Salman Khan: సల్మాన్ ఖాన్ ఇంట్లో కాల్పుల ఘటనలో నిందితుడు అనూజ్ థాపన్ అనుమానాస్పద మృతి
Salman Khan house firing: రెండు వారాల క్రితం ముంబైలో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ఇంటి ముందు కాల్పుల ఘటన చోటు చేసుకుంది. ఆ నేరంలో నిందితుడిగా ఉన్నఅనూజ్ థాపన్ బుధవారం ముంబై పోలీసుల అదుపులో శవమై కనిపించాడు. అతడు ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు చెబుతున్నారు.
Salman Khan house firing: ముంబైలో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ఇంటి ముందు కాల్పుల ఘటన కేసులో అరెస్టయిన నిందితుడు అనూజ్ థాపన్ బుధవారం ముంబైలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. మృతుడు అనూజ్ థాపన్ (23) బెడ్ షీట్ తో లాకప్ లోని టాయిలెట్ లో ఉరేసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడని పోలీసులు చెబుతున్నారు. అతడిని జీటీ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడని వెల్లడించారు. ఈ ఆత్మహత్యపై దక్షిణ ముంబైలోని ఆజాద్ మైదాన్ పోలీస్ స్టేషన్ లో యాక్సిడెంటల్ డెత్ కేసును నమోదు చేశారు.
అనూజ్ థాపన్ ఎవరు?
ఏప్రిల్ 14న బాంద్రాలోని సల్మాన్ ఖాన్ (Salman Khan) గెలాక్సీ అపార్ట్ మెంట్ వెలుపల పలు రౌండ్ల బుల్లెట్లు పేల్చిన కేసులో అరెస్టయిన షూటర్లు విక్కీ గుప్తా, సాగర్ పాల్ లకు తుపాకులు సరఫరా చేశారనే ఆరోపణలపై అనుజ్ థాపన్ ను, సోను సుభాష్ చందర్ అనే మరో నిందితుడిని ముంబై పోలీసులు అరెస్టు చేశారు.
లారెన్స్ బిష్ణోయ్ కేసుకు సంబంధం
లారెన్స్ బిష్ణోయ్ కేసుకు సంబంధించి గ్యాంగ్ స్టర్ లారెన్స్ బిష్ణోయ్, అతని సోదరుడు అన్మోల్ బిష్ణోయ్ లను వాంటెడ్ నిందితులుగా ప్రకటించినట్లు ముంబై క్రైమ్ బ్రాంచ్ తెలిపింది. సల్మాన్ ఖాన్ నివాసం వెలుపల జరిగిన కాల్పులకు తామే బాధ్యులమని అన్మోల్ బిష్ణోయ్ ఫేస్ బుక్ పోస్ట్ లో పేర్కొన్నారు. ఐపీ అడ్రస్ ఆధారంగా అన్మోల్ బిష్ణోయ్ పోర్చుగల్ లో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.
నాలుగు సార్లు రెక్కీ..
కాల్పులు జరపడానికి ముందు షూటర్లు సల్మాన్ ఖాన్ (Salman Khan) ఇంటి ముందు నాలుగు సార్లు రెక్కీ నిర్వహించారని ముంబై క్రైమ్ బ్రాంచ్ తెలిపింది. సల్మాన్ ఖాన్ ఫాంహౌస్ వద్ద కూడా వారు రెక్కీ చేశారని తెలిపారు. చాలా రోజులుగా సల్మాన్ ఖాన్ ఫాంహౌస్ కు వెళ్లకపోవడంతో, అతడు నివాసం ఉండే గెలాక్సీ అపార్ట్ మెంట్స్ వెలుపల కాల్పులు జరిపేందుకు ప్లాన్ చేశారని క్రైమ్ బ్రాంచ్ పోలీసులు తెలిపారు.
నదిలో పిస్టల్ విసిరేసి..
సల్మాన్ ఖాన్ ఇంటి ముందు కాల్పులు జరిపిన అనంతరం షూటర్లు విక్కీ గుప్తా, సాగర్ పాల్ గుజరాత్ లోని భుజ్ కు పారిపోయారని పోలీసులు తెలిపారు. అంతకుముందు తమ పిస్టల్స్ ను సూరత్ సమీపంలోని తాపి నదిలో విసిరేశారన్నారు. ఆ నదిలో నుంచి పిస్టల్ ను వెలికితీశామన్నారు.