హాలీవుడ్ రేంజ్ తెలుగు సినిమాలివే.. ఎందులోనూ తగ్గేదేలే
24 January 2022, 21:44 IST
- విభిన్న కథాంశాలంటే హాలీవుడ్ చిత్రాలే అనే సంప్రదాయాన్ని పక్కనపెడుతూ తెలుగులోనూ వైవిధ్యంతో కూడిన సినిమాలను తెరకెక్కిస్తున్నారు. హాలీవుడ్‌కు ఏ మాత్రం తీసిపోని విధంగా వీటిలో కొన్ని చిత్రాలు అద్భుత విజయాలను అందుకున్నాయి. వీటిలో బాహుబలి లాంటి సోషియో ఫాంటసీల నుంచి 1 నేనొక్కడినే లాంటి సైకలాజికల్ థ్రిల్లర్లు కూడా ఉన్నాయి. మరి వాటిలో కొన్ని చిత్రాల గురించి ఇప్పుడు చూద్దాం.
హాలీవుడ్ రేంజ్ తెలుగు చిత్రాలు
నాలుగు ఫైట్లు, ఆరు పాటలు, ప్రత్యేకమైన కామెడీ ట్రాక్, కొన్ని సెంటిమెంట్ సీన్లు.. ఇవీ ఒకప్పుడు తెలుగు సినిమాలంటే ఉండే భావన. ఎక్కువగా ఇదే రొటీన్ ఫాలో అవుతారని, కమర్షియల్ హంగులకే ప్రాధాన్యత ఇస్తారని విమర్శకులు చురకలంటిస్తారు. ఇందులో నిజం లేకపోలేదు. అయితే ఇటీవల కాలంలో ఈ ధోరణి మారింది. ప్రయోగాత్మక చిత్రాలతో పాటు విభిన్న జోనర్లపై దృష్టి పెడుతున్నారు దర్శకనిర్మాతలు. విభిన్న కథాంశాలంటే హాలీవుడ్ చిత్రాలే అని సాంప్రదాయాన్ని పక్కనపెడుతూ తెలుగులోనూ వైవిధ్యంతో కూడిన సినిమాలను తెరకెక్కిస్తున్నారు. హాలీవుడ్‌కు ఏ మాత్రం తీసిపోని విధంగా వీటిలో కొన్ని చిత్రాలు అద్భుత విజయాలను అందుకున్నాయి. వీటిలో బాహుబలి లాంటి సోషియో ఫాంటసీల నుంచి 1 నేనొక్కడినే లాంటి సైకలాజికల్ థ్రిల్లర్లు కూడా ఉన్నాయి. మరి వాటిలో కొన్ని చిత్రాల గురించి ఇప్పుడు చూద్దాం.
బాహుబలి..
తెలుగు సినిమానే కాదు.. భారతీయ చిత్రాల స్థాయిని పెంచిన మూవీ.. బాహుబలి అంటే అతిశయోక్తి కాదేమో. ఎందుకంటే దేశంలోనే అతిపెద్ద లైవ్ యాక్షన్‌గా తెరకెక్కిన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా భారీ విజయాన్ని అందుకుంది. టాలీవుడ్ సంచలన దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి రూపొందించిన ఈ సినిమా అప్పటి వరకు ఉన్న బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టింది. రెండు భాగాలుగా తెరకెక్కిన ఈ చిత్రం భారతీయ సినిమా గొప్పదనాన్ని ప్రపంచానికి చూపించింది. ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా, రమ్యకృష్ణ, సత్యరాజ్, నాజర్ లాంటి నటులు ప్రధాన పాత్రల్లో రూపొందించిన ఈ సినిమా కలెక్షన్ల సునామీని సృష్టించింది.
1 నేనొక్కడినే..
సైకలాజికల్ థ్రిల్లర్లు తెలుగులో తక్కువనే చెప్పాలి. హాలీవుడ్లో ఈ జోనర్లో వచ్చిన సినిమాలు కోకొల్లలు. అయితే హాలీవుడ్ చిత్రాలకు ఏ మాత్రం తీసిపోని విధంగా దర్శకుడు సుకుమార్ మహేశ్ బాబుతో 1 నేనొక్కడినే రూపొందించారు. కథాంశం కొత్తగా ఉండటమో, తెలుగు ప్రేక్షకులు ఇలాంటి తరహా కథలకు కనెక్ట్ అవ్వలేకపోవడమో తెలియదు కానీ.. విడుదలైనప్పుడు ఈ సినిమా అంతగా ఆడలేదు. అయితే విమర్శకుల నుంచి మాత్రం ప్రశంసలు అందుకుంది. ముఖ్యంగా వైవిధ్యమైన చిత్రాలను చూడాలనుకునేవారికి ఈ సినిమా బాగా నచ్చుతుంది. ఇప్పటికీ ఇందులోని కొన్ని సన్నివేశాలు బాగా ఆకట్టుకుంటాయి.
నాన్నకు ప్రేమతో..
