Super Singer Auditions: హైదరాబాద్‌లో సూపర్ సింగర్ ఆడిషన్స్.. ఎప్పుడు? ఎక్కడికి వెళ్లాలి?
12 October 2023, 16:45 IST
- Super Singer Auditions: హైదరాబాద్‌లో స్టార్ మా ఛానెల్ సూపర్ సింగర్ ఆడిషన్స్ జరగనున్నాయి. అక్టోబర్ 15న అమీర్‌పేటలోని సారథి స్టూడియోస్ లో ఈ ఆడిషన్స్ ఉంటాయి.
స్టార్ మాలో రానున్న సూపర్ సింగర్ షో
Super Singer Auditions: ప్రముఖ తెలుగు ఎంటర్‌టైన్మెంట్ ఛానెల్ స్టార్ మాలో వచ్చే సూపర్ హిట్ రియాలిటీ షో సూపర్ సింగర్. ఇప్పుడీ షో కొత్త సీజన్ కోసం ఆడిషన్స్ నిర్వహించనున్నారు. ఇవి హైదరాబాద్ నగరంలో జరుగుతాయి. వచ్చే ఆదివారం (అక్టోబర్ 15) అమీర్‌పేటలోని సారథి స్టూడియోస్ లో సూపర్ సింగర్ ఆడిషన్స్ జరుగుతాయని ఛానెల్ వెల్లడించింది.
అయితే ఈ ఆడిషన్స్ లో పాల్గొనాలనుకునే వాళ్లకు కొన్ని నిబంధనలు విధించారు. కంటెస్టెంట్ల వయసు 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. మంచి వాయిస్ మీ సొంతమని మీరు భావిస్తే ఆదివారం ఉదయం 9 గంటలకల్లా సారథి స్టూడియోస్ కు వెళ్లాల్సి ఉంటుంది. అక్కడ న్యాయనిర్ణేతలు అందరు పాడే పాటలను విని.. సూపర్ సింగర్ షోలో పాల్గొనే వారిని ఎంపిక చేస్తారు.
తెలుగు రాష్ట్రాల్లో స్టార్ మా ఛానెల్ ఇప్పటి వరకూ ఈ సూపర్ సింగర్ ప్రోగ్రామ్ ద్వారా ఎంతో మంది టాలెంటెడ్ సింగర్లను వెతికి పట్టుకుంది. తెలుగులోని టాప్ ఛానెల్స్ లో ఒకటైన స్టార్ మా ఛానెల్లో పాడే అవకాశం దక్కించుకున్నారంటే సినిమాల్లో పాడాలన్న మీ కల వైపు మరో అడుగు ముందుకు వేసినట్లే. ఏపీ, తెలంగాణల్లోని టాలెంటెడ్ యువ సింగర్స్ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఛానెల్ కోరుతోంది.
స్టార్ మాలో సూపర్ సింగర్ తోపాటు సూపర్ సింగర్ జూనియర్ షోలు కూడా గతంలో ఆకట్టుకున్నాయి. తాజాగా మరోసారి సీనియర్ కేటగిరీలో ఈ సింగింగ్ కాంపిటీషన్ జరగనుంది. ఈ ఆడిషన్స్ లో ఎంపికైన వారు.. ప్రధాన షోలో పార్టిసిపేట్ చేయడానికి అర్హత సాధిస్తారు. ఈ ఆడిషన్స్ లో పాల్గొనాలనుకునే వాళ్లు మరింత సమాచారం కోసం కల్యాణ్ చక్రవర్తి అనే వ్యక్తిని 9381340098 నంబర్ ద్వారా కాంటాక్ట్ అవచ్చు.