Ram Gopal Varma on Animal: యానిమల్‌లాంటి సినిమా ఎలా తీయాలో పిల్లలకు స్కూళ్లలో నేర్పించండి: రాంగోపాల్ వర్మ
11 December 2023, 8:40 IST
- Ram Gopal Varma on Animal: యానిమల్‌లాంటి సినిమా ఎలా తీయాలో పిల్లలకు స్కూళ్లలో నేర్పించండి అని డైరెక్టర్ రాంగోపాల్ వర్మ అనడం గమనార్హం. ఈ సినిమాను మెచ్చుకుంటూ మరోసారి ట్వీట్ల వర్షం కురిపించాడు.
యానిమల్ మూవీపై మరోసారి రాంగోపాల్ వర్మ ప్రశంసల వర్షం
Ram Gopal Varma on Animal: యానిమల్ మూవీపై ప్రముఖ డైరెక్టర్ రాంగోపాల్ వర్మ ఇంకా ప్రశంసలు కురిపిస్తూనే ఉన్నాడు. గతంలో ఈ సినిమాపై నాలుగు పేజీల రివ్యూ ఇచ్చిన అతడు.. అది సరిపోదన్నట్లు ఆదివారం (డిసెంబర్ 10) మరోసారి వరుస ట్వీట్లు చేశాడు. యానిమల్ లాంటి సినిమా ఎలా తీయాలో స్కూళ్లలో పిల్లలకు నేర్పించండి అని అతడు అనడం గమనార్హం.
ఓవైపు యానిమల్ సినిమాపై ఎంతో మంది ప్రముఖులు కూడా విమర్శలు గుప్పిస్తుంటే ఆర్జీవీ మాత్రం ప్రశంసిస్తూనే ఉన్నాడు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర వందల కోట్లు వసూలు చేస్తూ దూసుకెళ్తున్న సందర్భంలో అతడు చేసిన ట్వీట్లు వైరల్ అవుతున్నాయి. ఇండియన్స్ అందరూ ఎంతలా ఎదిగిపోయారో యానిమల్ బాక్సాఫీస్ కలెక్షన్లు చూస్తే అర్థమవుతోందని అతడు అనడం విశేషం.
మనందరిలోనూ యానిమల్స్ దాగి ఉన్నాయి: ఆర్జీవీ
యానిమల్ మూవీపై రాంగోపాల్ వర్మ వరుస ట్వీట్లు చేశాడు. మొదటి ట్వీట్ లో యానిమల్ లాంటి సినిమా ఎలా తీయాలో ప్రతి స్కూళ్లో నేర్పించాలని అన్నాడు. "డిసెంబర్ 10, 2023 నుంచి ఇండియన్ సినిమాలు మునుపటిలా లేవు. ఓ సినిమాలో ఆడియెన్స్ కు ఏం నచ్చుతాయో ఎవరికీ తెలియదు.
మంచి, చెడు, నైతిక విలువలు, ఇతర కుటుంబ, సామాజిక విలువల వంటివన్నీ యానిమల్ స్కూల్లో కొత్తగా నేర్పించాలి. అన్ని స్కూళ్లూ తమ సిలబస్ లను మార్చేసి యానిమల్ లాంటి సినిమా ఎలా తీయాలో మాత్రమే చెప్పాలి. ప్రతి ఫిల్మ్ మేకర్ బయటి వాళ్లు చెప్పేది వినకుండా తమలోని యానిమల్స్ ను బయటకు తీసి సినిమాలు తీయాలి. యానిమల్ లాంటి సినిమా చూస్తూ అందరూ ఎదిగిపోయారు.. ఇక పిల్లలు చూసే సినిమాలు చూడరు అని తెలుసుకోవాలి" అని వర్మ ట్వీట్ చేశాడు.
ఇక మరో ట్వీట్ లో మనందరిలోనూ యానిమల్స్ దాగి ఉన్నాయన్న నిజం యానిమల్ మూవీ సక్సెస్ చూస్తే అర్థమవుతోందని అతడు అన్నాడు. ప్రతి భారతీయుడిలో దాగి ఉన్న మృగం ఇప్పుడు మరో భారతీయుడికి తెలిసింది.. సినిమాలు ఓ కళ, సమాజానికి అద్దం పడతాయని అనుకుంటే.. యానిమల్ మూవీ ఆ అర్థాన్ని మార్చేసింది. కళ అని గతంలో పిలిచే దానిని పూర్తిగా ధ్వంసం చేసేసింది అని వర్మ మరో ట్వీట్ లో అన్నాడు.