OTT Web Series: శ్రియ నటించిన ఆ వెబ్ సిరీస్ అన్ని ఎపిసోడ్లు వచ్చేస్తున్నాయ్.. తెర వెనుక సినిమా ప్రపంచాన్ని చూస్తారా?
OTT Web Series: సినిమా ప్రపంచం తెర వెనుక ఎలా ఉంటుందో చూపించిన షోటైమ్ వెబ్ సిరీస్ మిగిలిన ఎపిసోడ్లు కూడా వచ్చేస్తున్నాయి. ఈ విషయాన్ని డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ శుక్రవారం (జూన్ 21) అనౌన్స్ చేసింది.
OTT Web Series: సినిమా సగమే చూపించి ఆపేస్తే ఎలా ఉంటుంది? ఓ వెబ్ సిరీస్ ను కూడా నాలుగు ఎపిసోడ్ల పాటు చూపించి.. తర్వాతి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో అన్న ఆసక్తి మధ్య వేచి చూసేలా చేసినా అలాగే ఉంటుంది. అయితే ఆ మిగిలిన ఎపిసోడ్లు కూడా త్వరలోనే ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి. మనం చెప్పుకోబోయేది డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్న షోటైమ్ (Showtime) వెబ్ సిరీస్ గురించి కావడం విశేషం.

షోటైమ్ అన్ని ఎపిసోడ్లు వచ్చేస్తున్నాయ్..
షోటైమ్ వెబ్ సిరీస్ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ లో మూడు నెలల కిందట స్ట్రీమింగ్ అయింది. బాలీవుడ్ స్టార్ హీరో ఇమ్రాన్ హష్మి నటించిన ఈ సిరీస్ నాలుగు ఎపిసోడ్లు మాత్రమే అప్పుడు వచ్చాయి. బాలీవుడ్ లో పవర్ కోసం తెర వెనుక జరిగే తతంగాన్ని ఈ సిరీస్ ద్వారా మేకర్స్ చూపించే ప్రయత్నం చేశారు. ఈ సిరీస్ లో రఘు ఖన్నా పాత్రలో ఇమ్రాన్ నటించాడు.
ఈ షోటైమ్ మిగిలిన ఎపిసోడ్లు కూడా జులై 12 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు తాజాగా హాట్‌స్టార్ వెల్లడించింది. కరణ్ జోహార్ కు చెందిన ధర్మాటిక్ ఎంటర్టైన్మెంట్ ఈ సిరీస్ ను తెరకెక్కించింది. ఇమ్రాన్ హష్మితోపాటు మహిమా మఖ్వానా, మౌనీ రాయ్, రాజీవ్ ఖండేల్వాల్, శ్రియ శరణ్, విజయ్ రాజ్ లాంటి వాళ్లు నటించారు. సుమిత్ రాయ్, మిహిర్ దేశాయ్ ఈ షోని క్రియేట్ చేశారు.
తొలి నాలుగు ఎపిసోడ్లు ఇలా..
షోటైమ్ వెబ్ సిరీస్ తొలి నాలుగు ఎపిసోడ్లు ఇప్పటికే హాట్‌స్టార్ లో అందుబాటులో ఉన్నాయి. విక్టరీ స్టూడియోస్ కు చెందిన విక్టర్ ఖన్నా (నసీరుద్దీన్ షా) కన్ను మూసిన తర్వాత దానిని చేజిక్కించుకోవడానికి అన్నచెళ్లెళ్ల మధ్య జరిగే సమరాన్ని ఈ షోలో చూపించారు. విక్టర్ ఖన్నాకు తొలి భార్య ద్వారా రఘు ఖన్నా (ఇమ్రాన్ హష్మి) అనే ఒక కొడుకు ఉండగా.. రహస్యంగా మరో మహిళ ద్వారా మహికా నందీ (మహిమా మఖ్వానా) అనే మరో అమ్మాయి ఉంటుంది.
ఆమె తన తండ్రి విక్టర్ ఖన్నా అని తెలియక ఓ ఫిల్మ్ జర్నలిస్టుగా పని చేస్తూ ఉంటుంది. విక్టర్ ఖన్నా చనిపోయే ముందు అసలు నిజాన్ని ఆమెకు చెబుతాడు. అతడు కన్ను మూసిన తర్వాత విక్టరీ స్టూడియోస్ మహికా నందీ సొంతమవుతుంది. అది సహించలేని రఘు ఖన్నా పోటీగా మరో స్టూడియో పెడతాడు. ఈ అన్నచెళ్లెళ్ల మధ్య నడిచే ఈ వార్ రసవత్తరంగా ఉన్న సమయంలో తొలి నాలుగు ఎపిసోడ్లు ముగిశాయి.
ఇప్పుడు మిగిలిన ఎపిసోడ్లలో వీళ్లలో ఎవరు పైచేయి సాధించబోతున్నారు? విక్టరీ స్టూడియోస్ భవిష్యత్తు ఏంటి అన్నది తేలనుంది. ఈ సిరీస్ లో అర్మాన్ సింగ్ (రాజీవ్ ఖండేల్వాల్) అనే స్టార్ యాక్టర్ భార్య మందిరా సింగ్ పాత్రలో శ్రియ శరణ్ నటించింది. ఈ షోటైమ్ బాలీవుడ్ తెర వెనుక కథలను కళ్లకు కట్టేలా చూపించింది. దీంతో మిగిలిన ఎపిసోడ్ల కోసం మూడు నెలలుగా ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు.