తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  The Kashmir Files | కశ్మీర్ ఫైల్స్ తెలుగులో డబ్ చేస్తా: నిర్మాత అభిషేక్ అగర్వాల్

The Kashmir Files | కశ్మీర్ ఫైల్స్ తెలుగులో డబ్ చేస్తా: నిర్మాత అభిషేక్ అగర్వాల్

HT Telugu Desk HT Telugu

18 March 2022, 21:38 IST

google News
    • ది కశ్మీర్ ఫైల్స్ నిర్మాతల్లో ఒకరైన అభిషేక్ అగర్వాల్ విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సినిమాకు సంబంధించి కొన్ని కీలక విషయాలను పంచుకున్నారు. ఈ చిత్రాన్ని తెలుగులో డబ్ చేయనున్నామని స్పష్టం చేశారు.
ది కశ్మీర్ ఫైల్స్ నిర్మాత అభిషేక్ అగర్వాల్
ది కశ్మీర్ ఫైల్స్ నిర్మాత అభిషేక్ అగర్వాల్ (facebook)

ది కశ్మీర్ ఫైల్స్ నిర్మాత అభిషేక్ అగర్వాల్

ప్రస్తుతం ఎక్కడ చూసినా 'ది కశ్మీర్ ఫైల్స్' చిత్రం గురించే చర్చ. చిన్న సినిమాగా విడుదలై సంచలనం సృష్టిస్తోందీ చిత్రం. అనుపమ్ ఖేర్, మిథున్ చక్రవర్తి, దర్శన్ కుమార్ తదితురులు నటించిన ఈ చిత్రాన్ని వివేక్ అగ్నిహోత్రి తెరకెక్కించారు. మార్చి 11న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాపై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. 1990లో జమ్మూ-కశ్మీర్‌లో కశ్మీర్ హిందువులపై జరిగిన అమానుష హత్యాకాండకు ఈ సినిమా అద్దం పట్టింది. అనాటి భయనాక సంఘటనలను అద్భుతంగా తెరకెక్కించారు దర్శకులు. ప్రస్తుతం అన్ని చోట్లా మంచి వసూళ్లను రాబడుతోందీ సినిమా. ఈ సందర్భంగా ఈ చిత్ర నిర్మాతల్లో ఒకరైన అభిషేక్ అగర్వాల్.. సినిమాను ఆదరించినందుకు ధన్యవాదాలు తెలిపారు. శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

అభిషేక్ అగర్వాల్ పంచుకున్న విషయాలు(ఆయన మాటల్లోనే)..

- ఈ సినిమాను ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇది నేను నిర్మించిన తొలి హిందీ చిత్రం. ఇప్పటికే ఈ సినిమా రూ.100 కోట్ల క్లబ్‌లో చేరింది. 30 ఏళ్ల క్రితం కశ్మిరీ పండిట్‌లు పడిన ఇబ్బందులను తెరపై చూపించే అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుతున్ాను. ఈ సినిమా విడుదలకు కొన్ని రోజుల ముందు ఓ మహిళ దిల్లీ నుంచి హైదరాబాద్‌కు వచ్చి నన్ను కలిశారు. 30 ఏళ్లుగా కశ్మీరి పండిట్‌ల గురించి ఎవ్వరూ మాట్లాడలేదని, ఇప్పుడా ప్రయత్నం చేస్తుండటంతో భావోద్వేగానికి గురైంది. అందరి పండిలానే తమ కుటుంబం కూడా ఆ అల్లర్లలో ఎన్నో సమస్యలు ఎదుర్కొందని తెలుపుతూ కన్నీటి పర్యంతమైంది.

- ఈ సినిమా చేసేటప్పుడు ఆర్టికల్ 370 గురించి రీసెర్చ్ చేశాం. మూడు నెలల పాటు అమెరికా, కెనడా, దక్షిణాఫ్రికా మొదలైన ప్రదేశాలు తిరిగి అక్కడున్నవారి నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకున్నాం. ఇది ప్రజల సినిమా. మాది చిన్న సినిమా. అందుకే పబ్లిసిటీ పెద్దగా ఇవ్వలేదు. చిన్న కాబట్టి ఎవరూ సపోర్ట్ చేయరని తెలుసు. కానీ సినిమా విడుదలైన తర్వాత అన్ని ప్రదేశాల నుంచి, ముఖ్యంగా తెలుగు చిత్రసీమ నుంచి ఎంతోమంది అభినందనలు తెలిపారు. కశ్మీరి పండిట్‌లకు ఈ సినిమా అంకితం చేస్తున్నాం.

- ప్రధాని నరేంద్రమోదీని కలవడం యాదృచ్ఛికంగానే జరిగింది. ఓ రోజు ఆయన ఆఫీసు నుంచి ఫోన్ వచ్చింది. వెళ్లి కలిశాం. ఆయనతో గడిపిన క్షణాలు మర్చిపోలేం. ఈ సినిమా తర్వాత పర్యవసనాలు ఏమైనా ఉంటే ఛాలెంజింగ్‌గా తీసుకున్నాం. సినిమా తీసేటప్పుడు కొన్ని సవాళ్లను ఎదుర్కొన్నాం. నిజాయితీగా సినిమాను రూపొందించాం. అందుకే ఎవ్వరికీ భయపడాల్సిన అవసరంలేదు. ఏదైనా తప్పుగా చూపిస్తే ప్రజలే సపోర్ట్ చేయరు.

- త్వరలో దేశంలోని అన్ని భాషల్లో సినిమాను అనువదించే ఆలోచన ఉంది. తెలుగులో కూడా డబ్ చేయాలని అనుకుంటున్నాం. మా సినిమాకు అసోం, గుజరాజ్, మధ్యప్రదేశ్, హరియాణా, కర్ణాటక సహా 9 రాష్ట్రాల్లో వినోదపు పన్ను మినహాయింపు ఇచ్చారు. ఈ సినిమాలో నటించిన నటీనటులు అందరూ పర్సనల్‌గా తీసుకుని నటించారు. దర్శకుడు పూర్తి స్పష్టతతో సినిమాను తెరకెక్కించారు.

- రవితేజతో నా డ్రీమ్ ప్రాజెక్ట్.. టైగర్ నాగేశ్వరరావు చేస్తున్నా. ఆ తర్వాత అబ్దుల్ కలాం బయోపిక్ చేయబోతున్నాం. అదే విధంగా కశ్మీర్ ఫైల్స్ దర్శకుడితో దిల్లీ ఫైల్స్ అనే సినిమా ఆలోచన ఉంది.

తదుపరి వ్యాసం