Ram Gopal Varma on Boycott Liger: రౌడీ హీరో విజయ్ దేవరకొండ, సంచలన దర్శకుడు పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా లైగర్. ఎన్నో అంచనాల నడుమ వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద తీవ్రంగా అభిమానులను నిరాశ పరిచింది. పాన్ఇండియా స్థాయిలో విడుదలైన ఈ చిత్రం ఫ్లాప్ టాక్ రావడంతో డిస్ట్రిబ్యూటర్లు కూడా నష్టపోయారు. అయితే మేకర్స్ ఈ సినిమాకు బయ్యర్లకు నష్టపరిహారం చెల్లిస్తామని చెప్పడం గమనార్హం. ఇదిలా ఉంటే వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ లైగర్ ఫ్లాప్ గురించి స్పందించారు. ఈ సినిమా ఆడకపోవడానికి ప్రధాన కారణం ప్రముఖ దర్శక, నిర్మాత కరణ్ జోహారే అని స్పష్టం చేశారు. ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆర్జీవీ.. కరణ్ వల్లే బాయ్‌కాట్ లైగర్(#BoycottLiger) ఉద్యమం ఊపందుకుందని తెలిపారు.
విజయ్ దేవరకొండ స్వభావరీత్యానే దూకుడుగా ఉంటాడు. అందువల్ల అతడి చేష్టలు అందర్నీ ఆకర్షిస్తాయి. కానీ బాలీవుడ్‌లో బాయకాట్ లైగర్ ఉద్యమం రావడానికి ప్రధాన కారణం.. ఆ ప్రాజెక్టుతో సంబంధమున్న కరణ్ జోహార్. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణించినప్పటి నుంచి బాలీవుడ్ ప్రజలు కరణ్ సినిమాలను బహిష్కరించడం సర్వసాధారణమైపోయింది. అని రామ్ గోపాల్ వర్మ స్పష్టం చేశారు. అయితే లైగర్ ఫ్లాప్ అవ్వడానికి విజయ్ దేవరకొండ అగ్రెసివ్ బిహేవియర్ కూడా మరో కారణమని ఆర్జీవీ అన్నారు.
వినయం కూడా ఇక్కడ మరో కారణం. హిందీ ప్రజలు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, ప్రభాస్ లాంటి హీరోల వినయానికి ఫిదా అయ్యారు. ఈ హీరోల డౌన్ టూ ఎర్త్ ప్రవర్తన వారిని ఆకర్షించింది. సౌత్ స్టార్ల ప్రవర్తన వారిని ఆశ్చర్యపోయేలా చేసింది. అలాంటి సమయంలో విజయ్ లైగర్ వేడుకల్లో తన అగ్రెసివ్ బిహేవియర్.. వారిని నొప్పించేలా చేసింది. దూకుడైన ప్రసంగాలు అతడికి అహంకారం ఎక్కువుందని అనుకునేలా చేసింది. అని రామ్ గోపాల్ వర్మ స్పష్టం చేశారు.
విజయ్ దేవరకొండ నటించిన లైగర్ చిత్రం ఆగస్టు 25న విడుదలై ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. ఈ చిత్రానికి పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహించారు. ఆయనతో పాటు కరణ్ జోహార్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. ఇది విజయ్‌కు హిందీలో తొలి చిత్రం. రమ్య కృష్ణ ఇందులో రౌడీ హీరోకు తల్లి పాత్రలో కనిపించింది. అనన్యా పాండే హీరోయిన్ కాగా.. రోనిత్ రాయ్ విజయ్‌కు కోచ్ పాత్రలో కనిపించారు. తెలుగుతో పాటు తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లోనూ ఈ సినిమా ఏకకాలంలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
సంబంధిత కథనం