Virata Parvam: విరాటపర్వం ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ముఖ్య అతిథులు ఎవరంటే...
14 June 2022, 13:38 IST
రానా, సాయిపల్లవి జంటగా నటించిన విరాటపర్వం సినిమా జూన్ 17న ప్రేక్షకుల ముందుకు రానుంది. నక్సలిజానికి ప్రేమకథను జోడించి రూపొందిన ఈ చిత్రానికి వేణు ఊడుగుల దర్శకత్వం వహించారు. ఈ నెల 15న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించబోతున్నారు. ఈ వేడుకకు ఎవరు ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారంటే....
సాయిపల్లవి,రానా,
1990 దశకంలో తెలంగాణలో చోటుచేసుకున్న యథార్థ సంఘటనలను ఆధారంగా చేసుకొని రూపొందిన చిత్రం విరాటపర్వం. రానా, సాయిపల్లవి జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి వేణు ఊడుగుల దర్శకత్వం వహిస్తున్నారు. వరంగల్ కు చెందిన తూము సరళ అనే మహిళా నక్సలైట్ జీవితం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. తూము సరళ పాత్రలో సాయిపల్లవి కనిపించబోతున్నది. ఈ సినిమాలో ప్రేమ, విప్లవ భావాల మధ్య సంఘర్షణను ఎదుర్కొనే వెన్నెల అనే యువతిగా సాయిపల్లవి పాత్ర కొత్త కోణంలో సాగుతుందని సమాచారం.
కామ్రేడ్ రవన్న అనే నక్సల్ నాయకుడిగా రానా కనిపించబోతున్నారు. జూన్ 17న ఈ సినిమా రిలీజ్ కానుంది. విడుదల తేదీ దగ్గరపడటంతో ప్రమోషన్స్ తో చిత్ర యూనిట్ బిజీగా ఉంది. జూన్ 15న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగనున్నది. హైదరాబాద్‌లోని శిల్పాకళావేదికలో భారీ స్థాయిలో ఈ ఈవెంట్‌ను ప్లాన్ చేస్తున్నారు. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు విక్టరీ వెంకటేష్, రామ్ చరణ్ తో పాటు దర్శకుడు సుకుమార్ ముఖ్య అతిథులుగా హాజరుకాబోతున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది.
ఈ ముగ్గురితో పాటు తెలుగు చిత్రసీమకు చెందిన పలువురు సినీ ప్రముఖులు ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు రాబోతున్నట్లు సమాచారం. పదో వెడ్డింగ్ డే సెలబ్రేషన్స్ కోసం ఇటీవలే రామ్ చరణ్ విదేశాలకు వెళ్లారు. 14వ తేదీన రామ్ చరణ్ పెళ్లి రోజు ఉండటంతో అతడు ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు వస్తాడో లేదో చూడాల్సిందే. సురేష్ ప్రొడక్షన్స్ తో కలిసి సుధాకర్ చెరుకూరి ఈ సినిమాను నిర్మించారు. నీది నాది ఒకే కథ తర్వాత వేణు ఊడుగుల దర్శకత్వం వహిస్తున్న సినిమా ఇది. రానా, సాయిపల్లవితో పాటు ప్రియమణి, నవీన్‌చంద్ర, నందితాదాస్ కీలక పాత్రలను పోషిస్తున్నారు.