తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Razakar Trailer: రజాకార్ ట్రైలర్ రిలీజ్.. నిజాం నిరంకుశత్వం.. ప్రజల తిరుగుబాటు.. విలీనం అంశాలతో ఇంట్రెస్టింగ్‍గా..

Razakar Trailer: రజాకార్ ట్రైలర్ రిలీజ్.. నిజాం నిరంకుశత్వం.. ప్రజల తిరుగుబాటు.. విలీనం అంశాలతో ఇంట్రెస్టింగ్‍గా..

12 February 2024, 16:38 IST

google News
    • Razakar Trailer: రజాకార్ సినిమా ట్రైలర్ రిలీజ్ అయింది. నిజాంల నిరంకుశ పాలన, ప్రజల తిరుగుబాటు, హైదరాబాద్ సంస్థానం భారత దేశంలో విలీనం అంశాలతో ఈ మూవీ తెరకెక్కింది. ట్రైలర్ ఇంటెన్స్‌గా ఉంది.
ఇంట్రెస్టింగ్‍గా రజాకార్ మూవీ ట్రైలర్
ఇంట్రెస్టింగ్‍గా రజాకార్ మూవీ ట్రైలర్

ఇంట్రెస్టింగ్‍గా రజాకార్ మూవీ ట్రైలర్

Razakar Trailer: తెలంగాణ విమోచన ఉద్యమం ఆధారంగా ‘రజాకార్’ చిత్రం వస్తోంది. భారత దేశానికి 1947లో స్వాతంత్య్రం రాగా.. అప్పటికీ హైదరాబాద్ సంస్థానం నిజాంల ఆధీనంలో ఉండేది. అక్కడి ప్రజలపై నిజాం ప్రభుత్వానికి చెందిన రజాకార్ల వ్యవస్థ పాల్పడిన దారుణాలు, దాడులు.. ప్రజల తిరుగుబాటు, ఉద్యమం అంశాలతో ఈ చిత్రం రూపొందింది. దేశంలో హైదరాబాద్‍ను విలీనం కోసం అప్పటి భారత ప్రభుత్వం చేపట్టిన సైనిక చర్య ఉండనుంది. ఈ సినిమాకు యాటా నారాయణ దర్శకత్వం వహించారు. ఈ రజాకార్ మూవీ ట్రైలర్ నేడు (ఫిబ్రవరి 12) రిలీజ్ అయింది.

రజాకార్ చిత్రంలో బాబీ సింహా, మార్కండ్ దేశ్‍పాండే, రాజ్ అర్జున్, వేదిక, అనుష్య, ఇంద్రజ, అనసూయ భరద్వాజ్ కీలకపాత్రలు పోషించారు. 1947 నుంచి 1948 బ్యాక్‍డ్రాప్‍లో ఈ మూవీ ఉంది.

హైదరాబాద్ సంస్థానంలోని ప్రజలపై అప్పటి నిజాం పాలకులు చేసిన అకృత్యాలు, దారుణాలను ట్రైలర్లో చూపించారు మేకర్స్. “వాళ్లు ఇక్కడ మతమన్నా మారాలి.. లేకపోతే రాజ్యమన్నా మారాలి. మతం మారితే దోస్తీ. మారకపోతే దుష్మన్” అంటూ డైలాగ్ ఉంది. అప్పటి ప్రజలను రజాకార్లు ఎలాంటి చిత్రహింసలు పెట్టారో.. మారణహోమం సృష్టించారో ట్రైలర్లో ఉంది.

నిజాం పాలకులపై ప్రజలు తిరుగుబాటు చేయడం, రజాకార్లను ఎదుర్కోడం, హైదరాబాద్‍ను పాకిస్థాన్‍కు అప్పగించాలని నిజాంలు ప్రయత్నించడం లాంటి అంశాలను మేకర్స్ ఈ ట్రైలర్లో చూపించారు. “నేను ఈ హైదరాబాద్‍ను మరో కశ్మీర్‌గా మారనివ్వను” అంటూ భారత దేశ తొలి హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ చెప్పిన మాటలు ఉన్నాయి. ఆ తర్వాత భారత ప్రభుత్వం సైనిక చర్యలు తీసుకొని హైదరాబాద్ సంస్థానాన్ని స్వాధీనం చేసుకున్న సీన్లు ఉన్నాయి. “చర్చలు లేవు. సంధి లేదు. యుద్ధం జరగాల్సిందే” అంటూ సర్దార్ చెప్పడం.. సైనిక చర్యతో రజాకార్ ట్రైలర్ ముగిసింది.

రిలీజ్ డేట్ ఇదే..

రజాకార్ ట్రైలర్ ఈ చిత్రంపై ఆసక్తిని విపరీతంగా పెంచేసింది. ఈ సినిమా మార్చి 1వ తేదీన థియేటర్లలో రిలీజ్ కానుంది. హిందీలోనూ రానుంది. హిందీ ట్రైలర్‌ను స్టార్ నటి కంగనా రనౌత్ రిలీజ్ చేశారు. ట్రైలర్‌ను ప్రశంసిస్తూ ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

రజాకార్ సినిమాకు యాటా సత్యనారాయణ దర్శకత్వం వహించగా.. సమర్‌వీర్ క్రియేషన్స్ పతాకంపై గూడుర్ సత్యనారాయణ రెడ్డి నిర్మిస్తున్నారు. భీమ్స్ సెసిరోలియో సంగీతం అందించారు. కుషేందర్ రమేశ్ రెడ్డి సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వర్తించగా.. తమ్మిరాజు ఎడిటింగ్ చేశారు.

నిజాం నిరంకుశ పాలన నుంచి విముక్తి కోసం హైదరాబాద్ సంస్థానం పరిధిలోని ప్రజలు అలుపెరుగని పోరాటం చేశారు. దోపిడీ, అణచివేతకు వ్యతిరేకంగా ఉద్యమించారు, తిరుగుబాటు చేశారు. భారత ప్రభుత్వ ‘ఆపరేషన్ పోలో’ సైనిక చర్యతో 1948 సెప్టెంబర్ 18న హైదరాబాద్ సంస్థానం భారత దేశంలో విలీనం అయింది. అప్పటి హోంశాఖ మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ చర్యలతో హైదరాబాద్.. ఇండియాలో కలిసింది.

నిజాం పాలకులు చేసిన దారుణాలను రజాకార్ చిత్రంలో చూపిస్తామని దర్శకుడు సత్యనారాయణ గతంలోనే చెప్పారు. గతేడాదే రిలీజ్ కావాల్సిన ఈ చిత్రం వాయిదా పడింది. మార్చి 1వ తేదీన విడుదల కానుంది.

తదుపరి వ్యాసం