Sharathulu Varthisthai Review: షరతులు వర్తిస్తాయి రివ్యూ.. మధ్య తరగతి కుటుంబాల జీవితాన్ని ఎలా చూపించారంటే?
15 March 2024, 15:52 IST
Sharathulu Varthisthai Review In Telugu: తెలంగాణ మధ్య తరగతి జీవితాల ఆధారంగా తెరకెక్కిన సినిమా షరతులు వర్తిస్తాయి. కుమారా స్వామి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా తాజాగా శుక్రవారం (మార్చి 15) థియేటర్లలోకి వచ్చింది. మరి ఈ మూవీ ఎలా ఉందో షరతులు వర్తిస్తాయి రివ్యూలో చూద్దాం.
షరతులు వర్తిస్తాయి రివ్యూ.. మధ్య తరగతి కుటుంబాల జీవితాన్ని ఎలా చూపించారంటే?
టైటిల్: షరతులు వర్తిస్తాయి
నటీనటులు: చైతన్య రావు, భూమి శెట్టి, నంద కిశోర్, పెద్దింటి అశోక్ కుమార్, స్వర్ణ కిలరి, గుంటుల రాధికా, ఆర్జే అవినాష్ తదితరులు
రచన, దర్శకత్వం: కుమార స్వామి
నిర్మాతలు: శ్రీలత, నాగార్జున సామల, శారదా శ్రీష్ కుమార్ గుండా, విజయ్, డాక్టర్ కృష్ణకాంత్ చిత్తజల్లు
సంగీతం: అరుణ్ చిలువేరు, సరేష్ బొబ్బిలి (పన్నెండు గుంజల)
బీజీఎమ్: ప్రిన్స్ హెన్రీ
సినిమాటోగ్రఫీ: ప్రవీణ్ వనమాలి, శేఖర్ పోచంపల్లి
ఎడిటింగ్: సీహెచ్ వంశీ కృష్ణ, గజ్జల రక్షిత్ కుమార్
డైలాగ్స్: పెద్దింటి అశోక్ కుమార్
విడుదల తేది: మార్చి 15, 2024
Sharathulu Varthisthai Review Telugu: యూట్యూబ్ సిరీస్‌తో పేరు తెచ్చుకుని తర్వాత సినిమాల్లో తనకంటూ స్థానం సంపాదించుకున్నాడు చైతన్య రావు. తాజాగా చైతన్య రావు నటించిన సినిమా షరతులు వర్తిస్తాయి. ఈ సినిమాతో కన్నడ బిగ్ బాస్ ద్వారా పాపులర్ అయిన భూమి శెట్టి హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. డైరెక్టర్ కుమార స్వామి దర్శకత్వం వహించిన ఈ సినిమా తాజాగా మార్చి 15న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి మిడిల్ క్లాస్ నేపథ్యంలో వచ్చిన షరతులు వర్తిస్తాయి ఆకట్టుకుందా లేదా అనేది రివ్యూలో తెలుసుకుందాం.
కథ:
చిరంజీవి (చైతన్య రావు) తండ్రి లేని మిడిల్ క్లాస్ వ్యక్తి. అతనికి అమ్మ, చెల్లి, తమ్ముడు ఉంటారు. కుటుంబ బాధ్యత చిరంజీవిపైనే ఉంటుంది. నీటి పారుదల శాఖలో క్లర్క్‌గా పనిచేస్తున్న చిరంజీవి.. స్టేషనరీ షాప్‌లో పని చేసే విజయశాంతి (భూమి శెట్టి) ప్రేమించుకుంటారు. కులాలు వేరు అయినా కష్టపడి ఇరు కుటుంబాలను ఒప్పించి పెళ్లి చేసుకుంటారు. ఈ క్రమంలోనే వారు నివసించే ఏరియాలోకి చైన్ సిస్టమ్ వంటి బిజినెస్ వస్తుంది. కొంత డబ్బు కట్టి ఇంకో నలుగురిని జాయిన్ చేపిస్తే చాలా డబ్బు వస్తుందని కంపెనీ ఆశ చూపిస్తుంది.
చైన్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కార్పొరేటర్ అవుదామనుకుంటున్న శంకరన్నని వాడుకుంటారు. అలా అందరి దగ్గరి దగ్గర డబ్బులు వసూలు చేస్తారు. అయితే చిరంజీవి మాత్రం ఈ స్కీమ్‌ను ఎవరు చెప్పిన నమ్మడు. కానీ, తన అప్పులు తీర్చడానికి, భార్యతో ఓ షాప్ పెట్టించడానికి దాచిన డబ్బును చిరంజీవి భార్య విజయశాంతి చైన్ సిస్టమ్ బిజినెస్‌లో పెడుతుంది. చిరంజీవికి ఈ విషయం తెలిసేలోపు కంపెనీ బోర్డ్ తిప్పేస్తుంది. దాంతో చిరంజీవి కుటుంబం రోడ్డున పడుతుంది.
