Shankar at Ponniyin Selvan event: భారత్‌లో తొలి పాన్ఇండియా డైరెక్టర్ మణిరత్నం.. డైరెక్టర్ శంకర్ ప్రశంసల వర్షం
07 September 2022, 9:26 IST
- Shankar praises Mani Ratnam in Ponniyin Selvan Event: పొన్నియన్ సెల్వన్ 1 సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌కు ప్రముఖ డైరెక్టర్ శంకర్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో మాట్లాడిన ఆయన.. మణిరత్నం తొలి పాన్ఇండియా డైరెక్టర్ అని కితాబిచ్చారు.
మణిరత్నంపై శంకర్ ప్రశంసల వర్షం
Shankar at Ponniyin Selvan event: ప్రముఖ దర్శక దిగ్గజం మణిరత్నం తెరకెక్కిస్తున్న తాజా చిత్రం పొన్నియన్ సెల్వన్. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ సినిమా తొలి భాగం పొన్నియన్ సెల్వన్-1(PS-1) సెప్టెంబరు 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. పాన్ఇండియా వ్యాప్తంగా విడుదల కానున్న ఈ చిత్రం ట్రైలర్ లాంచ్ ఈవెంట్ మంగళవారం నాడు చెన్నైలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రజినీకాంత్, కమల్ హాసన్‌తో పాటు ప్రముఖ దర్శకులు శంకర్ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన డైరెక్టర్ శంకర్ మణిరత్నంపై ప్రశంసల వర్షం కురిపించారు. ఆయన మొదటి పాన్ఇండియా డైరెక్టర్ అని స్పష్టం చేశారు.
"పాన్ ఇండియా అనే పదం ఈ రోజుల్లో కామన్‌గా వింటున్నాం. మణిరత్నం సార్ మొదటి పాన్ ఇండియా డైరెక్టర్. ఆయన తెరకెక్కించి రోజా, బొంబాయి చిత్రాలు దేశవ్యాప్తంగా అలరించాయి. ఆయన శైలి, పనితీరుకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. మణి సార్ వేసిన మార్గంలోనే మేమంతా వెళ్తున్నాం." అని మణిరత్నంపై శంకర్ ప్రశంసల వర్షాన్ని కురిపించారు. ఈ చిత్రానికి సంగీత దర్శకుడిగా పనిచేసిన ఏఆర్ రెహమాన్‌పై కూడా శంకర్ స్పందించారు.
"రెహమాన్ అదిరిపోయే మ్యూజిక్ అందించారు. తన పాటలతో పొన్నియన్ సెల్వన్ ప్రపంచానికి మనల్నీ తీసుకెళ్లాడు. మణిరత్నం-ఏఆర్ రెహమాన్ కాంబోలో వచ్చిన సాంగ్స్ అంటే నాకు చాలా ఇష్టం. ముఖ్యంగా ఈ సినిమాలో పొంగే నది పాట ఎంతగానో నచ్చింది. ప్రతిభావంతులైన నటీ, నటులు ఇతర సాంకేతిక సిబ్బంది ఇందులో పనిచేశారు. అందరిలానే నేను కూడా ఈ చిత్ర విడుదల కోసం ఎదురుచూస్తున్నాను. తమిళ సినిమాకు పొన్నియన్ సెల్వన్ ఓ మైలురాయిగా నిలుస్తుంది." అని శంకర్ అన్నారు.
రెండు భాగాలుగా తెరకెక్కుతున్న పొన్నియన్ సెల్వన్ మొదటి భాగం సెప్టెంబరు 30న ప్రపంచ వ్యాప్తంగా విడుదలవుతోంది. తమిళంతో పాటు తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ చిత్రం రిలీజ్ కానుంది. ఈ సినిమాలో విక్రమ్, ఐశ్వర్య రాయ్, జయం రవి, కార్తీ, ఐశ్వర్య లక్ష్మీ, త్రిష, శోభితా ధూళిపాల, ప్రభు గణేశన్, శరత్ కుమార్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు.