Pushpa 2 box office collection: బాక్సాఫీస్ వద్ద పుష్ప 2 దూకుడు.. 4 రోజుల్లోనే ఎవరూ ఊహించని విధంగా వసూళ్లు
08 December 2024, 15:09 IST
Pushpa 2 Worldwide Box Office collection: పుష్ప 2 రిలీజ్ రోజు నుంచి వరుసగా రికార్డులను బద్దలుకొడుతూ వెళ్తోంది. ఇప్పటికే రూ.500 కోట్ల వసూళ్లు రాబట్టిన మూవీగా నిలిచిన పుష్ప2.. ఆదివారం ముగిసే సమయానికి మరో రికార్డ్‌ను ఖాతాలో వేసుకోబోతోంది.
పుష్ప2లో అల్లు అర్జున్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప 2: ది రూల్’ మూవీ బాక్సాఫీస్ వద్ద వసూళ్లల్లో సరికొత్త రికార్డులు నెలకొల్పుతోంది. ప్రపంచవ్యాప్తంగా 12,500 స్క్రీన్లలో.. ఆరు భాషల్లో గత గురువారం విడుదలైన పుష్ప 2 మూవీ.. నాలుగు రోజుల్లోనే ఎవరూ ఊహించని విధంగా వసూళ్లని రాబట్టింది. సాక్నిల్క్ వెబ్‌సైట్ ప్రకారం.. పుష్ప 2 మూవీ ఆదివారం ముగిసే సమయానికి రూ.700 కోట్ల వరకూ వసూళ్లు రాబట్టే అవకాశం ఉందట.
వసూళ్లల్లో పుష్ప2 రికార్డులు
పుష్ప 2 మూవీ రిలీజ్ రోజే రూ.294 కోట్లు వసూళ్లు రాబట్టగా.. రెండో రోజైన శుక్రవారం నాటికి ఆ సంఖ్య రూ.421.3 కోట్లకి చేరింది. వీకెండ్ కావడం.. థియేటర్లలో పెద్ద సినిమా ఏదీ లేకపోవడంతో పుష్ప 2కి ఎదురులేకుండా పోయింది. దాంతో శనివారం నాటికి రూ.588.90 కోట్లకి చేరిన పుష్ప 2 మూవీ వసూళ్లు.. ఈరోజు రూ.700 కోట్లని టచ్ చేయబోతున్నట్లు సాక్నిల్క్ రాసుకొచ్చింది.
తెలుగులో కంటే హిందీలో భారీగా
ఇండియన్ సినిమా హిస్టరీలోనే తొలిరోజు అత్యధిక వసూళ్లు రాబట్టిన మూవీగా ఇప్పటికే రికార్డ్ నెలకొల్పిన పుష్ప2.. అత్యంత వేగంగా రూ.500 కోట్లు రికార్డ్‌ను కూడా సొంతం చేసుకుంది. ఇప్పుడు రూ.700 కోట్ల వసూళ్లల్లోనూ పుష్ప 2దే టాప్ రికార్డ్ కాబోతోంది. తెలుగులో కంటే హిందీలోనే పుష్ప 2కి వసూళ్లు ఎక్కువగా వస్తుండటం గమనార్హం.
సీక్వెల్‌కి మూడింతలు వసూళ్లు
సుకుమార్ దర్శకత్వం వహించిన పుష్ప2లో అల్లు అర్జున్ సరసన రష్మిక మంధాన నటించగా.. శ్రీలీల ఐటెం సాంగ్ చేసింది. అలానే ఫహాద్ ఫాజిల్, రావు రమేశ్, జగపతి బాబు, సునీల్, అనసూయ కీలక పాత్రలు పోషించారు.2021లో వచ్చిన ‘పుష్ప: ది రైజ్’ మూవీ అప్పట్లో రూ.350 కోట్ల వరకూ వసూళ్లని రాబట్టింది. ఇప్పుడు పుష్ప 2 సినిమా.. మూడింతలు రాబట్టే అవకాశం ఉందని అంచనాలు వేస్తున్నారు.