2022 BMW G310 RR । భారత మార్కెట్లోకి దూసుకొచ్చిన బీఎండబ్లూ అడ్వెంచర్ బైక్‌లు!
17 July 2022, 12:07 IST
- జర్మనీకి చెందిన ప్రముఖ ద్విచక్ర వాహన తయారీదారు BMW Motorrad తాజాగా భారత మార్కెట్లో రెండు సరికొత్త మిడ్- రేంజ్ స్పోర్ట్స్ బైక్ లను విడుదల చేసింది. వీటి ధరలు, ఇతర విశేషాలు ఇక్కడ తెలుసుకోండి.
BMW G 310 RR
BMW Motorrad ఇండియా దూకుడు ప్రదర్శిస్తోంది. ఇటీవలే ఈ జర్మన్ ఆటోమేకర్ సరికొత్త 2022 BMW G 310 GS అడ్వెంచర్ టూరర్ ను భారత మార్కెట్లో విడుదల చేసింది. ఎక్స్-షోరూమ్ వద్ద దీని ధర రూ. 3.10 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. ఇదే సెగ్మెంట్లో కాస్త చిన్న సైజులో ఉండే BMW G 310 RR మోటార్‌సైకిల్ ను విడుదల చేసింది. ఎక్స్-షోరూమ్ వద్ద దీని ధర రూ. 2.70 లక్షల నుంచి ప్రారంభమవుతుంది.
BMW G 310 RR గురించి మాట్లాడుకుంటే ఈ బైక్‌తో బీఎండబ్ల్యూ బ్రాండ్ మొదటిసారిగా చిన్న-సైజు స్పోర్ట్‌బైక్ విభాగంలోకి అడుగుపెట్టింది. దీనిని భారత మార్కెట్లో పాపులర్ బైక్ అయిన TVS Apache RR310 ఆధారంగా రూపొందించారు. కాబట్టి డిజైన్ ఇంకా ఫీచర్లలో ఈ రెండు బైక్‌ల మధ్య చాలానే సారూప్యతలు ఉన్నాయి. అయితే G 310 RRకు BMW బ్రాండ్ ఇమేజ్‌తో పాటు బాడీ ప్యానెల్‌పై అందిస్తున్న స్టైలిష్ గ్రాఫిక్‌లు, లభ్యమయ్యే కలర్ షేడ్స్ ఇంకా కొన్ని విభిన్న ఫీచర్లు ఈ బైక్‌కు ప్రత్యేక గుర్తింపుని ఇస్తాయి.
ఈ నేక్డ్ రోడ్‌స్టర్ రేసింగ్ బ్లూ మెటాలిక్, కాస్మిక్ బ్లాక్, రేసింగ్ రెడ్ అనే మూడు విభిన్న పెయింట్ స్కీమ్‌లతో అందుబాటులో ఉంది.
BMW G 310 RR ఫీచర్లు, స్పెసిఫికేషన్లు
BMW G 310 RRలో 312.12 cc వాటర్ కూల్డ్ సింగిల్ సిలిండర్ 4 వాల్వ్ ఇంజన్‌ను అమర్చారు. ఇది 34 PS గరిష్ట శక్తిని, 27.3 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీని ఇంజన్‌కు అసిస్ట్, స్లిప్పర్ క్లచ్‌తో కూడిన 6-స్పీడ్ గేర్‌బాక్స్‌ను జతచేశారు. ఇందులో నాలుగు రైడింగ్ మోడ్‌లు, బ్లూటూత్ కనెక్టివిటీ , పూర్తి-LED లైటింగ్ సెటప్ మొదలైనవి ఉన్నాయి. టాప్ స్పీడ్ గురించి చెప్పాలంటే.
ఈ బైక్ ట్రాక్, స్పోర్ట్ మోడ్‌లలో గరిష్టంగా గంటకు 160 కిలోమీటర్లు, అదేవిధంగా రెయిన్, అర్బన్ మోడ్‌లో 125 kmph గరిష్ట వేగాన్ని అందిస్తుంది.
అపాచీకి భిన్నంగా BMW G 310 RRలో మిచెలిన్ పైలట్ స్ట్రీట్ టైర్లు, సంప్రదాయ రౌండ్ డిస్క్ బ్రేక్‌లు, భిన్నమైన TFT కన్సోల్ లేఅవుట్, యూజర్ ఇంటర్ఫేస్ ఉన్నాయి.
BMW G 310 GS స్పెసిఫికేషన్లు
BMW G 310 GSలో 313cc సింగిల్-సిలిండర్, లిక్విడ్-కూల్డ్, ఫ్యూయల్-ఇంజెక్ట్ ఇంజిన్ ఇచ్చారు. ఈ మోటార్ 9,500 RPM వద్ద 33.5 bhp శక్తిని, అలాగే 7,500 RPM వద్ద 28 Nm గరిష్ట టార్క్‌ను విడుదల చేస్తుంది. ఇంజిన్ ను 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో జత చేశారు. ఇంకా రైడ్-బై-వైర్ థ్రోటిల్, అసిస్ట్ & స్లిప్పర్ క్లచ్‌ని ఇచ్చారు.