Shriya Web Series: శ్రియ నటిస్తున్న వెబ్ సిరీస్ ట్రైలర్ వచ్చేసింది.. ఆ ఎపిసోడ్ల స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
28 June 2024, 17:43 IST
- Shriya Web Series: అందాల నటి శ్రియ శరణ్ నటించిన వెబ్ సిరీస్ షోటైమ్ సెకండ్ పార్ట్ ట్రైలర్ రిలీజైంది. ఇప్పటికే నాలుగు ఎపిసోడ్లు రాగా.. మిగిలిన ఎపిసోడ్లు కూడా వచ్చే నెలలో రాబోతున్నాయి.
శ్రియ నటిస్తున్న వెబ్ సిరీస్ ట్రైలర్ వచ్చేసింది.. ఆ ఎపిసోడ్ల స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Shriya Web Series: ఒకప్పుడు టాలీవుడ్ ను ఊపేసిన శ్రియ శరణ్ ఇప్పటికీ అడపాదడపా సినిమాలు, వెబ్ సిరీస్ లతో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ మధ్యే హిందీలో ఆమె నటించిన వెబ్ సిరీస్ షోటైమ్ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ లో స్ట్రీమింగ్ అయింది. అయితే మార్చిలో వచ్చిన ఈ సిరీస్ తొలి నాలుగు ఎపిసోడ్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. మిగిలిన ఎపిసోడ్లు జులై 12న రానుండగా.. శుక్రవారం (జూన్ 28) మేకర్స్ ట్రైలర్ రిలీజ్ చేశారు.
షోటైమ్ వెబ్ సిరీస్ ట్రైలర్
బాలీవుడ్ తెర వెనుక కహానీలను కళ్ల ముందుకు తెచ్చే ప్రయత్నం చేసిందీ షోటైమ్ వెబ్ సిరీస్. ఇందులో ప్రముఖ నటుడు ఇమ్రాన్ హష్మితోపాటు శ్రియ, మహిమా మఖ్వానా, రాజీవ్ ఖండేల్వాల్ నటించారు. విక్టరీ స్టూడియోస్, దాని వారసత్వ హక్కుల కోసం ఇద్దరు సవితి అన్నాచెల్లెళ్ల మధ్య జరిగే పోరే ఈ షోటైమ్ వెబ్ సిరీస్. ఇందులో శ్రియ కూడా ఓ కీలకపాత్ర పోషించింది.
జులై 12న ఈ సిరీస్ అన్ని ఎపిసోడ్లు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. దీంతో తాజాగా ఈ పార్ట్ 2 కోసం ట్రైలర్ రిలీజ్ చేశారు. ఇందులో విక్టరీ స్టూడియోస్ కుర్చీ కోసం అన్నాచెల్లెళ్ల మధ్య వార్ మరింత ముదిరినట్లుగా కనిపిస్తోంది. ఎత్తులుపైఎత్తులు, సినిమా ప్రపంచం తెర వెనుక కథలు ఎలా ఉంటాయో తెలుసుకోవాలంటే ఈ వెబ్ సిరీస్ మిస్ కావద్దు.
షోటైమ్ తొలి భాగంలో ఏం జరిగిందంటే..
గత మార్చి నెలలోనే డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఈ షోటైమ్ వెబ్ సిరీస్ తొలి నాలుగు ఎపిసోడ్లను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చింది. ఒకరకంగా ఓ సినిమాను ఇంటర్వెల్ వరకే చూపించి తర్వాత ఆపేస్తే ఎలా ఉంటుందో ఈ సిరీస్ చూసిన ప్రేక్షకులకు కూడా అదే ఫీలింగ్ కలిగింది. దీంతో మిగిలిన ఎపిసోడ్ల కోసం మూడు నెలలుగా వేచి చూస్తున్నారు.
ఈ నేపథ్యంలో తొలి నాలుగు ఎపిసోడ్లలో ఏం జరిగిందో ఒకసారి చూద్దాం. షోటైమ్ వెబ్ సిరీస్ తొలి నాలుగు ఎపిసోడ్లు ఇప్పటికే హాట్‌స్టార్ లో అందుబాటులో ఉన్నాయి. విక్టరీ స్టూడియోస్ కు చెందిన విక్టర్ ఖన్నా (నసీరుద్దీన్ షా) కన్ను మూసిన తర్వాత దానిని చేజిక్కించుకోవడానికి అన్నచెళ్లెళ్ల మధ్య జరిగే సమరాన్ని ఈ షోలో చూపించారు. విక్టర్ ఖన్నాకు తొలి భార్య ద్వారా రఘు ఖన్నా (ఇమ్రాన్ హష్మి) అనే ఒక కొడుకు ఉండగా.. రహస్యంగా మరో మహిళ ద్వారా మహికా నందీ (మహిమా మఖ్వానా) అనే మరో అమ్మాయి ఉంటుంది.
ఆమె తన తండ్రి విక్టర్ ఖన్నా అని తెలియక ఓ ఫిల్మ్ జర్నలిస్టుగా పని చేస్తూ ఉంటుంది. విక్టర్ ఖన్నా చనిపోయే ముందు అసలు నిజాన్ని ఆమెకు చెబుతాడు. అతడు కన్ను మూసిన తర్వాత విక్టరీ స్టూడియోస్ మహికా నందీ సొంతమవుతుంది. అది సహించలేని రఘు ఖన్నా పోటీగా మరో స్టూడియో పెడతాడు. ఈ అన్నచెళ్లెళ్ల మధ్య నడిచే ఈ వార్ రసవత్తరంగా ఉన్న సమయంలో తొలి నాలుగు ఎపిసోడ్లు ముగిశాయి.
ఇప్పుడు మిగిలిన ఎపిసోడ్లలో వీళ్లలో ఎవరు పైచేయి సాధించబోతున్నారు? విక్టరీ స్టూడియోస్ భవిష్యత్తు ఏంటి అన్నది తేలనుంది. ఈ సిరీస్ లో అర్మాన్ సింగ్ (రాజీవ్ ఖండేల్వాల్) అనే స్టార్ యాక్టర్ భార్య మందిరా సింగ్ పాత్రలో శ్రియ శరణ్ నటించింది.