హైలెట్స్
రోడ్డుపాలు అయిన తన కుటుంబం కోసం చిరంజీవి ఏం చేశాడు? ఆ కంపెనీ ఎవరిది తనను వాడుకున్న శంకరన్న ఏం చేశాడు? కార్పోరేటర్ అయ్యాడా ఎలక్షన్స్ ఏమయ్యాయి? తనవల్లే డబ్బులు పోయాయనే బాధలో ఉన్న విజయశాంతి ఏం చేసింది? తమ డబ్బులు తమకు వచ్చాయా? అనే ఆసక్తికర విషయాలు తెలియాలంటే షరతులు వర్తిస్తాయి మూవీ చూడాల్సిందే.
విశ్లేషణ:
ప్రమోషన్స్‌లో చెప్పినట్లుగానే షరతులు వర్తిస్తాయి మధ్యతరగతి కుటుంబాల తీరును చూపించారు. సినిమా అంతా తెలంగాణ నేపథ్యంలో సాగుతుంది. మిడిల్ క్లాస్ వాళ్లకు ఎలా షరతులు ఉంటాయో అన్న అర్థంలో టైటిల్ పెట్టారని చెప్పుకోవచ్చు. ఇక డబ్బు ఆశ చూపించి ఆఖరుకు మోసం చేసేందుకు మిడిల్ క్లాస్ వాళ్లను కంపెనీలు ఎలా టార్గెట్ చేస్తాయో సినిమాలో బాగా చూపించారు. కూడబెట్టిన డబ్బు పోగొట్టుకుని కుటుంబాలు పడే బాధను ఆవిష్కరించారు.
ఎమోషనల్ సీన్స్-సెకండాఫ్‌పై ఇంట్రెస్ట్
షరతులు వర్తిస్తాయి ఫస్టాఫ్ అంతా చిరంజీవి, విజయశాంతి ప్రేమాయణం, పెళ్లి, చైన్ సిస్టమ్ బిజినెస్‌లో ఎంతోమంది మధ్యతరగతి వాళ్లు జాయిన్ కావడం వంటి సీన్లతో ఎమోషనల్‌గా బాగా సాగుతుంది. బోర్డ్ తిప్పేసే ట్విస్టుతో సెకండాఫ్‌పై ఇంట్రెస్ట్ పెంచారు. సెకండాఫ్‌లో పోగొట్టుకున్న డబ్బులు ఎలా సంపాదించారు, కార్పొరేటర్ ఎలక్షన్స్ వంటి సీన్లతో బాగుంటుంది. ఇక క్లైమాక్స్ ట్విస్ట్ బాగున్నా సోషల్ మీడియా వాడకం, ఫాస్ట్ నెరేషన్‌తో ముగించారు.
సినిమాటిక్ లిబర్టీ
ఫస్టాఫ్‌లో చూపించినంత రియలిస్టిక్ మూమెంట్స్ క్లైమాక్స్ వచ్చేసరికి ఉండదు. ఇక్కడ సినిమాటిక్ లిబర్టీ తీసుకున్నట్లు అనిపిస్తుంది. ఇక పోతే చాలా వరకు రియల్ లొకేషన్స్‌లో చాలా వరకు రియలిస్టిక్‌గా సినిమాను తెరకెక్కించారు. తెలంగాణ నేటివిటీ, మధ్యతరగతి కుటుంబాల అనుబంధం, ఎమోషనల్ సీన్స్ అంతా వర్కౌట్ అయ్యాయి. వాటికి పాత్రలు మంచి నటనతో ప్రాణం పోశారు. చిరంజీవిగా చైతన్య రావు ఆకట్టుకున్నాడు.
మెప్పించిన పాత్రలు
సినిమా మొత్తం చైతన్య రావే కనిపిస్తాడు. అలాగే లవర్‌గా మధ్యతరగతి గృహిణిగా భూమి శెట్టి తన నటనతో అలరించింది. అలాగే పెద్దింటి అశోక్ కుమార్‌తో సహా ఇతరులు తమ పాత్రలతో మెప్పించారు. సినిమాటోగ్రఫీ బాగుంది. విజువల్స్, నిర్మాణ విలువలు ఓకే. బీజీఎమ్ ఆకట్టుకుంటుంది. పెళ్లి సాంగ్ ఒకటి తప్పా మిగతావి యావరేజ్ అనిపించేలా ఉన్నాయి. డైరెక్టర్ కుమార స్వామి టేకింగ్ బాగుంది. చాలా వరకు సీన్స్ రియలిస్టిక్‌గా వచ్చేలా చూసుకున్నారు.
ఫైనల్‌గా చెప్పాలంటే?
Sharathulu Varthisthai Telugu Review: ఫైనల్‌గా చెప్పాలంటే చైన్ సిస్టమ్ వంటి బిజినెస్‌తో మిడిల్ క్లాస్ కుటుంబాలు ఎలా మోసపోతాయో చూపించే మెసేజ్ ఒరియెంటెడ్ మూవీ. షరతులు వర్తిస్తాయి ఒక మధ్యతరగతి కుటుంబాల కథ.
రేటింగ్: 2.75/5
టాపిక్