Kushi Release Postponed: ఖుషీ రిలీజ్ వాయిదా వెనుక కారణం చెప్పిన విజయ్‌ దేవరకొండ-kushi release postponed confirms vijay deverakonda ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Kushi Release Postponed: ఖుషీ రిలీజ్ వాయిదా వెనుక కారణం చెప్పిన విజయ్‌ దేవరకొండ

Kushi Release Postponed: ఖుషీ రిలీజ్ వాయిదా వెనుక కారణం చెప్పిన విజయ్‌ దేవరకొండ

HT Telugu Desk HT Telugu
Nov 04, 2022 08:28 AM IST

Kushi Release Postponed: ఖుషీ మూవీ రిలీజ్ వాయిదా వెనుక కారణం చెప్పాడు విజయ్‌ దేవరకొండ. సమంతతో కలిసి అతడు నటిస్తున్న ఈ మూవీని డిసెంబర్‌లో రిలీజ్‌ చేయాలనుకున్నా.. ఇప్పుడు వచ్చే ఏడాదికి వాయిదా పడినట్లు వార్తలు వస్తున్న విషయం తెలిసిందే.

ఖుషీ మూవీ టీమ్ తో సమంత, విజయ్ దేవరకొండ
ఖుషీ మూవీ టీమ్ తో సమంత, విజయ్ దేవరకొండ

Kushi Release Postponed: విజయ్‌ దేవరకొండ, సమంత కలిసి నటిస్తున్న మూవీ ఖుషీ. మహానటిలో కలిసి నటించిన వీళ్లు.. మళ్లీ ఈ మూవీలో కనిపించబోతున్నారు. సమంత తన ఫస్ట్ క్రష్‌ అని ఈ మధ్యే విజయ్ చెప్పిన నేపథ్యంలో ఈ సినిమాపై ఫ్యాన్స్‌లో ఆసక్తి మరింత పెరిగింది. అయితే ఈ మూవీ రిలీజ్‌ డిసెంబర్‌లో కాదు.. వాయిదా పడిందన్న వార్త మాత్రం వాళ్లను నిరాశకు గురి చేసింది.

లైగర్‌లాంటి డిజాస్టర్‌ తర్వాత ఖుషీతో హిట్‌ అందుకోవాలని చూస్తున్న విజయ్‌కి కూడా ఈ రిలీజ్ వాయిదా కాస్త మింగుడు పడనిదే. ఈ సినిమా రిలీజ్ వాయిదా విషయాన్ని విజయ్‌ కూడా ధృవీకరించాడు. ఈ మధ్యే న్యూస్‌ 18కు ఇచ్చిన ఇంటర్వ్యూలో విజయ్‌ ఈ విషయాన్ని వెల్లడించాడు.

ఖుషీ.. వచ్చే ఏడాదే

నిజానికి ఈ సినిమాను క్రిస్మస్‌ సందర్భంగా డిసెంబర్ 23న రిలీజ్ చేయాలని భావించారు. అయితే ఇప్పుడీ సినిమాను వచ్చే ఏడాదికి వాయిదా వేసినట్లు విజయ్‌ చెప్పాడు. దీని వెనుక చాలా కారణాలే ఉన్నాయని కూడా అతడు అన్నాడు. కానీ వచ్చే ఏడాది మొదట్లోనే ఈ సినిమా రిలీజ్‌కు ప్రయత్నిస్తామని కూడా తెలిపాడు. "మేము సుమారు 60 శాతం షూటింగ్‌ను పూర్తి చేశాం. నిజానికి డిసెంబర్‌లోనే రిలీజ్‌ చేయాలని భావించాం. కానీ చాలా కారణాల వల్ల వచ్చే ఏడాదికి వాయిదా వేశాం. అయితే 2023, ఫిబ్రవరిలో రిలీజ్‌ చేయాలని భావిస్తున్నాం" అని విజయ్‌ ఆ ఇంటర్వ్యూలో చెప్పాడు.

ఇక ఈ ఖుషీ మూవీ కోస్టార్‌ అయిన సమంతపై కూడా ఇదే ఇంటర్వ్యూలో విజయ్‌ ప్రశంసలు కురిపించాడు. తాను కాలేజీ రోజుల్లో ఉన్న సమయంలో కేవలం సమంతను చూడటానికే థియేటర్లకు వెళ్లేవాడినని విజయ్‌ చెప్పాడు. "ఈ సినిమాలో నటించడం ఓ అందమైన అనుభూతి. నేను డిగ్రీలో ఉన్నప్పుడే తొలిసారి సమంతను బిగ్‌ స్క్రీన్‌పై చూశాను. అప్పుడే ఆమెతో ప్రేమలో పడ్డాను. ఇప్పుడు ఆమెతోనే కలిసి నటించడం, ఓ మ్యాజిక్‌ క్రియేట్‌ చేయడం చాలా సంతృప్తిగా ఉంది. ఆమె ఓ గొప్ప నటి. అందుకే ఖుషీ రిలీజ్ కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నాను" అని విజయ్‌ అన్నాడు.

ఖుషీ ఓ లవ్‌ స్టోరీ. శివ నిర్వాణ ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్‌ ప్రొడ్యూస్‌ చేస్తున్న ఈ సినిమా తెలుగుతోపాటు అన్ని దక్షిణాది భాషలు, హిందీలోనూ పాన్‌ ఇండియా స్థాయిలో రిలీజ్ కాబోతోంది.

Whats_app_banner