తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Mm Keeravani: ఆస్కార్ అవార్డు తెచ్చిపెట్టిన నాటునాటు తన బెస్ట్ సాంగ్ కాదన్న కీరవాణి

MM Keeravani: ఆస్కార్ అవార్డు తెచ్చిపెట్టిన నాటునాటు తన బెస్ట్ సాంగ్ కాదన్న కీరవాణి

10 July 2024, 21:04 IST

google News
    • MM Keeravani Naatu Naatu song: ఆస్కార్ అవార్డు సాధించిపెట్టిన నాటు నాటు పాట గురించి ఎంఎం కీరవాణి కామెంట్లు చేశారు. అది తన అత్యంత బెస్ట్ సాంగ్ కాదని అన్నారు. మరిన్ని వ్యాఖ్యలు చేశారు.
MM Keeravani: ఆస్కార్ అవార్డు తెచ్చిపెట్టిన నాటునాటు తన బెస్ట్ సాంగ్ కాదన్న కీరవాణి
MM Keeravani: ఆస్కార్ అవార్డు తెచ్చిపెట్టిన నాటునాటు తన బెస్ట్ సాంగ్ కాదన్న కీరవాణి

MM Keeravani: ఆస్కార్ అవార్డు తెచ్చిపెట్టిన నాటునాటు తన బెస్ట్ సాంగ్ కాదన్న కీరవాణి

దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమా భారీ బ్లాక్‍బస్టర్ అయింది. మెగా పవర్ స్టార్ రామ్‍చరణ్, మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా నటించిన ఆ సినిమా గ్లోబల్ రేంజ్‍లో పాపులర్ అయింది. రాజమౌళికి అంతర్జాతీయ గుర్తింపు లభించింది. ఆర్ఆర్ఆర్ చిత్రంలోని నాటు నాటు పాటకు ఏకంగా ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డు దక్కింది. దీంతో మ్యూజిక్ డైరెక్టర్ ఎం.ఎం.కీరవాణి కూడా గ్లోబల్ రేంజ్‍లో ఫేమస్ అయ్యారు. అయితే, నాటు నాటు పాట తన బెస్ట్ కాదని కీరవాణి చెప్పారు. తాజాగా మరో ఇంటర్వ్యూలో ఈ కామెంట్లు చేశారు. ఆ వివరాలు ఇవే..

నా బెస్ట్ కాదు

తన సుదీర్ఘ సినీ కెరీర్లో ఇప్పటి వరకు సుమారు 190 సినిమాలకు మ్యూజిక్ డైరెక్టర్‌గా చేశారు కీరవాణి. ఆయన ఎన్నో పాటలకు అద్భుతమైన స్వరాలు అందించారు. ఆయన సంగీతం ఇచ్చిన కొన్ని పాటలు ఆల్‍టైమ్ క్లాసిక్స్‌గా నిలిచాయి. 2022లో వచ్చిన ఆర్ఆర్ఆర్ చిత్రంలోని నాటు నాటు పాటకు ఏకంగా ఆస్కార్ దక్కి.. ఆయనకు అంతర్జాతీయ గుర్తింపు వచ్చింది. అయితే, నాటు నాటు తన బెస్ట్ కాదని ఇండియన్ ఎక్స్‌ప్రెస్‍కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎం.ఎం.కీరవాణి అన్నారు.

గుర్తింపు ఆలస్యంగా వచ్చిందని అనుకుంటున్నారా అనే ప్రశ్నకు కీరవాణి స్పందించారు. తన బెస్ట్ కాని పాటకు గుర్తింపు వచ్చిందని ఈ క్రమంలో చెప్పారు. “త్వరగానో లేకపోతే ఆలస్యంగానో.. నా అత్యుత్తమం కాని పాటకు అంతర్జాతీయ గుర్తింపు లభించింది. గుర్తింపు రావాల్సినప్పుడు ఎక్కడి నుంచైనా ఎలాగోలాగ వస్తుంది. మన ఆయుష్షు ఇంత.. అని నిర్ణయించినందుకు కొన్నిసార్లు మనం ఆలస్యమైందని భావిస్తాం. కానీ మనం ఎంతకాలం జీవిస్తామో తెలియనప్పుడు అలాంటిది ఉండదు. గుర్తింపు రావాల్సినప్పుడు వస్తుంది” అని కీరవాణి చెప్పారు. అంటే ఆస్కార్ వచ్చిన నాటు నాటు కంటే తాను చాలా ఉత్తమమైన పాటలను తాను స్వరపరిచానని కీరవాణి పరోక్షంగా చెప్పారు.

నాకు అంత సంతోషం కలగలేదు

బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో నాటు నాటు పాటకు ఆస్కార్ అందుకొని ఇండియాకు వచ్చాక తనకు ఎంత సంతోషం కలగలేదని కీరవాణి అన్నారు. అయితే, అంతకు ముందు దివంగత రామోజీరావు చెప్పిన మాటలు తనకు ఉత్సాహం కలిగించాయని ఇటీవలే ఓ ఈవెంట్లో కీరవాణి అన్నారు.

ఆస్కార్‌కు రామోజీరావు చాలా ప్రాధాన్యమిచ్చారని, దీంతో తనకు కూడా ఆసక్తి పెరిగిందని ఇటీవలే కీరవాణి వెల్లడించారు. “ఆస్కార్ అవార్డుకు నామినేట్ అయినప్పుడు నాకు పెద్దగా సంతోషం అనిపించలేదు. అయితే నేను రామోజీరావును కలిసినప్పుడు, ఆస్కార్ తీసుకొని రావాలని ఆయన నాతో చెప్పారు. ఆయన ఆస్కార్ అవార్డుకు అంత ప్రాధాన్యత ఇస్తున్నారని, నేను గెలువాలని కోరుకున్నా. అప్పుడు అవార్డు విలువ తెలిసింది. అవార్డు ప్రకటించే కొన్ని సెకన్ల వరకు టెన్షన్‍గా ఉన్నా. అది నాకోసం కాదు.. ఆయన కోసం” అని కీరవాణి ఇటీవల చెప్పారు.

మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న విశ్వంభర సినిమాకు ప్రస్తుతం సంగీతం అందిస్తున్నారు కీరవాణి. పవన్ కల్యాణ్ మూవీ హరిహర వీరమల్లుకు కూడా ఆయన మ్యూజిక్ డైరెక్టర్‌గా ఉన్నారు.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం