Dunki Review: డంకీ రివ్యూ.. రిస్క్ చేసిన షారుక్ ఖాన్.. హ్యాట్రిక్ కొట్టాడా?
21 December 2023, 15:25 IST
Dunki Movie Review Telugu: షారుక్ ఖాన్, తాప్సీ, విక్కీ కౌశల్ నటించిన మూవీ డంకీ. డిసెంబర్ 21న అంటే గురువారం ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాతో షారుక్ ఖాన్ హ్యాట్రిక్ కొట్టాడా అనేది డంకీ రివ్యూలో తెలుసుకుందాం.
డంకీ రివ్యూ.. షారుక్ ఖాన్ హ్యాట్రిక్ కొట్టాడా? హిరానీ మార్క్ మిస్సయిందా?
టైటిల్: డంకీ
నటీనటులు: షారుక్ ఖాన్, తాప్సీ, విక్కీ కౌశల్, బొమాన్ ఇరాని, అనిల్ గ్రోవర్, విక్రమ్ కొచ్చర్ తదితరులు
సినిమాటోగ్రఫీ: సీకే మురళీధరన్, మనుష్ నందన్, అమిత్ రాయ్, కుమార్ పంకజ్
నేపథ్య సంగీతం: అమన్ పంత్
స్వరాలు: ప్రీతమ్
నిర్మాతలు: గౌరీ ఖాన్, రాజ్‌కుమార్ హిరానీ, జ్యోతి దేశ్ పాండే
దర్శకత్వం: రాజ్‌కుమార్ హిరానీ
విడుదల తేది: డిసెంబర్ 21, 2023
Dunki Review In Telugu: బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుక్ ఖాన్ ఇటీవల వరుసగా రెండు సినిమాలతో సాలిడ్ హిట్ అందుకున్నాడు. అంతేకాకుండా పఠాన్, జవాన్ సినిమాలు వేల కోట్లు కలెక్ట్ చేసి షారుక్ స్టామినా ఏంటో చూపాయి. ఇప్పుడు హ్యాట్రిక్ కొట్టేందుకు మూడో సినిమాగా డంకీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మరోవైపు మున్నాభాయ్, త్రీ ఇడియట్స్, పీకే, సంజు వంటి బ్లాక్ బస్టర్ హిట్స్ అందించిన రాజ్‌కుమార్ హిరానీ మరోసారి తన మార్క్ చూపించేదుకు వచ్చాడు.
షారుక్ ఖాన్, రాజ్‌కుమార్ హిరానీ వంటి ఇద్దరు స్టార్స్ కాంబినేషన్‌లో వచ్చిన డంకీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ నెపథ్యంలో డిసెంబర్ 21న వరల్డ్ వైడ్‌గా గ్రాండ్‌గా విడుదలైన ఈ సినిమా ఆకట్టుకుందా లేదా అనేది డంకీ రివ్యూలో చూద్దాం.
కథ:
హృదయ్ సింగ్ అలియాస్ హార్డీ సింగ్ (షారుక్ ఖాన్) ఒక సైనికుడు. పఠాన్ కోట్‌లో అతని ప్రాణాలు కాపాడిన వ్యక్తి కోసం లల్టూ వస్తాడు. కానీ, అక్కడ హార్డీకి మను (తాప్సీ) పరిచయం అవుతుంది. మంచి జీవితం కోసం మరో ఇద్దరు స్నేహితులతోపాటు తను లండన్ వెళ్లాలని కల కంటుంది మను. కానీ, ఇంగ్లీష్ సరిగా రాకపోవడంతో వీసాలు రావు. ఇంగ్లీష్ నేర్చుకుందామన్న వంటబట్టదు. దీంతో దొంగతనంగా లండన్‌కు వెళ్లానుకుంటారు.
ఇంట్రెస్టింగ్ పాయింట్స్
మను బ్యాచ్‌కు లండన్ వెళ్లేందుకు హార్డీ ఎలాంటి సహాయం చేశాడు? వాళ్లు ఎలా వెళ్లారు? ఈ ప్రయాణంలో వాళ్లు ఎదుర్కొన్న కష్టాలు, ఇబ్బందులు ఏంటీ? లండన్ వెళ్లిన తర్వాత వాళ్ల జీవితాలు ఎలాంటి మలుపు తిరిగాయి? సుఖీ సింగ్ (విక్కీ కౌశల్) పాత్ర ఏంటీ? అనే విషయాలు తెలియాలంటే డంకీ సినిమా చూడాల్సిందే.
విశ్లేషణ:
రాజ్‌కుమార్ హిరానీ తెరకెక్కించిన మున్నాభాయ్ ఎంబీబీఎస్, త్రీ ఇడియట్స్, సంజు, పీకే వంటి చిత్రాలు ఎలాంటి ఆదరణ దక్కించుకున్నాయో తెలిసిందే. రాజ్‌కుమార్ హిరానీకి హిందీలోనే కాకుండా డైరెక్టర్‌గా దేశవ్యాప్తంగా మంచి మార్క్ ఉంది. మళ్లీ తన మార్క్ కనిపించేలా డంకీ సినిమాను తెరకెక్కించాడు డైరెక్టర్ హిరానీ. సింపుల్ స్టోరీలో తనదైన కాన్‌ఫ్లిక్ట్, కామెడీ, ఎమోషన్స్ చూపించే హిరానీ డంకీ పైకి సాదాసీదా స్టోరీ అనిపించిన అంతర్లీనంగా సందేశం ఇచ్చాడు.
స్ఫూర్తిగా తీసుకుని
అక్రమంగా ఇతర దేశాలకు వెళ్లి అక్కడ వాళ్లు పడే కష్టాలను డంకీ ద్వారా హృద్యంగా చూపించారు హిరానీ. ఇక ఇంగ్లీష్ రాని వాళ్లకు ఇతర దేశాల్లో వీసాలు దొరకవని తెలిసిందే. దాన్ని స్ఫూర్తిగా తీసుకుని మను బ్యాచ్ ఇంగ్లీష్ నేర్చుకునే సీన్ పెట్టినట్లుగా తెలుస్తోంది. ఈ సీన్ కడుపుబ్బ నవ్వించి సినిమాకే హైలెట్ అనిపిస్తుంది.
అయితే కామెడీ వర్కౌట్ అయినా ఎమోషన్స్ కొన్నిచోట్ల అంతగా ఆకట్టుకోవు. షారుక్ ఖాన్ పాత్రలో ఉండే ఎమోషన్‌ను సరిగా చూపించలేకపోయారనిపిస్తుంది. బలవంతంగా ఎమోషన్స్ చూపించిన భావన కలుగుతుంది. ఇక లండన్‌కు అడ్డదారిలో వెళ్లే పాయింట్ కూడా కొత్తగా అనిపించదు.
అదే మైనస్
రాజ్‌కుమార్ హిరానీ సినిమాల్లో ఉండే కోర్ ఎమోషనల్ పాయింట్ మాత్రం మిస్ అయిన వెలితి కనపడుతుంది. దేశభక్తి, సందేశం, కామెడీ బాగున్న ఆసక్తిగా అనిపించదు. క్లైమాక్స్ సాగదీశారు. చివర్లో ట్విస్ట్ ఇచ్చారు. అక్కడక్కడా మెరుపులు తప్పితే పెద్దగా ఆకట్టుకోదు. నేపథ్య సంగీతం ఓకే. పాటలు పర్వాలేదు. సాంకేతిక, నిర్మాణ విలువలు అంతగా బాగోలేవు. వీఎఫ్ఎక్స్ ఏమాత్రం వర్కౌట్ కాలేదు.
హ్యాట్రిక్ కొట్టాడా?
షారుక్ ఖాన్ తన ఇమేజ్ పక్కనపెట్టి ఈ క్యారెక్టర్ చేశాడు. ఇది కాస్తా రిస్క్ అనే చెప్పాలి. షారుక్ కామెడీ ఆకట్టుకుంటుంది. షారుకే వన్ మ్యాన్ షో అనుకోవాలి. తాప్సీ నటన బాగుంది. విక్కీ కౌశల్‌కు మంచి రోల్ పడింది. కానీ పాత్ర నిడివి తక్కువగా ఉంటుంది.
బొమాన్ ఇరానీ, అనిల్ గ్రోవర్, విక్రమ్ కొచ్చర్ ఇతరులు పాత్రపరిధిమేర నటించారు. ఫైనల్‌గా చెప్పాలంటే రాజ్‌కుమార్ హిరానీ మార్క్ తో వచ్చిన డంకీ పూర్తి స్థాయిలో కాకున్నా ఎంటర్టైన్ చేస్తుంది. షారుక్ ఖాన్ కు ఈ ఏడాది పఠాన్, జవాన్ తర్వాత డంకీతో హ్యాట్రిక్ కొట్టినట్లే అనిపిస్తుంది.
రేటింగ్: 2.75/5