Razakar Movie : 2023 ఎన్నికల్లో రజాకార్ సినిమా ప్రభావం చూపిస్తుందా?-will razakar movie affect 2023 elections ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Razakar Movie : 2023 ఎన్నికల్లో రజాకార్ సినిమా ప్రభావం చూపిస్తుందా?

Razakar Movie : 2023 ఎన్నికల్లో రజాకార్ సినిమా ప్రభావం చూపిస్తుందా?

HT Telugu Desk HT Telugu
Nov 21, 2022 02:56 PM IST

Razakar Cinema : ఒకప్పుడు ప్రచారం అంటే.. రాజకీయ నాయకులు ప్రజల వద్దకు వెళ్లేవారు. ఆ తర్వాత బహిరంగ సభలు, మీడియా సమావేశాలు.. ఇలా మారుతూ వచ్చింది. కొన్నేళ్లుగా సినిమాను కూడా పార్టీలు ప్రచారస్త్రంగా వాడుకుంటున్నాయి.

రజాకార్ సినిమా షూటింగ్
రజాకార్ సినిమా షూటింగ్

కశ్మీర్ ఫైల్స్(Kashmir Files) సినిమా దేశవ్యాప్తంగా సంచలన సృష్టించింది. ఇక రజాకార్ ఫైల్స్(Razakar Files) అనే సినిమా కూడా తీస్తామని ఆ మధ్య బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్(Bandi Sanjay) ప్రకటించారు. తాజాగా రజకార్ అనే సినిమా చిత్రీకరణ జరుగుతోంది. వచ్చే ఎన్నికల్లో దీనిని ఉపయోగించుకోవాలని బీజేపీ చూస్తోందనే ప్రచారం కూడా ఉంది. నిజా హయాంలో హైదరాబాద్(Hyderabad) సంస్థానంలోని దారుణాలు, ప్రజలు పడిన కష్టాలపై అనేక రకాల వాదనలు ఉన్నాయి. హిందువులే టార్గెట్ గా మారణహోమం సృష్టించారని కొంతమంది వాదన. అయితే రజాకార్ సినిమా(Razakar Cinema)లో ఎలాంటి వాటిని చూపిస్తున్నారనే విషయం ఆసక్తిగా మారింది.

హైదరాబాద్ శివార్లలోని రజాకార్ షూటింగ్(Razakar Shooting) జరుపుకొంటొంది. హైదరాబాద్(Hyderabad) రాష్ట్రంలోని సామాన్య ప్రజలపై జరిగిన అణచివేత, అవమానాలు, దౌర్జన్యాలు ఈ సినిమాలో చూపించే అవకాశం ఉంది. బీజేపీ నేత గూడూరు నారాయణ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాతో చరిత్రను చూపిస్తున్నామని చెబుతున్నారు. రాబయే ఎన్నికల్లో బీజేపీకి ఇది ఉపయోగపడుతుందని కొంతమంది అంటున్నారు.

పోలీస్ యాక్షన్, ఆపరేషన్ పోలో(Operation POLO) లాంటి అంశాలను కూడా ఇందులో చూపించే అవకాశం ఉంది. ఈ ఏడాది సెప్టెంబర్ 17న పెద్ద దుమారమే రేగింది. కాషాయ పార్టీ సెప్టెంబర్ 17ని విమోచన దినోత్సవంగా జరుపుకోగా, టీఆర్‌ఎస్, ఎంఐఎం సమైక్య దినోత్సవంగా నిర్వహించాయి. దక్షిణాదిలో రాజకీయ నాయకులపై సినిమాలు రావడం కొత్త కాదు. ఎన్టీఆర్, ఎంజిఆర్, జయలలిత, వైఎస్ రాజశేఖర్ రెడ్డి లాంటి నాయకుల సినిమాలు వచ్చాయి. ఎన్నికల్లో ఇవి ఉపయోగపడే అవకాశం ఉందని కూడా పార్టీలు అనుకుంటాయి.

అయితే రజాకార్లు అనేది తెలంగాణలోని చాలామంది భావోద్వేగాలకు ముడిపడిన అంశం. దీనిని ఎలాగైనా ఉపయోగించుకోవాలని బీజేపీ అనుకుంటోందని పలువులు అభిప్రాయపడుతున్నారు. రజాకార్(Razakar) అనే సినిమా కోసం దర్శకుడు యాట సత్యనారాయణ 1946 నాటి గ్రామాన్ని పునఃసృష్టించారు. సెట్‌లో మొత్తం 19 షెడ్యూల్స్ ప్లాన్ చేయగా.. ఐదో షెడ్యూల్‌లో కొంత భాగాన్ని షూట్ చేస్తున్నారు.

రజాకార్లు, ఆపరేషన్ పోలో, నిజాం పాలన చివరి రోజుల్లో జరిగిన దురాగతాలు, హైదరాబాద్ రాష్ట్రాన్ని భారతదేశంలోకి తీసుకురావడంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ వీరోచిత పాత్ర గురించి ఇందులో చూపించే అవకాశం ఉంది. సమరవీర్‌ క్రియేషన్స్‌ పతాకంపై నారాయణరెడ్డి ఈ చిత్రాన్ని అత్యంత భారీ నిర్మాణ విలువలతో నిర్మిస్తున్నారు. అయితే 2023 ఎన్నికల్లో(2023 Elections) ఈ చిత్రం ఎలాంటి ప్రభావం చూపిస్తుందో చూడాలి. బీజేపీ నేతలు మాత్రం.. జరిగిన చరిత్రను చూపిస్తున్నారని అంటున్నారు. ఎలాంటి సినిమా తీసినా మళ్లీ వచ్చేది టీఆర్ఎస్ పార్టీనే అని గులాబీ నేతలు చెబుతున్నారు.

Whats_app_banner