Ponniyin Selvan: వావ్.. క్వీన్ నందినిగా ఐశ్వర్యరాయ్ ఎంత అందంగా ఉందో చూడండి!
06 July 2022, 15:25 IST
- Ponniyin Selvan: పాన్ ఇండియా లెవల్లో ఎంతో ఆసక్తి రేపుతున్న మణిరత్నం మూవీ పొన్నియిన్ సెల్వన్ నుంచి మరో కొత్త పోస్టర్ వచ్చింది. ఈసారి ఐశ్వర్య రాయ్ బచ్చన్‌ను క్వీన్ నందినిగా పరిచయం చేశారు.
పొన్నియిన్ సెల్వన్ లో క్వీన్ నందినిగా కనిపించనున్న ఐశ్వర్య రాయ్
పొన్నియిన్ సెల్వన్ మూవీ నుంచి ఇప్పటికే చియాన్ విక్రమ్, కార్తీ ఫస్ట్ లుక్స్ వచ్చాయి. ఇవి ఫ్యాన్స్‌ను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఇక ఇప్పుడు ఈ మూవీలో ఐశ్వర్య రాయ్ బచ్చన్ క్యారెక్టర్‌కు సంబంధించిన పోస్టర్ కూడా వచ్చేసింది. ఇందులో రాణి నందినిగా ఆమె కనిపించబోతోంది. ప్రతీకారం తీర్చుకోవడానికి రగిలిపోయే రాణి పాత్ర ఇది. ఆమె పోస్టర్‌ను బుధవారం ట్విటర్ ద్వారా మేకర్స్ ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు.
అయితే క్వీన్ నందిని పోస్టర్‌లో ఐశ్వర్య అందం ఫ్యాన్స్‌ను కట్టి పడేస్తోంది. "ప్రతీకారానికి ఓ అందమైన ముఖం ఉంది. పురువూర్ రాణి నందిని ఈమె! పొన్నియిన్ సెల్వన్1 ఈ ఏడాది సెప్టెంబర్ 30న తమిళం, తెలుగు, హిందీ, మలయాళం, కన్నడలలో రిలీజ్ కాబోతోంది" అంటూ మేకర్స్ ఆ పోస్టర్‌ను ట్వీట్ చేశారు. ఈ పోస్టర్‌లో ఐశ్వర్య కళ్లు తిప్పుకోలేని అందంతో మెస్మరైజ్ చేస్తోంది.
అందులోనూ నాలుగేళ్ల తర్వాత ఈ పొన్నియిన్ సెల్వన్‌తోనే తిరిగి ఆమె సినిమాల్లోకి అడుగుపెడుతోంది. ఈ మధ్య ఈ సినిమా గురించి ఐశ్వర్య మాట్లాడుతూ.. ఇది మణిరత్నం కలల ప్రాజెక్ట్ అని చెప్పింది. "అతడు ఈ సినిమా కథతో నా దగ్గరికి వచ్చిన సమయంలో నేనెప్పుడో చేయాలనుకున్న సినిమా ఇది అని నీకు తెలుసు అని అన్నాడు. ఈ కలల ప్రాజెక్ట్‌లో నన్ను భాగం చేసినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది" అని ఐశ్వర్య చెప్పింది.
భారీ క్యాస్ట్‌తో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇది పొన్నియిన్ సెల్వన్ తొలి పార్టే. ఇందులో విక్రమ్, కార్తీ, జయం రవి, ఐశ్వర్య రాయ్, త్రిష, శరత్ కుమార్, విక్రమ్ ప్రభు, శోభితా దూళిపాళ్ల, ప్రభు, పార్థిబన్, ప్రకాశ్‌రాజ్‌లాంటి వాళ్లు నటిస్తున్నారు. 1995లో కల్కి కృష్ణమూర్తి పొన్నియిన్ సెల్వన్ పేరుతో రాసిన నవల ఆధారంగా ఈ హిస్టారికల్ డ్రామా రూపొందుతోంది. మద్రాస్ టాకీస్, లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్నాడు.