Saw X Review: మనుషులను అతి వికృతంగా చంపే రాక్షసుడు.. హారర్ థ్రిల్లర్ సా ఎక్స్ రివ్యూ
Saw X Movie Review In Telugu: హాలీవుడ్ హారర్ థ్రిల్లర్ ఫ్రాంఛైజీలో సా (Saw) సిరీస్‌కు ఎంతో ప్రత్యేకత ఉంది. ఈ ఫ్రాంఛైజీ నుంచి వచ్చిన పదో సినిమానే సా ఎక్స్ (Saw X). ప్రస్తుతం లయన్స్ గేట్ ప్లే ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోన్న ఈ హారర్ థ్రిల్లర్ ఎలా ఉందో సా ఎక్స్ రివ్యూలో తెలుసుకుందాం.
Saw 10 Review In Telugu: హాలీవుడ్ నుంచి వచ్చిన డిఫరెంట్ ఫ్రాంఛైజీల్లో సా సిరీస్ (Saw Franchise) ఒకటి. హారర్ థ్రిల్లర్ జోనర్‌గా తెరకెక్కుతూ వస్తున్న ఈ ఫ్రాంఛైజీలో ఇప్పటికీ 9 సినిమాలు వచ్చాయి. 2004లో స్టార్ట్ అయిన ఈ సిరీస్ నుంచి 2010 వరకు ప్రతి సంవత్సరం ఒక్కో సినిమాను విడుదల చేశారు మేకర్స్. తర్వాత ఏడేళ్ల గ్యాప్‌తో 2017లో ఈ ఫ్రాంఛైజీ నుంచి 8వ సినిమాగా జిగ్సా (Jigsaw) విడుదలైంది.
అనంతరం 2021లో స్పైరల్ (Spiral Movie) పేరుతో తొమ్మిదో మూవీ రిలీజ్ కాగా గతేడాది అంటే 2023లో సెప్టెంబర్ 23న పదో మూవీగా సా ఎక్స్/సా టెన్ (Saw X/Saw 10) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సుమారు 13 మిలియన్ల డాలర్లతో తెరకెక్కిన ఈ పదో చిత్రం బాక్సాఫీస్ వద్ద 111 మిలియన్ డాలర్లకుపైగా కలెక్షన్స్ సాధించింది. ఇలా ఎంతో సూపర్ హిట్ అయిన సా 10 మూవీ 2024 ఫిబ్రవరి 23 నుంచి లయన్స్ గేట్ ప్లే (Lionsgate Play OTT) ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. మరి టోబిన్ బెల్ (Tobin Bell) సా ఎక్స్ ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.
కథ:
జాన్ క్రేమర్ అలియాస్ జిగ్సా (టోబిన్ బెల్) మనుషులకు బతకడానికి ఛాన్స్ ఇచ్చినట్లు ఇచ్చి అతి క్రూరంగా, వికృతంగా చంపుతుంటాడు. అయితే జాన్ క్రేమర్ బ్రెయిన్ క్యాన్సర్‌తో బాధపడుతుంటాడు. దానికి ఎక్కడా చికిత్స లేదని, కొన్ని నెలల పాటు మాత్రమే బతుకుతావని, ఎలాంటి ప్రయత్నాలు చేయకుండా రెస్ట్ తీసుకోమని వైద్యులు చెబుతారు. ఈ క్రమంలో క్యాన్సర్ బాధితుల గ్రూప్‌కు సంబంధించిన హెన్రీ కెస్ల్రర్ (మైఖేల్ బీచ్).. జాన్‌ను కలిసి తనకు మంచి ట్రీట్‌మెంట్ అందిందిని, తాను ఇప్పుడు హ్యాపీగా బతకగలనని చెబుతాడు.
ట్విస్టులు
ఆ ట్రీట్‌మెంట్ ఇచ్చే వైబ్ సైట్‌ను జాన్‌కు హెన్రీ ఇస్తాడు. దాంతో ఆ వెబ్ సైట్ వాళ్లను కాంటాక్ట్ అవుతాడు జాన్ క్రేమర్. అప్పుడు చికిత్స కండక్ట్ చేస్తున్న డాక్టర్ సిసిలియా పెడర్సన్ (Synnove Macody Lund) జాన్ క్రేమర్‌ను మెక్సీకో రమ్మంటుంది. దాంతో జాన్ మెక్సీకో వెళ్తాడు. మెక్సీకోకు వెళ్లిన జాన్ క్రేమర్‌కు ఏమైంది? ట్రీట్‌మెంట్ జరిగిందా? సిసిలియా పెడర్సన్‌తో పాటు తన హాస్పిటల్ మెంబర్స్‌ను ఎందుకు జాన్ చంపానుకున్నాడు? వారిని ఏ విధంగా చంపాడు? ఈ క్రమంలో ఎదురైన మలుపులు ఏంటీ వంటి ఆసక్తికర అంశాల కథనమే సా ఎక్స్.
