Vijay Deverakonda: 100 మంది అభిమానులను మనాలీకి పంపిన విజయ్ దేవరకొండ.. మాట నిలబెట్టుకున్న రౌడీ హీరో
17 February 2023, 20:08 IST
Vijay Deverakonda: 100 మంది అభిమానులను మనాలీకి వెకేషన్ కోసం పంపించాడు విజయ్ దేవరకొండ. ముందుగా చెప్పినట్లే తన మాట నిలబెట్టుకున్నాడు ఈ రౌడీ హీరో.
100 మంది అభిమానులను మనాలీ టూర్ కు పంపించిన విజయ్ దేవరకొండ
Vijay Deverakonda: రౌడీ హీరో విజయ్ దేవరకొండకు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశమంతా అభిమానులు ఉన్నారు. ముఖ్యంగా లైగర్ మూవీతో నార్త్ లోనూ ఫ్యాన్ బేస్ పెరిగింది. ఈ సినిమా ఫ్లాపయినా.. హీరోగా విజయ్ కి మంచి పేరే వచ్చింది. హీరోగా తను మంచి పేరు సంపాదించడంతోపాటు తన అభిమానులను కూడా ఎంతో బాగా చూసుకుంటాడన్న పేరు అతనికి ఉంది.
ప్రతి ఏటా కొంతమంది అభిమానులను విజయ్ పూర్తిగా తన ఖర్చులతో వెకేషన్ కు పంపిస్తుంటాడు. అలా ఈసారి కూడా 100 మంది అభిమానులను మనాలీ టూర్ కోసం పంపించాడు. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి ఈ 100 మందిని ఎంపిక చేశారు. కొద్ది రోజుల కిందటే ఈ 100 మంది పేర్లను అతడు అనౌన్స్ చేశాడు. ఫిబ్రవరి 17 నుంచి 20వ తేదీ వరకూ ఈ వెకేషన్ ఉంటుందని విజయ్ చెప్పాడు.
ఇక శుక్రవారం (ఫిబ్రవరి 17) వాళ్ల జర్నీ ప్రారంభమైన తర్వాత ఫ్యాన్స్ పంపిన వీడియోను విజయ్ ట్విటర్ ద్వారా షేర్ చేసుకున్నాడు. ఆ 100 మంది లక్కీ ఫ్యాన్స్ విమానంలో ఉన్న వీడియో ఇది. వాళ్ల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.
ఈ వీడియోను షేర్ చేస్తూ.. "ఇవాళ ఉదయం వాళ్లు ఫ్లైట్ లో ఉన్న వీడియోను నాకు పంపించారు. పర్వతాల్లోకి హాలీడే ఎంజాయ్ చేయడానికి వెళ్తున్నారు. దేశంలోని నలుమూలల నుంచీ 100 మంది ఉన్నారు. నాకు చాలా హ్యాపీగా ఉంది" అని విజయ్ రాశాడు.
వెకేషన్ కు ఎక్కడికి పంపాలన్నదానిపై కూడా అతడు సోషల్ మీడియాలో ఓ పోల్ నిర్వహించాడు. వాళ్లంతా ఇలా మనాలీలోని కొండకోనల్లోకి వెళ్లాలని నిర్ణయించారు. వాళ్ల కోరిక మేరకు విజయ్ మొత్తం 100 మందినీ పంపించాడు.
కొన్నాళ్లుగా విజయ్ ఈ సంప్రదాయానికి తెరతీశాడు. గతంలో ఒకసారి మాసబ్ ట్యాంక్ దగ్గర ఉన్న జేఎన్టీయూ ఫైన్ ఆర్ట్స్ కాలేజీకి వెళ్లి 50 మంది ఫ్యాన్స్ ను ఎంపిక చేసి స్పెషల్ గిఫ్ట్ లు ఇచ్చాడు. విజయ్ ప్రస్తుతం ఖుషీ మూవీ షూటింగ్ లో ఉన్నాడు.
టాపిక్