OTT Movie: ఏడాదిన్నర తర్వాత ఓటీటీలోకి వస్తున్న టాప్ కమెడియన్ నటించిన హిట్ మూవీ.. స్ట్రీమింగ్ డేట్ ఇదే
10 October 2024, 16:16 IST
- OTT Movie: ఓటీటీలోకి ఏడాదిన్నర తర్వాత వస్తోంది ఓ ఫ్యామిలీ డ్రామా మూవీ. ప్రముఖ కమెడియన్ కపిల్ శర్మ నటించిన ఈ సినిమా గతేడాది మార్చిలో రిలీజ్ కాగా.. ఈ నెలలోనే డిజిటల్ ప్రీమియర్ కు సిద్ధమైంది.
ఏడాదిన్నర తర్వాత ఓటీటీలోకి వస్తున్న టాప్ కమెడియన్ నటించిన హిట్ మూవీ.. స్ట్రీమింగ్ డేట్ ఇదే
OTT Movie: ఓటీటీలోకి మరో ఇంట్రెస్టింగ్ మూవీ వస్తోంది. నిజానికి ఈ సినిమా గతేడాది మార్చిలో థియేటర్లలో రిలీజైనా.. డిజిటల్ ప్రీమియర్ మాత్రం కాలేదు. మొత్తానికి ఈ నెలలోనే మూవీని స్ట్రీమింగ్ చేయనున్నట్లు అమెజాన్ ప్రైమ్ వీడియో వెల్లడించింది. ప్రముఖ కమెడియన్ కపిల్ శర్మ నటించిన ఈ సినిమాను నందితా దాస్ డైరెక్ట్ చేయడం విశేషం.
జ్విగాటో ఓటీటీ రిలీజ్ డేట్
కపిల్ శర్మ నటించిన ఈ సినిమా పేరు జ్విగాటో. ఈ సినిమా అక్టోబర్ 25 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది. టాలెంటెడ్ నటి నందితా దాస్ డైరెక్ట్ చేసిన ఈ డ్రామా.. గతేడాది మార్చిలో థియేటర్లలో రిలీజైంది. అప్పటి నుంచీ ఓటీటీ రిలీజ్ కోసం వేచి చూస్తుండగా.. మొత్తానికి ప్రైమ్ వీడియో గురువారం (అక్టోబర్ 10) స్ట్రీమింగ్ డేట్ అనౌన్స్ చేసింది.
అక్టోబర్ లో ప్రైమ్ వీడియోలో కచ్చితంగా చూడాల్సిన 29 సినిమాలు, వెబ్ సిరీస్ ఇవే అంటూ సదరు ఓటీటీ రిలీజ్ చేసిన జాబితాలో ఈ జ్విగాటో మూవీ కూడా ఉండటం అభిమానులను ఆనందానికి గురి చేస్తోంది. థియేటర్లలో రిలీజైన సమయంలో ఈ జ్విగాటో సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది.
ఏంటీ జ్విగాటో మూవీ?
జ్విగాటో మూవీలో కపిల్ శర్మతోపాటు షహానా గోస్వామి, గుల్ పనాగ్, సయానీ గుప్తా, స్వానంద్ కిర్కిరే, తుషార్ ఆచార్యలాంటి వాళ్లు కూడా నటించారు. ఈ మూవీలో మానస్ సింగ్ మహతో అనే పాత్రలో కపిల్ శర్మ నటించాడు.
ఒడిశా రాజధాని భువనేశ్వర్ లో ఈ మూవీని తీశారు. ఓ ఫ్యాక్టరీలో ఫ్లోర్ మేనేజర్ గా పని చేసే అతడు.. తన ఉద్యోగం కోల్పోయిన తర్వాత ఓ ఫుడ్ డెలివరీ ఏజెంట్ గా మారాల్సి వస్తుంది.
ఆ తర్వాత అతని జీవితంలో ఎలాంటి మార్పులు వచ్చాయి అన్నది ఈ మూవీలో చూడొచ్చు. ఈ సినిమాను తొలిసారి 2022 సెప్టెంబర్ లో టొరంటో ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శించారు. తర్వాత మార్చి, 2023లో థియేటర్లలో రిలీజైంది.
ఈ ఫ్యామిలీ డ్రామాను డైరెక్టర్ నందితా దాస్ మనసుకు హత్తుకునేలా తీయడంతో థియేటర్లలో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఐఎండీబీలో 7కుపైగా రేటింగ్ తోపాటు రోటెన్ టొమాటోస్ లోనూ 100 శాతం స్కోరు సాధించింది. దీంతో ఈ సినిమాకు ఓటీటీలో మరింత మంచి రెస్పాన్స్ వచ్చే అవకాశం కనిపిస్తోంది.