తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Pushpa 2 Ticket Prices: ఆకాశాన్ని తాకుతున్న పుష్ప 2 టికెట్ ధరలు.. వాదనలు విన్న హైకోర్టు ఆఖరికి ఏం చెప్పిందంటే?

Pushpa 2 Ticket Prices: ఆకాశాన్ని తాకుతున్న పుష్ప 2 టికెట్ ధరలు.. వాదనలు విన్న హైకోర్టు ఆఖరికి ఏం చెప్పిందంటే?

Galeti Rajendra HT Telugu

03 December 2024, 15:36 IST

google News
  • Pushpa 2 Ticket Rate Hikes: పుష్ప 2 మూవీ మరో రెండు రోజుల్లో థియేటర్లలోకి రాబోతోంది. మూడేళ్ల తర్వాత అల్లు అర్జున్ నుంచి వస్తున్న సినిమా కావడంతో.. మూవీపై ప్రేక్షకుల్లో అమితాసక్తి నెలకొంది. దాంతో సినిమా టికెట్ల ధరలు కూడా ఆకాశాన్ని తాకుతున్నాయి. 

పుష్ప 2లో అల్లు అర్జున్
పుష్ప 2లో అల్లు అర్జున్

పుష్ప 2లో అల్లు అర్జున్

దేశవ్యాప్తంగా పుష్ప-2 మేనియా మొదలైపోయింది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప 2: ది రూల్’ మూవీ ప్రపంచవ్యాప్తంగా డిసెంబరు 5న రిలీజ్‌కి సిద్ధమైంది. ఆరు భాషల్లో.. వరల్డ్‌వైడ్ సుమారు 12,000 స్క్రీన్‌లలో పుష్ప 2ని రిలీజ్ చేయబోతున్నారు. వేరే పెద్ద సినిమా ప్రస్తుతం ఏదీ థియేటర్లలో లేకపోవడంతో.. తెలుగు రాష్ట్రాల్లోనూ దాదాపు అన్ని థియేటర్లలోనూ పుష్ప 2 రిలీజ్ అయ్యే అవకాశం ఉంది.

దేశ వ్యాప్తంగా పుష్ప 2 టికెట్ రేట్లు ఇలా

పుష్ప 2కి ఏర్పడిన క్రేజ్ కారణంగా.. టికెట్ రేట్లు కూడా ఆకాశాన్ని తాకుతున్నాయి. ఢిల్లీ, ముంబయి, బెంగళూరు వంటి నగరాల్లో రూ.1500 వరకూ టికెట్ ధర పలుకుతుండగా.. తెలుగు రాష్ట్రాల్లోనూ రూ.1,000 వరకూ పలుకుతోంది. బెనిఫిట్ షోకి రూ.800 వరకూ అదనంగా వసూలు చేసుకోవడానికి ఇప్పటికే ప్రభుత్వాలు కూడా అనుమతి ఇచ్చేశాయి.

పుష్ప 2 టికెట్ ధర పెంపుపై తెలంగాణ హైకోర్టులో ఒక పిటీషన్ దాఖలైంది. మూవీ రిలీజ్ రోజే కాకుండా.. 15 రోజుల వరకూ పెంచిన ధరలు అమల్లో ఉండే అవకాశం ఉందని పిటీషనర్ తరఫు న్యాయవాది కోర్టులో చెప్పుకొచ్చారు.

అందుకే టికెట్ రేట్లు పెంచారట

పుష్ప 2 మూవీని భారీ బడ్జెట్‌తో నిర్మించి ఉండటంతో.. టికెట్ ధరలు పెంచాల్సి వచ్చిందని మూవీ ప్రొడ్యూసర్స్ తరఫు న్యాయవాది హైకోర్టులో చెప్పుకొచ్చారు. ఈ మేరకు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాల నుంచి కూడా అనుమతి తీసుకున్నట్లు న్యాయవాది వెల్లడించారు. అయితే.. బెనిఫిట్ షో పేరుతో అర్ధరాత్రి, తెల్లవారుజామున షోలతో ప్రజలను ఇబ్బంది పెడుతున్నారని ఫిటిషినర్ తరఫు న్యాయవాది చెప్పుకురాగా.. కేవలం ఫ్యాన్స్ కోసమే అలా షోలు వేస్తున్నట్లు ప్రొడ్యూసర్స్ న్యాయవాది వివరణ ఇచ్చారు.

14 రోజులు డెడ్ లైన్

ఇరు పక్షాల వాదనలు విన్న హైకోర్టు న్యాయమూర్తి.. తదుపరి విచారణని డిసెంబరు 17కి వాయిదా వేశారు. అలానే బెనిఫిట్ షో వసూళ్ల వివరాల్ని 14 రోజుల్లో సమర్పించాలని పుష్ప 2 మూవీ నిర్మాణ సంస్థ మైత్రి మూవీస్‌ను ఆదేశించారు. దాంతో అప్పటివరకూ యథాతథంగా టికెట్ రేట్లు కొనసాగనున్నాయి.

తెలుగు రాష్ట్రాల్లో పుష్ప 2 టికెట్ ధరలు ఇలా

తెలంగాణలో సింగిల్ స్క్రీన్, మల్టీఫ్లెక్స్‌లో పుష్ప 2: ది రూల్ మూవీ బెనిఫిట్ షో టికెట్ ధరలు రూ.800 ఉన్నాయి. రిలీజ్ రోజు నుంచి అంటే.. డిసెంబర్ 5 నుంచి డిసెంబరు 8 వరకు రాష్ట్ర వ్యాప్తంగా మల్టీఫ్లెక్స్ లో రూ.200, సింగిల్ స్క్రీన్‌లో రూ.150 ధరను పెంచుకోవచ్చు. ఆ తర్వాత డిసెంబర్ 9 నుంచి సింగిల్ స్క్రీన్ లో రూ.105, మల్టీఫ్లెక్స్‌లో రూ.150 వరకు వసూలు చేయనున్నారు. ఏపీలో కూడా దాదాపు ఇలానే ధరలు పెంపునకి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.

తదుపరి వ్యాసం