తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  దోమల నివారణ లిక్విడ్ తాగిన పాప.. విమానంలో తీసుకొచ్చి హైదరాబాద్‌లో చికిత్స

దోమల నివారణ లిక్విడ్ తాగిన పాప.. విమానంలో తీసుకొచ్చి హైదరాబాద్‌లో చికిత్స

Anand Sai HT Telugu

25 May 2024, 19:13 IST

google News
    • Mosquito Repellent : దోమల నివారణ మందు ఆరోగ్యానికి ప్రమాదకరం. అయితే దీనిని ఛత్తీస్‌గడ్‌కు చెందిన ఓ పాప తాగింది. ఆమెను హైదరాబాద్ తీసుకొచ్చి చికిత్స అందించారు.
దోమల నివారణ మందు తాగిన పాప
దోమల నివారణ మందు తాగిన పాప

దోమల నివారణ మందు తాగిన పాప

దోమల నివారణ మందు మొత్తం తాగేసిన 18 నెలల పాపకు హైదరాబాద్‌లో చికిత్స చేశారు. హైదరాబాద్‌లోని కిమ్స్ కడల్స్ వైద్యులు ఛత్తీస్‌గడ్‌ నుంచి విమానంలో తీసుకొచ్చి వైద్యం చేశారు. మొదట రాయ్ పూర్ లోని ఆసుపత్రిలో ఎక్మోపై ఉంచి, తదుపరి చికిత్స కోసం హైదరాబాద్ కు విమానంలో తరలించారు. పాప ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుని వైద్యులు చికిత్స చేశారు.

ఛత్తీస్‌గడ్‌‌లోని భిలాయ్ ప్రాంతానికి చెందిన 18 నెలల పాప అనుకోకుండా.. దోమల నివారణ లిక్విడ్ తాగేసింది. ఆమె ఊపిరి అందక ఇబ్బంది పడుతుండటంతో తొలుత స్థానికంగా ఉన్న ఆస్పత్రికి, తర్వాత అక్కడినుంచి రాయ్‌పూర్ తీసుకెళ్లారు. అక్కడ ఆమెకు వెంటిలేటర్ అమర్చారు. వెంటిలేటర్ సపోర్ట్ ఉన్నా ఆమె పరిస్థితి బాగుపడకపోగా, ఊపిరితిత్తులు మరింత పాడయ్యాయి. సరిగా ఊపిరి అందలేదు.

దీంతో రాయ్‌పూర్ ఆస్పత్రి వర్గాలు హైదరాబాద్‌లోని కొండాపూర్లోని కిమ్స్ కడల్స్ ఆస్పత్రిని సంప్రదించాయి. ఇక్కడి నుంచి ఇద్దరు ఇంటెన్సివిస్టులు, ఒక పెర్ఫ్యూజనిస్టు, ఒక కార్డియాక్ సర్జన్, ఐసీయూ నర్సు కలిసి రాయ్‌పూర్‌కు విమానంలో వెళ్లారు. అక్కడ పరీక్షించిన తర్వాత పాపకు దోమల నివారణ మందులోని హైడ్రోకార్బన్ల వల్ల కెమికల్ న్యూమోనైటిస్ అనే సమస్య తీవ్రంగా వచ్చిందని తెలిసింది. పాప శరీరానికి తగినంత ఆక్సిజన్ అందించడానికి వెంటిలేటర్ సరిపోలేదు. దాంతో పాపకు ఎక్మో పెట్టి, ఆమె పరిస్థితిని సాధారణ స్థితికి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు.

అయితే ఈ సందర్భంలో పాప బరువు కేవలం 10 కిలోలు మాత్రమే ఉన్నందున ఎక్మోను మెడ వద్ద అమర్చారు. ఇది ఊపిరితిత్తులు, గుండె రెండింటినీ బైపాస్ చేస్తుంది. ఈ విధానం చాలా అరుదు.

ఈ ప్రొసీజర్ తర్వాత పాపను తొలుత రోడ్డు మార్గంలో రాయ్‌పూర్ విమానాశ్రయానికి, అక్కడినుంచి ఎయిర్ అంబులెన్స్ ద్వారా బేగంపేట విమానాశ్రయానికి తీసుకొచ్చారు. అక్కడినుంచి కొండాపూర్‌లోని ఆస్పత్రికి తీసుకెళ్లారు. పాపను 9 రోజుల పాటు వీఏ-ఎక్మో మీద పెట్టాక పరిస్థితి మెరుగుపడింది. అప్పుడు మరో ఐదారు రోజులు వెంటిలేటర్ మీద ఉంచారు. అనంతరం హైఫ్లో, లోఫ్లో ఆక్సిజన్ పెట్టారు. ఈ మధ్యలో ఇన్ఫెక్షన్ రావడంతో చికిత్స చేశారు. 18 రోజుల చికిత్స తర్వాత పాప పూర్తిగా కోలుకుంది. అన్నిరకాలుగా బాగుండటంతో ఆమెను డిశ్చార్జి చేశారు.  పాప తల్లిదండ్రులు వైద్యులకు ధన్యవాదాలు తెలిపారు.

ఈ కేసులో పాపకు ఊపిరితిత్తులు, గుండె కూడా కొంత దెబ్బతిన్నాయి. పాప వయసు బాగా తక్కువ. దాంతో మెడ వద్ద కాన్యులేషన్ ద్వారా ఎక్మో పెట్టారు. 'బాలికకు ఇచ్చిన చికిత్స వల్ల ఆమె గుండె, ఊపిరితిత్తులకు తగినంత మద్దతు లభించింది. ఆస్పత్రిలో ఉన్న అత్యాధునిక సదుపాయాలు, నైపుణ్యం కలిగిన వైద్యబృందం వల్ల మాత్రమే ఆమెను ఎక్మో పెట్టి విమానంలో హైదరాబాద్‌కు విజయవంతంగా తీసుకురాగలిగాం. అనుభవజ్ఞులైన కార్డియాక్, వాస్క్యులర్ సర్జన్లు ఉండటంతో రక్తనాళాల్లోకి కాన్యులేషన్ సరిగ్గా జరిగింది. అంటే రోగిని ఎక్మో మీద పెట్టి, అదే సమయంలో కార్డియో రెస్పిరేటరీ మసాజ్ ఇవ్వగలరు.' అని డాక్టర్ పరాగ్ శంకర్రావు డెకాటే అన్నారు.

తదుపరి వ్యాసం