తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  The Kashmir Files | 'కశ్మీర్ ఫైల్స్' డైరెక్టర్‌కు 'వై' కేటగిరి భద్రత

The Kashmir Files | 'కశ్మీర్ ఫైల్స్' డైరెక్టర్‌కు 'వై' కేటగిరి భద్రత

HT Telugu Desk HT Telugu

18 March 2022, 18:40 IST

google News
    • ది కశ్మీర్ ఫైల్స్ చిత్ర దర్శకుడు వివేక్ అగ్నిహోత్రికి కేంద్ర వై కేటగిరి భద్రతను కల్పించింది. ఇకపై ఆయనకు సీఆర్పీఎఫ్ బలగాలు సెక్యురిటీగా ఉంటాయి. చిన్న సినిమాగా విడుదలైన ఈ చిత్రం భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. వంద కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది.
వివేక్ అగ్నిహోత్రి డైరెక్టర్ కు వై కేటగిరి సెక్యురిటీ
వివేక్ అగ్నిహోత్రి డైరెక్టర్ కు వై కేటగిరి సెక్యురిటీ (Hindustan times)

వివేక్ అగ్నిహోత్రి డైరెక్టర్ కు వై కేటగిరి సెక్యురిటీ

చిన్న సినిమాగా విడుదలై.. భారీ సినిమా రేంజ్ కలెక్షన్లను రాబడుతోంది ది కశ్మీర్ ఫైల్స్(The Kashmir Files) చిత్రం. ఈ సినిమా విడుదలైనప్పటి నుంచి కేవలం మౌత్ టాక్‌తోనే అద్భుత విజయాన్ని సొంతం చేసుకుంది. ఇదిలా ఉంటే ఈ సినిమా దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి(Vivek Agnihotri)కి కేంద్ర ప్రభుత్వం వై కేటగిరి భద్రతను కల్పించింది. ది కశ్మీర్ ఫైల్స్ చిత్రం రిలీజ్ అయినప్పటి నుంచి ఆయనకు బెదిరింపులు ఎక్కువ కావడంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.

1990లో జమ్మూ-కశ్మీర్‌లో అల్లరిమూకలు కశ్మీరి హిందువులపై దాడులకు తెగబడ్డాయి. ఆ ఆకృత్యాలను తట్టుకోలేక ఎంతో మంది కశ్మీరి పండిట్లు కట్టుబట్టలతో వలస వెళ్లిపోయారు. ఆనాటి భయానక ఘటనలను కళ్లకు కట్టినట్లు చూపిస్తూ వివేక్ కశ్మీర్ ఫైల్స్ సినిమాను తెరకెక్కించారు. అయితే ఈ సినిమాలో ఓ వర్గం వారిని హంతకులుగా చూపించారని వివేక్‌పై నిరసలు వెల్లువెత్తాయి. దీంతో ఆయనకు వై కేటగిరి భద్రతను కల్పించింది కేంద్రం. ఇకపై ఆయనకు ఎక్కడకు వెళ్లినా సీఆర్పీఎఫ్ బలగాలతో భద్రత కల్పిస్తారు.

ప్రస్తుతం ఈ సినిమా కలెక్షన్ల పరంగా దూసుకెళ్తోంది. రికార్డు స్థాయిలో వసూళ్లను రాబడుతోంది. 7 రోజుల్లోనే వంద కోట్ల మార్కును అందుకుంది. ఇప్పటి వరకు రూ.106 కోట్లను రాబట్టింది. ఇలాంటి కళాత్మక సినిమాలు ఇంతటి వసూళ్లను రాబట్టడం విశేషం.

ఈ సినిమాలో మిథున చక్రవర్తి, అనుపమ్ ఖేర్, దర్శన్ కుమార్ పల్లవి జోష్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. వివేక్ అగ్నిహోత్రి నిర్మించి దర్శకత్వం వహించిన ఈ సినిమా ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. జీ స్టూడియోస్, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్లపై ఈ సినిమాను నిర్మించారు. మే నెలలో ది కశ్మీర్ ఫైల్స్ సినిమాను ఓటీటీలో విడుదల చేయాలని చిత్రబృందం ప్రణాళికను రూపొందిస్తున్నట్లు సమాచారం. మే 6న స్ట్రీమింగ్ అయ్యే అవకాశమున్నట్లు చిత్రవర్గాల ద్వారా తెలుస్తోంది. త్వరలోనే ఈ విషయంపై అధికారిక సమాచారం వచ్చే అవకాశముంది.

తదుపరి వ్యాసం