విశ్లేషణ:
సా ఫ్రాంఛైజీ నుంచి వచ్చిన దాదాపు అన్ని సినిమాలు హారర్ అండ్ థ్రిల్లర్ జోనర్‌లో ఉంటాయి. కానీ సా ఎక్స్ మాత్రం క్రైమ్ థ్రిల్లర్ మాత్రమే అని చెప్పుకోవాలి. భయపెట్టేంతలా హారర్ ఎలిమెంట్స్ ఏముండవు. కానీ, పాత్రలను చంపే విధానం మాత్రం భయపెడుతుంది. అయితే సా ఎక్స్ మూవీ సా ఫస్ట్ మూవీకి సీక్వెల్ కాగా సా సెకండ్ సినిమాకు ప్రీక్వెల్. దానికి తగినట్లుగానే కథ ఉంటుంది. గత సినిమాల తరహాలోనే ఈ మూవీలో కూడా అతి క్రూరంగా, వికృతంగా చంపుతూ పగ తీర్చుకుంటాడు జాన్ క్రేమర్ అలియాస్ జిగ్సా.
జుగుప్సాకరంగా
ప్రతి సినిమాలో ఉన్నట్లే ఇందులోనూ ఇతరులను చంపేందుకు ఓ కారణం, స్టోరీ ఉంటుంది. అయితే, గత సినిమాలతో పోల్చుకుంటే సా ఎక్స్ పెద్దగా ఆకట్టుకోదు. ఇదే మొదటి సారి చూసే వారికి మాత్రం ఒక డిఫరెంట్ ఫీలింగ్ మాత్రం కలుగుతుంది. తాము ప్రాణాలతో బయటపడేందుకు తమ శరీర అవయాలను త్యాగం చేసే సీన్స జుగుప్సాకరంగా, కళ్లు మూసుకునేలా ఉంటాయి. ఇక ఇందులో ఉండే రక్తపాతం హై ఓల్టేజ్ యాక్షన్ సినిమాల కంటే మించి ఉంటుంది.
ఆకట్టుకునే క్లైమాక్స్
ఇందులో పాత్రలు శరీర అవయవాలను ఎందుకు వదులుకోవాల్సి వస్తదో సినిమా చూస్తేనే బెటర్. లేకుంటే కొత్త ఆడియెన్స్‌కు స్పాయిలర్ అవుతుంది. సా ఎక్స్ మూవీ జాన్ క్రేమర్ మెక్సీకో వెళ్లేవరకు స్లోగా సాగుతుంది. తర్వాత కథలోకి వెళ్తుంది. అక్కడే అసలు గేమ్ మొదలవుతుంది. తర్వాత చివరి అరగంటలో వచ్చే ట్విస్ట్ పర్లేదు. క్లైమాక్స్ కూడా ఆకట్టుకుంటుంది. బీజీఎమ్ బాగుంది. సినిమాటోగ్రఫీ, నిర్మాణ విలువలు కూడా బాగున్నాయి.
ఆమె నటన హైలెట్
కథలో పెద్దగా కొత్తదనం కనిపించదు. ఫ్రాంఛైజీలో ఒక సినిమా చేయాలి అన్నట్లుగా ఉంది. కొన్ని సీన్స్ భయపెట్టిన కొత్తగా ఉంటాయి. కానీ, ఇదివరకు చూసిన వాటితో పోల్చితే పెద్దగా ఆకర్షించవు. ఇక జాన్ క్రేమర్‌గా చేసిన టోబిన్ బెల్ మరోసారి తన నటనతో అదరగొట్టాడు. సిసిలియా పెడర్సన్‌గా చేసిన సిన్నోవే మకోడి లుండ్ టోబిన్‌కు నటనలో గట్టి పోటీ ఇచ్చింది. టోబిన్ తర్వాత తనే హైలెట్. ఇక మిగతా పాత్రలు కూడా పర్వాలేదు.
అడల్ట్ కంటెంట్ ఏం లేదు. కానీ,
Saw X Review Telugu: ఫైనల్‌గా చెప్పాలంటే కెవిన్ గ్రూటెర్ట్ దర్శకత్వం వహించిన సా ఎక్స్ మూవీని సెన్సిబుల్ పర్సన్స్ చూడకపోవడం మంచిది. డిఫరెంట్ థ్రిల్లర్ ట్రై చేద్దామనుకునే వారు మాత్రం ఓసారి ట్రై చేయండి. ఇందుకోసం సా సిరీస్‌లోని మిగతా సినిమాలు చూడాల్సిన అవసరం లేదు. అడల్ట్ కంటెంట్ ఏం లేదు కానీ, ఫ్యామిలీ ఆడియెన్స్ చూసి తట్టుకోలేనంత వయెలెన్స్ ఉంటుంది. కాబట్టి వారు కూడా చూడకపోవడం మంచిది.
రేటింగ్: 2.5/5
టాపిక్