జూనియర్ ఎన్టీఆర్‌ను ఎప్పుడూ మాస్ హీరోగా మాత్రమే చూసిన ప్రేక్షకులకు మొదటిసారిగా ఓ ఇంటిలిజెంట్, క్లాస్ పాత్రలో చూపించి అబ్బురపరిచాడు డైరెక్టర్ సుకుమార్. టైటిల్ కు తగినట్లుగానే తన తండ్రి చివరి కోరిక తీర్చడం కోసం అభిరామ్ అనే యువకుడు ఎలాంటి రిస్క్ తీసుకున్నాడనేది చిత్ర కథాంశం. ఇందులో హీరోతో పాటు ప్రతినాయకుడిగా నటించిన జగపతిబాబు గురించి కూడా చెప్పుకోవాలి. తెలివైన విలన్ పాత్రలో ఆయన నటన అద్వితీయం. ముఖ్యంగా బాల్ గేమ్ సన్నివేశమైతే ప్రేక్షకులను కట్టిపడేస్తుంది. దీంతో పాటు క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్‌ను చూస్తే ఆశ్చర్యపోవడం ప్రేక్షకుల వంతవుతుంది.
ఘాజీ..
కెరీర్ ప్రారంభం నుంచి వైవిధ్యమైన కథలనే ఎంపిక చేసుకుంటూ దూసుకెళ్తున్నాడు రానా. అలా ఆయన చేసిన చిత్రాల్లో ఘాజీ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. తెలుగులో ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా జాతీయ పురస్కారాన్ని అందుకున్న ఘాజీ.. 1971 భారత్-పాకిస్థాన్ యుద్ధ నేపథ్యంలో జరుగుతుంది. అయితే ఈ సినిమా కథ అంతా జలాంతర్గాముల చుట్టూ తిరిగుతుంది. పాక్ సబ్‌మెరైన్ పీఎన్ఎస్ ఘాజీ, ఇండియన్ సబ్‌మెరైన్ ఎస్21 మధ్య సముద్రంలో జరిగే సంగ్రామాన్ని కొత్త దర్శకుడు సంకల్ప్ రెడ్డి కళ్లకు కట్టినట్లు చూపించాడు. చాలా సన్నివేశాలు ప్రేక్షకులను సీట్ ఎడ్జ్‌లో కూర్చోపెడుతుంది. తెలుగుతో పాటు హిందీ, తమిళంలోనూ ఈ సినిమా విడుదలైంది.
ఈగ..
ఈగను హీరోగా పెట్టి సినిమా తీసి బంపర్ హిట్ కొట్టడమే కాదు ప్రపంచ వ్యాప్తంగా విమర్శకుల ప్రశంసలు అందుకున్న దర్శకుడు ఎవరైనా ఉన్నారంటే అది రాజమౌళి మాత్రమే. కేవలం హాలీవుడ్లో మాత్రమే సాధ్యమయ్యే ఇలాంటి విజువల్ వండర్‌ను తెలుగులో తీసి దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. సమంత, నాని, సుదీప్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా బంపర్ హిట్‌ను అందుకుంది. సింపుల్ రివేంజ్ స్టోరీని రాజమౌళి ఓ ఈగను పెట్టి విజువల్ వండర్‌గా తెరకెక్కించి సక్సెస్ అయ్యారు.
అంతరిక్షం..
స్పేస్ బ్యాక్‌డ్రాప్‌లో తెలుగులో వచ్చిన మొదటి చిత్రం అంతరిక్షం. ఘాజీ దర్శకుడు సంకల్ప్ రెడ్డి తెరకెక్కించిన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. థియేటర్లలో ఓ మోస్తరుగా ఆడిన ఈ చిత్రం మంచి ప్రయత్నంగా గుర్తింపు తెచ్చుకుంది. వరుణ్ తేజ్, అదితి రావ్ హైదరీ, సత్యరాజ్ ముఖ్యపాత్రలు పోషించిన ఈ సినిమా ఆకట్టుకుంటోంది. స్పేస్‌లోకి వెళ్లి కొంతమంది వ్యోమగాములు కొన్ని అనివార్య పరిస్థితుల్లో తీసుకునే నిర్ణయాలు ఉత్కంఠను కలిగిస్తాయి.
ఆదిత్య 369..
తెలుగులో టైమ్ ట్రావెల్ కాన్సెప్టుతో తెరకెక్కిన ఈ సినిమాకు ఇప్పటికీ ఎంతో మంది అభిమానులున్నారు. తెలుగు నెటివిటీకి తగినట్లుగా తీసిన ఈ చిత్రంలో బాలకృష్ణ డ్యూయల్ రోల్స్ పోషించారు. ఇండియన్ స్పీల్ బర్గ్ గా పిలిచే సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వం వహించిన ఈ చిత్రం అప్పట్లో ఓ మోస్తరుగా ఆడింది. శ్రీకృష్ణదేవరాయలు పాత్రలో బాలకృష్ణ ఒదిగిపోయారనే చెప్పాలి. అమ్రీశ్ పూరీ, మోహిని, గొల్లపూడి మారుతీరావు, సిల్క్ స్మిత తదితరులు ఇందులో నటించారు.