తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Pawan Kalyan: పవన్ కల్యాణ్ సింగపూర్ వెళ్లింది ఇందుకే..

Pawan Kalyan: పవన్ కల్యాణ్ సింగపూర్ వెళ్లింది ఇందుకే..

20 July 2024, 21:25 IST

google News
    • Pawan Kalyan: పవన్ కల్యాణ్ ఇటీవలే తన భార్య అనా లెజెనెవాతో కలిసి సింగపూర్ వెళ్లారు. అయితే, ఈ టూర్ ఎందుకు వెళ్లారో ఇప్పుడు తెలిసింది.
Pawan Kalyan: పవన్ కల్యాణ్ సింగపూర్ వెళ్లింది ఇందుకే..
Pawan Kalyan: పవన్ కల్యాణ్ సింగపూర్ వెళ్లింది ఇందుకే..

Pawan Kalyan: పవన్ కల్యాణ్ సింగపూర్ వెళ్లింది ఇందుకే..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, పపర్ స్టార్ పవన్ కల్యాణ్ చాలా బిజీగా ఉన్నారు. పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి లాంటి కీలక శాఖలను చేపట్టిన ఆయన వరుస సమీక్షలు, సమావేశాలతో జూన్ నుంచి తీరిక లేకుండా ఉన్నారు. సినిమాలకు ఎన్నికల ముందే బ్రేక్ ఇచ్చేశారు. ప్రస్తుతం మంత్రిత్వ శాఖల పనులతో తలమునకలై పని చేస్తున్నారు. అయితే, ఇటీవల సడెన్‍గా పవన్ కల్యాణ్ తన భార్య అనా లెజెనెవాతో కలిసి సింగపూర్ బయలుదేరారు. అయితే, ఇంత బిజీలో ఆయన ఎందుకు అక్కడి వెళ్లారా అని చాలా మంది ఈ విషయంపై ఆసక్తి కనబరిచారు. అయితే, సింగపూర్‌కు పవన్ ఎందుకు వెళ్లారో నేడు (జూలై 20) తెలిసింది.

మాస్టర్స్ అందుకున్న అనా

తన భార్య అనా లెజెనెవా మాస్టర్స్ పట్టా అందుకునే కార్యక్రమానికి హాజరయ్యేందుకు సింగపూర్ వెళ్లారు పవన్ కల్యాణ్. నేడు (జూలై 20) జరిగిన ఈ కాన్వకేషన్‍లో పవన్ పాల్గొన్నారు. ప్రతిష్ఠాత్మక నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్ నుంచి ఆర్ట్స్ నుంచి మాస్టర్స్ డిగ్రీ అందుకున్నారు అనా. ఈస్టర్న్ ఏషియన్ ఆర్ట్స్, సోషల్ సైన్సెస్‍లో ఆమె మాస్టర్స్ పూర్తి చేశారు.

నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్ కాన్వకేషన్‍లో అనా లెజెనెవా మాస్టర్స్ అందుకున్న వీడియో, ఫొటోలను సోషల్ మీడియాలో జనసేన పార్టీ పోస్ట్ చేసింది. మాస్టర్స్ పట్టాతో అనా, పవన్ దిగిన సెల్ఫీని కూడా షేర్ చేసింది.

ప్రశంసలు కురిపిస్తున్న నెటిజన్లు

అనా లెజెనెవా కాన్వకేషన్‍కు హాజరైన పవన్ కల్యాణ్‍పై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇంత బిజీగా ఉన్నా ఈ కార్యక్రమానికి వెళ్లడంపై పొగుడుతున్నారు. భార్యను ఉన్నత చదువులు చదివేందుకు ప్రోత్సహిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారంటూ ఫ్యాన్స్ అంటున్నారు. ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‍గా మారాయి.

ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్.. పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. కూటమి ప్రభుత్వంలోకి రావటంతో డిప్యూటీ సీఎం పదవిని పవన్ దక్కించుకున్నారు. గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్, అటవీ, తాగునీటి సరఫరా సహా మరో రెండు శాఖల మంత్రిగా జూన్‍లో ఆయన బాధ్యతలు స్వీకరించారు.

పవన్ కల్యాణ్ సినిమాల లైనప్

పవన్ కల్యాణ్ ఇంకా మూడు సినిమాలు పూర్తి చేయాల్సి ఉంది. అయితే, మరో మూడు నెలలు షూటింగ్‍కు వెళ్లడం కుదరదనేలా ఆయన ఇటీవలే చెప్పారు. ఆ తర్వాత కూడా వారంలో ఒకటి, రెండు రోజులు కుదిరినప్పుడు షూటింగ్‍లు చేస్తానని చెప్పారు. లైనప్‍లో ఉన్న మూడు చిత్రాలను పూర్తి చేస్తానని వెల్లడించారు. పవన్ కల్యాణ్ హీరోగా రానున్న ఓజీ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. గ్యాంగ్‍స్టర్ యాక్షన్ డ్రామాగా ఈ చిత్రానికి సుజీత్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. సెప్టెంబర్‌లో రిలీజ్ అంటూ ముందుగా ప్రకటించినా.. వాయిదా పడింది.

పీరియడ్ అడ్వెంచర్ యాక్షన్ మూవీ ‘హరిహర వీరమల్లు’ సినిమాపై కూడా చాలా ఆసక్తి ఉంది. పవన్ కల్యాణ్ హీరోగా ఉన్న ఈ చిత్రం మొఘులుల కాలం నాటి బ్యాక్‍డ్రాప్‍లో రానుంది. మూడేళ్ల క్రితమే షూటింగ్ మొదలైనా ఇప్పటికీ ఓ కొలిక్కి రాలేదు. మళ్లీ పట్టాలెక్కించేందుకు మేకర్స్ ఇటీవలే నిర్ణయించారు. అయితే, దర్శకుడు క్రిష్ ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకోగా.. దర్శకుడిగా జ్యోతి కృష్ణ బాధ్యతలు తీసుకున్నారు. హరీశ్ శంకర్ దర్శకత్వంలో ఉస్తాద్ భగత్‍సింగ్ చిత్రాన్ని కూడా పవన్ చేయాల్సి ఉంది. ఎన్నికల ముందు ఈ చిత్రం నుంచి గ్లింప్స్ రిలీజ్ కాగా అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రాల్లో పవన్ ఏది ముందు పూర్తి చేస్తారో.. ఎప్పుడు రిలీజ్ అవుతుందోనని ఫ్యాన్స్ చాలా ఆసక్తిగా వేచిచూస్తున్నారు.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం