Seetha Kalyana Vaibhogame Review: సీతా కళ్యాణ వైభోగమే మూవీ రివ్యూ - టాలీవుడ్ లేటెస్ట్ లవ్‌స్టోరీ ఎలా ఉందంటే?
22 June 2024, 11:44 IST
Seetha Kalyana Vaibhogame Review:సుమన్ తేజ్, గరీమా చౌహన్, గగన్ విహారి ప్రధాన పాత్రల్లో నటించిన సీతా కళ్యాణ వైభోగమే మూవీ శుక్రవారం థియేటర్ల ద్వారా ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సినిమా ఎలా ఉందంటే?
సీతా కళ్యాణ వైభోగమే మూవీ రివ్యూ
Seetha Kalyana Vaibhogame Review: సుమన్ తేజ్, గరీమా చౌహాన్, గగన్ విహారి ప్రధాన పాత్రల్లో నటించిన మూవీ సీతా కళ్యాణ వైభోగమే. సతీష్ పరమవేద దర్శకత్వం వహించిన ఈ సినిమాను యుగంధర్ నిర్మించారు కమర్షియల్ లవ్‌స్టోరీగా తెరకెక్కిన ఈ సినిమా శుక్రవారంథియేటర్లలో రిలీజైంది. కొత్త నటీనటులతో తెరకెక్కిన సీతా కళ్యాణ వైభోగమే ప్రేక్షకులను మెప్పించిందా? లేదా? అంటే…
సీతారాముల ప్రేమకథ...
రామ్ (సుమన్ తేజ్) తండ్రి (శివాజీరాజా) ఓ స్కూల్ టీచర్. దేవరకద్ర అనే ఊళ్లో పనిచేస్తుంటాడు. దేవరకద్ర ఊళ్లోని రాములవారి గుడికి ధర్మకర్తగా జానకిరామయ్య (నాగినీడు) వ్యవహరిస్తుంటాడు. ఊరి పెద్దగా అతడిని అందరూ గౌరవిస్తుంటాడు. జానకిరామయ్య కూతురు సీతను (గరీమా చౌహాన్) రామ్ తొలిచూపులోనే ఇష్టపడతాడు. ఇద్దరు పెళ్లిచేసుకోవాలని అనుకుంటారు.
కానీ సీతను ఆమె బావ రమణ (గగన్ విహారి) ఇష్టపడతాడు. రమణతో సీత ఎంగేజ్‌మెంట్ అవుతుంది. పెళ్లి ఏర్పాట్లు జరుగుతోండగా రామ్‌తో కలిసి ఊరివిడిచిపారిపోతుంది సీత. కూతురు లేచిపోయిందన్న బాధను జానకిరామయ్య జీర్ణించుకోలేకపోతాడు. మరోవైపు సీత తనను కాదని వెళ్లిపోవడం రమణ అవమానంగా ఫీలవుతాడు. రామ్, సీతలపై పగతో రగిలిపోతాడు. రెండేళ్ల తర్వాత రమణ, సీత మళ్లీ దేవరకద్ర వస్తారు. తండ్రి మాటకు కట్టుబడి సీతను తన కుటుంబానికి దగ్గర చేయాలని చూస్తాడు రామ్.
అతడి ప్రయత్నం నెరవేరిందా? రమణ కారణంగా రామ్, సీతకు ఊళ్లో ఎలాంటి కష్టాలు ఎదురయ్యాయి? కూతురు దూరమైన బాధలో గుడి విషయంలో జానకి రామయ్య ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడు? కూతురి ప్రేమను జానకిరామయ్య అర్థం చేసుకున్నాడా? రామ్ తండ్రి ఎలా చనిపోయాడు? అన్నదే ఈ సీతా కళ్యాణ వైభోగమే (Seetha Kalyana Vaibhogame Review)మూవీ కథ.
రామాయణం స్ఫూర్తితో...
సీతా కళ్యాణ వైభగోమే... టిఫికల్ కమర్షియల్ మూవీ. రామాయణం స్ఫూర్తితో దర్శకుడు సతీష్ పరమవేద ఈ సినిమాను తెరకెక్కించారు. రాముడికి సీతను దూరం చేసేందుకు రావణాసురుడు ఎన్ని కుట్రలు పన్నాడు? సీతపై ప్రేమతో ఆ కష్టాలను దాటుకుంటూ రాముడు... చివరకు రావణుడిపై ఎలా విజయం సాధించాడనే రామాయణంలోని మూలసారాన్ని నేటితరం ప్రేమకథతో దర్శకుడు సీతా కళ్యాణ వైభగమే(Seetha Kalyana Vaibhogame Review) సినిమా ద్వారా చెప్పేందుకు ప్రయత్నించాడు.
సర్‌ప్రైజ్ లేకుండా...
కంప్లీట్‌గా విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో సీతా కళ్యాణ వైభోగమే మూవీ సాగుతుంది. ప్రేమకథతో పాటు తండ్రీకూతుళ్ల అనుబంధం, యాక్షన్ అంశాలు అన్ని సమపాళ్లలో ఉండేలా ఈ కథను రాసుకున్నాడు. ప్రేక్షకుల మెదళ్లకు పదును పెట్టేలా ఎలాంటి ట్విస్ట్‌లు, సర్‌ప్రైజ్‌లు సినిమాలు ఉండవు. సినిమా(Seetha Kalyana Vaibhogame Review) ఆరంభంలోనే కథ, హీరో ఏమిటన్నది డైరెక్టర్ చెప్పేశాడు. ఆ లక్ష్యాన్ని ఎలా చేరుకున్నాడన్నదే మిగిలిన కథ.
విలన్ పాత్ర బలంగా ఉంటేనే...
సినిమా విలన్ పాత్ర బలంగా ఉంటేనే హీరో క్యారెక్టర్ ఎక్కువగా ఎలివేట్ అవుతుంది. ఈ సూత్రాన్ని ఫాలో అవుతూ విలన్ గగన్ విహారిని ఓ రావణాసురుడిలా చూపించారు డైరెక్టర్. హీరో, విలన్ ట్రాక్ ఈ సినిమాకు ప్లస్ పాయింట్గా నిలిచింది. ఫస్ట్ హాఫ్ మొత్తం సీత, రామ్ లవ్‌స్టోరీ...తమ ప్రేమను సఫలం చేసుకోవడానికి వారు పడే ఇబ్బందుల చుట్టూ సాగుతుంది. సెకండాఫ్‌లో సీతను తన కుటుంబానికి దగ్గర చేయడానికి రామ్ వేసే ప్లాన్స్ చుట్టూ నడిపించారు.
జిమ్మిక్కులు మిస్...
కథ పాతదే అయినా కొత్తగా చెప్పే నేర్పు దర్శకుడిగా ఉండాలి. కథనం, క్యారెక్టరైజేషన్, కామెడీతోనే జిమ్మిక్కులు చేస్తూ ఆడియెన్స్‌ను అట్రాక్ట్ చేయాలి. ఆ విషయంలో దర్శకుడు తడబడ్డాడు. ఆరంభంలోనే ఈ సినిమా ముగింపు ఏమిటన్నది చెప్పేయచ్చు. సీతను తన కుటుంబానికి దగ్గర చేయడానికి రామ్ వేసే ప్లాన్స్ రొటీన్‌గా ఉన్నాయి. విలన్ క్యారెక్టర్ ట్రాక్ రిపీటెడ్‌లా అనిపిస్తుంది.
కెమిస్ట్రీ ప్లస్...
రామ్, సీత పాత్రల్లో సుమన్ తేజ్; గరీమా చౌహన్(Garima Chouhan) జంట బాగానే కుదిరింది. ఇద్దరి కెమిస్ట్రీని యూత్ ఆడియెన్స్ మెప్పించేలా చూపించారు డైరెక్టర్. యాక్టింగ్ పరంగా పరిణితి చూపిస్తే ఇంకా బాగుండేది. విలన్ పాత్రలో గగన్ విహారి న్యాయం చేశాడు. కీలక పాత్రల్లో శివాజీ, నాగినీడు తమ నటనానుభవంతో మెప్పించారు.
కమర్షియల్ లవ్ స్టోరీ
సీతా కళ్యాణ వైభోగమే కమర్షియల్ లవ్‌స్టోరీస్‌ను ఇష్టపడే ఆడియెన్స్‌ను మెప్పించే అవకాశం ఉంది.
రేటింగ్: 2.5/5
టాపిక్