డిష్‌గా అదిరిపోతుంది

Haritha Chappa HT Telugu

18 December 2024, 11:30 IST

google News
    • Dondakaya Recipes: తెలుగువారికి టేస్టీ కూరలు అంటే ఎంతో ఇష్టం. ఇక్కడ మేము స్పెషల్‌గా దొండకాయ నిమ్మకాయ కారం ఎలా వండాలో ఇచ్చాము. దీని రెసిపీ ఎలాగో తెలుసుకోండి.
దొండకాయ నిమ్మకారం రెసిపీ
దొండకాయ నిమ్మకారం రెసిపీ (Vismai Foods)

దొండకాయ నిమ్మకారం రెసిపీ

గుంటూరులో స్పెషల్ గా వండే కూరల్లో దొండకాయ నిమ్మకారం ఒకటి. ఇది చాలా రుచిగా ఉంటుంది. ఒక్కసారి తిన్నారంటే మర్చిపోలేరు. సాంబార్ అన్నంతో సైడ్ డిష్‌గా ఈ దొండకాయ నిమ్మకారం వేపుడుని పెట్టుకుంటే రుచి అదిరిపోతుంది. దీని రెసిపీ తెలుసుకోండి. అతిధులకు వడ్డిస్తే ప్రశంసలు కచ్చితంగా దక్కుతాయి.

దొండకాయ నిమ్మకారం రెసిపీకి కావలసిన పదార్థాలు

దొండకాయలు - అరకిలో

నీళ్లు - తగినన్ని

మెంతులు - పావు స్పూను

ఆవాలు - ఒక స్పూను

జీలకర్ర - ఒక స్పూను

ధనియాలు - ఒక స్పూను

పచ్చిమిర్చి - నాలుగు

కారం - ఒక స్పూను

నిమ్మరసం - రెండు స్పూన్లు

బెల్లం తురుము - ఒక స్పూను

ఉప్పు - రుచికి సరిపడా

నూనె - రెండు స్పూన్లు

వేరుశెనగ పలుకులు - మూడు స్పూన్లు

పచ్చి శనగపప్పు - ఒక స్పూను

వెల్లుల్లి రెబ్బలు - అయిదు

ఎండుమిర్చి - రెండు

కరివేపాకులు - గుప్పెడు

పసుపు - అర స్పూను

దొండకాయ నిమ్మకారం రెసిపీ

1. దొండకాయలను నిలువుగా నాలుగు ముక్కలు చేసుకోవాలి.

2. వాటిని ఆవిరి మీద ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలి.

3. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి ధనియాలు, జీలకర్ర, ఆవాలు, మెంతులు వేయించుకోవాలి.

4. వాటిని మిక్సీ జార్లో వేసి పొడిలా చేసుకోవాలి. ఆ పొడిని ఒక గిన్నెలో వేసుకోవాలి.

5. ఆ పొడిలోనే నిలువుగా ముక్కలు కోసిన పచ్చిమిర్చిని, కారాన్ని, నిమ్మ రసాన్ని, బెల్లం తురుమును రుచికి సరిపడా ఉప్పును వేసి బాగా కలపాలి.

6. రెండు టేబుల్ స్పూన్ల నీళ్లు కూడా వేసి బాగా కలుపుకోవాలి.

7. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేయాలి.

8. ఆ నూనెలో వేరుశెనగ పలుకులను వేసి వేయించాలి. తర్వాత వాటిని తీసి పక్కన పెట్టుకోవాలి.

9. ఇప్పుడు అదే నూనెలో ఒక స్పూను అర స్పూన్ ఆవాలు, అర స్పూను పచ్చిశనగపప్పు, వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిర్చి వేసి వేయించుకోవాలి.

10. గుప్పెడు కరివేపాకులను కూడా వేసి వేయించాలి.

11. ఇవి వేగాక ముందుగా ఆవిరి మీద ఉడకబెట్టుకున్న దొండకాయ ముక్కలను వేసి ఫ్రై చేయాలి.

12. ఇందులో అర స్పూన్ పసుపు కూడా వేసి కలుపుకోవాలి.

13. ఇవి 90 శాతం ఫ్రై అయిపోయాక ముందుగా కలిపి పెట్టుకున్న మసాలా మిశ్రమాన్ని ఇందులో వేసి చిన్న మంటపైన ఫ్రై చేసుకోవాలి.

14. తడి అంతా పోయి ఇది వేపుడు లాగా అయ్యే వరకు చిన్న మంట మీద ఉడికించాలి.

15. చివరిలో ముందుగా వేయించుకున్న పల్లీలను కూడా వేసి కలుపుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి.

16. అంతే టేస్టీ దొండకాయ నిమ్మకారం రెడీ అయినట్టే.

17. దీన్ని మీరు ఒక్కసారి తిన్నారంటే మీకు ఎంతో నచ్చుతుంది.

18. ఇంటికి అతిధులు వచ్చినప్పుడు వీటిని ఈ కూరను వడ్డించి చూడండి. వారికి ఇది నచ్చడం ఖాయం.

దొండకాయను ఎక్కువమంది తినేందుకు ఇష్టపడరు. వారు కూడా ఇష్టంగా తినాలంటే ఇలా దొండకాయ నిమ్మకారం రెసిపీ ప్రయత్నించండి. సాంబారు, పప్పుచారు వంటివి వండినప్పుడు పక్కన సైడ్ డిష్‌గా దొండకాయ నిమ్మకారం వేపుడును పెట్టుకుంటే రుచి అదిరిపోతుంది. మేము చెప్పిన పద్ధతిలో చేసి చూడండి. ఇది మీకు కచ్చితంగా నచ్చుతుంది.

తదుపరి వ్యాసం