Salman Khan: సల్మాన్ ఖాన్ ఆ గుడికి వచ్చి క్షమాపణ అడగాలి.. అలాంటి తప్పు మళ్లీ చేయనని ప్రమాణం చేయాలి: బిష్ణోయ్ సమాజం
14 May 2024, 16:00 IST
- Salman Khan: సల్మాన్ ఖాన్ స్వయంగా ఆ గుడికి వచ్చి క్షమాపణ అడగడంతో ఆ తప్పు మళ్లీ చేయనని చెబితేనే క్షమిస్తామని బిష్ణోయి కమ్యూనిటీ తేల్చి చెప్పింది. అతని తరఫున ఇతరుల క్షమాపణలను అంగీకరించబోమని స్పష్టం చేసింది.
సల్మాన్ ఖాన్ ఆ గుడికి వచ్చి క్షమాపణ అడగాలి.. అలాంటి తప్పు మళ్లీ చేయనని మాట ఇవ్వాలి
Salman Khan: బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ కృష్ణ జింక వేట కేసులో బిష్ణోయ్ కమ్యూనిటీ మరోసారి స్పందించింది. ఈ మధ్యే సల్మాన్ తరఫున అతని మాజీ గర్ల్‌ఫ్రెండ్ సోమీ అలీ క్షమాపణ చెప్పిన విషయం తెలిసిందే. అయితే సల్మాన్ స్వయంగా క్షమాపణ చెప్పాల్సిందే అని ఆ కమ్యూనిటీ డిమాండ్ చేస్తోంది. 1998లో కృష్ణ జింకను వేటాడిన కేసులో సల్మాన్ దోషిగా కూడా తేలాడు.
సల్మానే క్షమాపణ చెప్పాలి
కృష్ణ జింక వేట కేసులో సల్మాన్ ఖాన్ తరఫున అతని మాజీ ప్రేయసి సోమీ అలీ క్షమాపణ చెప్పింది. దీనిపై తాజాగా ఆల్ ఇండియా బిష్ణోయ్ సోసైటీ అధ్యక్షుడు దేవేంద్ర బుడియా స్పందించినట్లు లైవ్ హిందుస్థాన్ వెల్లడించింది. సల్మాన్ ఖానే స్వయంగా క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ తప్పు చేసింది సోమీ అలీ కాదు కదా అని ప్రశ్నించారు.
"సల్మాన్ స్వయంగా క్షమాపణ చెబితే బిష్ణోయ్ సమాజం దానిని అంగీకరిస్తుంది. ఈ తప్పు చేసింది సల్మాన్ తప్ప సోమీ అలీ కాదు. అతని తరఫున ఎవరూ క్షమాపణ చెప్పకూడదు. సల్మాన్ ఖాన్ స్వయంగా గుడికి వచ్చి క్షమాపణ కోరితే మా సమాజం దానిని పరిశీలిస్తుంది. ఎందుకంటే మా 29 నిబంధనల్లో క్షమాపణ కూడా ఒకటి. అంతేకాదు సల్మాన్ భవిష్యత్తులో మళ్లీ ఇలాంటి తప్పు చేయబోనని చెప్పి పర్యావరణాన్ని కాపాడతానన్న ప్రతిన కూడా చేయాలి. అప్పుడే అతన్ని క్షమించే అంశాన్ని పరిశీలిస్తాం" అని దేవేంద్ర బుడియా అన్నారు.
అసలేంటీ కృష్ణజింక కేసు?
1999లో వచ్చిన బాలీవుడ్ మూవీ హమ్ హమ్ సాథ్ సాథ్ హై షూటింగ్ సందర్భంగా 1998లో ఈ ఘటన జరిగింది. రాజస్థాన్ లోని జోధ్‌పూర్ జిల్లాలోని బవాద్ లో ఓ కృష్ణజింకను సల్మాన్ వేటాడినట్లు ఆరోపణలు ఉన్నాయి. అతనితో ఆ సమయంలో ఆ సినిమాలో నటించిన టబు, సొనాలి బింద్రె, నీలమ్ కూడా ఉండటంతో వాళ్లపైనా కేసులు నమోదు చేశారు.
2018లో ఈ కేసులో అతడు దోషిగా తేలడంతో ఐదేళ్ల కఠిన కారాగార శిక్ష విధించారు. కానీ తర్వాత బెయిల్ మంజూరు చేశారు. అయితే ఈ మధ్యే సల్మాన్ ఇంటిపై కాల్పుల ఘటన నేపథ్యంలో అతని మాజీ గర్ల్ ఫ్రెండ్ సోమీ అలీ ఈ ఘటనపై స్పందించింది. హిందుస్థాన్ టైమ్స్ తో ఆమె మాట్లాడుతూ.. బిష్ణోయ్ సమాజానికి క్షమాపణ చెప్పింది.
"వేటను ఓ ఆటగా నేను అస్సలు అంగీకరించను. కానీ ఇది జరిగి చాలా ఏళ్లవుతోంది. 1998లో సల్మాన్ చాలా చిన్నవాడు. అందుకే బిష్ణోయ్ సమాజం పెద్దను నేను కోరుతున్నదేంటంటే దానిని ఇంతటితో వదిలేయండి. అతని తరఫున నేను క్షమాపణ కోరుతున్నాను. అతన్ని క్షమించండి" అని సోమీ అలీ కోరింది. న్యాయం కోసం కోర్టుకెళ్లాలి తప్ప మరొకరి ప్రాణాలు తీయడం తప్పని కూడా ఈ సందర్భంగా ఆమె చెప్పింది.
అమెరికాలోలాగే ఇండియాలోనూ న్యాయ వ్యవస్థపై తనకు పూర్తి నమ్మకం ఉన్నదని, సల్మాన్ ఖాన్ కు హాని తలపెట్టడం వల్ల చనిపోయిన కృష్ణ జింక తిరిగి రాదని సోమీ అనడం గమనార్హం. జరిగిందేదో జరిగిపోయిందని ఆమె అన్నది.