Ustaad Bhagat Singh Teaser: 'గాజు పగిలే కొద్దీ పదునెక్కుద్ది’: ఉస్తాద్ భగత్ సింగ్ టీజర్ వచ్చేసింది
Ustaad Bhagat Singh Blaze Teaser: ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రం నుంచి టీజర్ వచ్చేసింది. పవర్ ఫుల్ లుక్, యాక్షన్, డైలాగ్‍లతో పవన్ కల్యాణ్ అదరగొట్టారు. జనసేన ఎన్నికల గుర్తు గాజు గ్లాసును హైలైట్ చేస్తూ డైలాగ్స్ ఉన్నాయి.
Ustaad Bhagat Singh Teaser: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ లైనప్‍లో ప్రస్తుతం మూడు సినిమాలు ఉన్నాయి. వీటిలో హరీశ్ శంకర్ దర్శకత్వంలో ఆయన హీరోగా నటిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రంపై ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. వీరి కాంబోలో గతంలో తెరకెక్కిన గబ్బర్ సింగ్ బ్లాక్ బస్టర్ అయింది. ఇప్పుడు ‘ఉస్తాద్ భగత్ సింగ్’తో వీరి కాంబో మళ్లీ వస్తోంది. దీంతో ఈ మూవీపై చాలా అంచనాలు ఉన్నాయి. అంత హైప్ ఉన్న ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ నుంచి నేడు (మార్చి 19) ప్రత్యేకమైన టీజర్ రిలీజ్ అయింది.

భగత్ బ్లేజ్ అంటూ ఈ ఉస్తాద్ భగత్ సింగ్ టీజర్‌ను మూవీ టీమ్ తీసుకొచ్చింది. ఈ సినిమాలో భగత్ సింగ్ అనే పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ చేస్తున్నారు పవన్ కల్యాణ్. ఈ టీజర్‌లో పవన్ యాక్షన్, లుక్, స్వాగ్, డైలాగ్స్ అదిరిపోయాయి. తన రాజకీయ పార్టీ జనసేన ఎన్నికల గుర్తు ‘గాజుగ్లాసు’ను హైలైట్ చేస్తూ ఈ టీజర్‌లో డైలాగ్స్ ఉన్నాయి.
గ్లాస్ అంటే సైజ్ కాదు.. సైన్యం
ఓ దేవాలయం వద్ద ఉత్సవం జరుగుతుంటే.. అక్కడ రౌడీలు విధ్వంసం చేస్తున్న సీన్‍తో ఉస్తాద్ భగత్ సింగ్ బ్లేజ్ టీజర్ మొదలైంది. అక్కడికి వచ్చి రౌడీలను చితకబాదుతారు భగత్ సింగ్ (పవన్ కల్యాణ్). రౌడీలను చితక్కొట్టేస్తారు. గాజు గ్లాసు చూపిస్తూ ‘నీ రేంజ్ ఇదీ’ అంటూ పోలీస్ స్టేషన్‍లో దాన్ని పగులకొడతాడు విలన్. అయితే.. “గాజు పగిలేకొద్దీ పదునెక్కుద్ది” అని పవర్ స్టార్ పవర్ ఫుల్ డైలాగ్ చెబుతారు. 2019 ఎన్నికల్లో ఓటమి ఎదురైనా.. ఇప్పుడు తాము మరింత పదునెక్కామని చెప్పేలా ఈ డైలాగ్ అనిపిస్తోంది.
“కచ్చితంగా గుర్తు పెట్టుకో.. గ్లాస్ అంటే సైజ్ కాదు.. సైన్యం.. కనిపించని సైన్యం” అనే పవన్ డైలాగ్ అదిరిపోయింది. మధ్యమధ్యలో యాక్షన్ సీన్లతో ఈ టీజర్ ఆకట్టుకునేలా ఉంది. పవన్ కల్యాణ్, జనసేన అభిమానులకు ఫుల్ ఫీస్ట్‌లా ఈ టీజర్ సాగింది. ముఖ్యంగా జనసేన ఎన్నికల గుర్తు గాజుగ్లాస్ చుట్టూ డైలాగ్స్ ఉన్నాయి. సంగీత దర్శకుడు దేవీ శ్రీప్రసాద్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా అదిరిపోయింది.
ఉస్తాద్ భగత్ సింగ్ మూవీలో పవన్ కల్యాణ్ సరసన శ్రీలీల హీరోయిన్‍గా నటిస్తున్నారు. టీజర్లో ఓ చోట ఆమె కనిపించారు. అషుతోశ్ రాణా, నవాబ్ షా, బీఎస్ అవినాశ్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేనీ, యలమంచిలి రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రం రిలీజ్ ప్లాన్ గురించి టీజర్లో మేకర్స్ వెల్లడించలేదు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పవన్ కల్యాణ్ బిజీగా ఉండటంతో ఈ మూవీ షూటింగ్ ఎప్పుడు పూర్తవుతుందో ఇంకా క్లారిటీ లేదు. దీంతో రిలీజ్ డేట్‍పై ఎలాంటి హింట్ ఇవ్వలేదు మూవీ టీమ్.
ముందు ఓజీనే..
సుజీత్ దర్శకత్వంలో పవన్ కల్యాణ్ హీరోగా నటిస్తున్న ఓజీ సినిమా రిలీజ్ డేట్ ఇప్పటికే ఫిక్స్ అయింది. ఈ మూవీని సెప్టెంబర్ 27వ తేదీన రిలీజ్ చేయనున్నట్టు మూవీ టీమ్ ఇప్పటికే ప్రకటించింది. దీంతో ఎన్నికల తర్వాత ముందుగా ఈ చిత్రాన్ని పూర్తి చేయనున్నారు పవర్ స్టార్. క్రిష్ దర్శకత్వంలో ‘హరిహర వీరమల్లు’ చిత్రం కూడా పవన్ చేతిలో ఉంది. సుదీర్ఘ కాలంగా సాగుతున్న ఈ మూవీపై కూడా ఎలాంటి క్లారిటీ లేదు. ఈ పరిస్థితిని చూస్తే.. ఉస్తాద్ భగత్ సింగ్.. 2025లోనే వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.