MM Keeravani: ఏఆర్ రెహమాన్, అనిరుధ్ లాంటి మ్యూజిక్ డైరెక్టర్ అతడు: ఎంఎం కీరవాణి
MM Keeravani: ఓ యువ సంగీత దర్శకుడిపై స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి ప్రశంసల వర్షం కురిపించారు. ఏఆర్ రెహమాన్, అనిరుధ్ రవిచందర్‌తో అతడిని పోల్చారు.
MM Keeravani: మంత్ ఆఫ్ మధు సినిమా రిలీజ్ సమీపిస్తోంది. నవీన్ చంద్ర, కలర్స్ స్వాతి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం అక్టోబర్ 6వ తేదీన థియేటర్లలో రిలీజ్ కానుంది. ఎమోషనల్ లవ్ ఫ్యామిలీ మూవీగా ఈ చిత్రం రూపొందింది. శ్రీకాంత్ నాగోతు దర్శకత్వం వహించిన మంత్ ఆఫ్ మధు సినిమాకు అచ్చు రాజామణి సంగీతం అందించారు. ఇటీవలే ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ కాగా.. మంచి రెస్పాన్స్ వచ్చింది. ఎమోషనల్‍గా హృదయాన్ని హత్తుకునేలా ట్రైలర్ ఉంది. కాగా, మంత్ ఆఫ్ మధు సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ నేడు (అక్టోబర్ 1) హైదరాబాద్‍లో జరిగింది. ఈ కార్యక్రమానికి స్టార్ మ్యూజిక్ డైరెక్టర్, ఆస్కార్ అవార్డ్ విజేత ఎంఎం కీరవాణి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.
మంత్ ఆఫ్ మధు సినిమాకు సంగీత దర్శకుడిగా ఉన్న అచ్చు రాజామణిపై ప్రశంసల వర్షం కురిపించారు ఎంఎం కీరవాణి. ఎనర్జీ, ఎన్నోవేషన్‍ను మేళవించి మ్యూజిక్ ఇచ్చే సామర్థ్యం రాజామణికి ఉందని అన్నారు. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్స్ ఏఆర్ రెహమాన్, అనిరుధ్ రవిచందర్‌లతో ఆయనను పోల్చారు కీరవాణి.
“మామూలుగా ఎనర్జీ ఎక్కువైతే (మ్యూజిక్‍లో) బండబాదుడు అవుతుంది. కేవలం ఎనర్జీ అయితే. కేవలం ప్రయోగాలు, ఇన్నోవేషన్ అయితే.. దాన్ని కళాతపస్సు అంటారు. ఆవలింతలు వస్తాయి. అందుకే మనకు ఎనర్జీ, ఇన్నోవేషన్ రెండూ కావాలి. అప్పుడే అది ఒక ఏఆర్ అవుతుంది. ఏఆర్ అంటే అది ఏఆర్ రెహమాన్ కావొచ్చు.. అనిరుధ్ రవిచందర్ కావొచ్చు.. అచ్చు రాజామణి కావొచ్చు. అచ్చు రాజామణిలో ఎనర్జీ, ఇన్నోవేషన్ రెండూ సమపాళ్లతో ఉన్నాయి. అతడు నాకు చిన్నప్పటి నుంచి తెలుసు” అని ఎంఎం కీరవాణి అన్నారు. కెరీర్ తొలినాళ్లలో తాను అచ్చు రాజామణి తండ్రి వద్ద పని చేసిన జ్ఞాపకాలను కూడా కీరవాణి గుర్తు చేసుకున్నారు.
మంత్ ఆఫ్ మధు సినిమా ట్రైలర్‌లో బ్యాక్‍గ్రౌండ్ మ్యూజిక్ చాలా ఫ్రెష్‍గా ఉంది. ‘పలుకే బంగారమాయెనా’ సాంగ్ బ్యాక్‍గ్రౌండ్‍లో వస్తుంది. అలాగే.. దానికి ట్రెండీ మ్యూజిక్ కూడా మిక్స్ అయి ఉంది. రాజామణి ఇచ్చిన బ్యాక్‍గ్రౌండ్ మ్యూజిక్ ట్రైలర్‌కు పెద్ద ప్లస్‍గా ఉంది. ఇలాగే, ఇప్పటి వరకు మంత్ ఆఫ్ మధు నుంచి రెండు పాటలు వచ్చాయి.
మంత్ ఆఫ్ మధు చిత్రంలో నవీన్ చంద్ర, స్వాతితో పాటు శ్రేయ నవిలే కూడా ప్రధాన పాత్ర పోషించారు. ఘట్టమనేని మంజుల, వైవా హర్ష, రాజా చెంబోలు కీలకపాత్రల్లో చేశారు.