First-time Motherhood | తొలిసారిగా చేసే మాతృత్వపు ప్రయాణంలో అమ్మకు అండగా ఉండండి!
20 February 2023, 19:07 IST
- First-time Motherhood: మొదటిసారిగా అమ్మ కాబోయే స్త్రీలలో అనేక భయాలు, ఆందోళన ఉంటాయి. వారిని అర్థం చేసుకోవడంలో కొన్ని విషయాలపై అవగాహన కలిగి ఉండటం ముఖ్యం.
First-time Motherhood
First-time Motherhood: అమ్మ కావడం స్త్రీ జీవితంలో ఒక అద్భుతమైన ఘట్టం. అందులోనూ తొలిసారిగా గర్భధారణ పొందిన స్త్రీ తన గర్భాన్ని ఎంతో అపురూపంగా చూసుకుంటుంది. ఇదొక భావోద్వేగపూరితమైన సమయం. ఈ సమయంలో ఆమె మదిలో అనేక భావోద్వేగాలు కదలాడుతాయి. కడుపులో బిడ్డ పెరిగే కొద్దీ ఆ గర్భిణీ ఎంతో ఆనందానికి లోనవుతుంది, ఆ బిడ్డ కడుపులో కదలాడుతున్నప్పుడు ఆమె తొలిసారిగా మాతృత్వపు స్పర్శను అనుభూతి చెందుతుంది.
అదే సమయంలో తన కడుపులోని బిడ్డ ఆరోగ్యం గురించి ఆ తల్లి అప్పటి నుంచే గాబరా పడుతుంది. లోపల అంతా సవ్యంగా ఉందా, కడుపులో బిడ్డ ప్రశాంతంగా, హాయిగా నిద్రపోతున్నాడా, ఏ సమయంలో ఏం చేస్తున్నాడు, ఎప్పుడు ఎలాంటి ఆహారం తీసుకోవాలి? ఇటువంటి ఎన్నో ఆలోచనలు తిరుగుతుంటాయి.
గర్భిణీ స్త్రీలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే దానిపై ఇంటర్నెట్లో కావలసినంత సమాచారం అందుబాటులో ఉంటుంది. అయితే తొలిసారిగా మాతృత్వం అందుకునేటపుడు ఒక స్త్రీ ఎలాంటి భావోద్వేగాల గుండా ప్రయాణం చేస్తుందో, ఎవరూ చెప్పని కొన్ని విషయాలను ఇక్కడ తెలుసుకోండి.
Journey to Motherhood- మాతృత్వపు ప్రయాణం
తొలిసారిగా అమ్మతనం పొందుతున్న స్త్రీలలో భావోద్వేగాలు తీవ్రంగా ఉండవచ్చు. ఈ సమయంలో వారి శరీరంలో చోటు చేసుకునే హార్మోన్ల హెచ్చుతగ్గులు కూడా వారి భావోద్వేగాలను ప్రభావితం చేయవచ్చు. అప్పుడే ఆనందం, అంతలోనే ఆందోళన లేదంటే రెండూ ఒకేసారి అనుభవించవచ్చు. ఇంకాస్త లోతుగా అర్థం చేసుకుందాం..
ఎక్కువ ప్రేమ, ఎక్కువ ఆందోళన
తమ పిల్లలపై వారి తల్లిదండ్రులు చూపే ప్రేమ వెలకట్టలేనిది. కళ్ల ముందు ఉన్న పిల్లలను చూస్తూ ప్రేమను కురిపించవచ్చు. కానీ కడుపులో ఉన్న బిడ్డను అనుభూతి చెందుతూ, ఆ బిడ్డకు ప్రేమను పంచడం వెనక ఒక తెలియని ఆందోళన ఉంటుంది. బిడ్డ ఆరోగ్యం, భద్రత, శ్రేయస్సు గురించి తల్లి నిరంతరం చింతిస్తూ ఉండవచ్చు.
నిద్ర లేకపోవడం
తల్లిగా మీరు అనుభవించే నిద్రలేమి బహుశా ఎవరికీ ఉండకపోవచ్చు. బిడ్డ పుట్టాక, నవజాత శిశువు ఆలన-పాలన చూసుకునేందుకు మొదటి కొన్ని నెలలు చాలా కష్టంగా ఉంటుంది, ఎందుకంటే మీ శిశువు రాత్రి సమయంలో తరచుగా మేల్కొంటుంది, ఏడుస్తుంది. కడుపులో ఉన్నప్పుడు కూడా అడపదడపా మెలకువ వస్తుంటుంది.
ఒంటరితనం
గర్భంతో ఉన్నప్పుడు ఇంట్లోనే ఎక్కువగా విశ్రాంతి తీసుకోవడం వలన ఒంటరిగా అనిపిస్తుంది. ప్రసవం తర్వాత కూడా తల్లిగా ఉండటం కొన్నిసార్లు ఒంటరి అనుభూతిని కలిగిస్తుంది, ప్రత్యేకించి ఇంట్లో పెద్దవాళ్లు ఎవరూ లేనపుడు, అన్నింటిని చూసుకోవడం కష్టంగా ఉంటుంది , కొన్నిసార్లు ఎవరూ లేరు అన్నట్లుగా అనిపించవచ్చు.
అపరాధ భావన
పని, కుటుంబం, వ్యక్తిగత సమయాన్ని బ్యాలెన్స్ చేయడం సవాలుగా ఉంటుంది. కొన్నిసార్లు ఒక తల్లిగా మీరు ఏదైనా అకస్మాత్తు నిర్ణయాలు తీసుకోవచ్చు. ఆ వెంటనే రెండోసారి ఆలోచించవచ్చు. తల్లిగా మీ నిస్సహాయత మిమ్మల్ని బాధింవచ్చు, అపరాధ భావనతో ఉండేలా చేయవచ్చు.
ఒక స్త్రీ గర్భధారణ పొందినప్పటి నుంచి ప్రసవానంతరం తల్లిగా బాధ్యతలు మోయడం వరకు వారికిది ఒక పెద్ద ఎమోషనల్ రోలర్‌కోస్టర్ జర్నీ. ఈ సమయంలో భాగస్వామి మనసెరిగి మసలుకోవడం మంచిది. ముఖ్యంగా తొలిసారి మాతృత్వం పొందే స్త్రీలకు ఎన్నో రకాల భయాలు, ఆందోళనలు, సందేహాలు, భవిష్యత్తుపై బెంగ ఉంటాయి. అన్నింటికీ మేము ఉన్నాం అనే ధైర్యం ఇచ్చేవారు వారికి కావాలి. మంచిచెడులు చెప్పేవాళ్లు, మంచి సలహాలు సూచనలు ఇచ్చే పెద్దవాళ్ళు ఉండాలి. అందరూ అమ్మకు అండగా ఉంటే, ఇంట్లో ఆనందం ఉంటుంది.