Naatu Naatu wins Oscar: సరికొత్త చరిత్రకు నాంది.. ఆర్ఆర్ఆర్ ఒడిలో ఆస్కార్.. విశ్వ వేదికపై 'నాటు' దెబ్బ -rrr naatu naatu win oscar award in best original song category ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Naatu Naatu Wins Oscar: సరికొత్త చరిత్రకు నాంది.. ఆర్ఆర్ఆర్ ఒడిలో ఆస్కార్.. విశ్వ వేదికపై 'నాటు' దెబ్బ

Naatu Naatu wins Oscar: సరికొత్త చరిత్రకు నాంది.. ఆర్ఆర్ఆర్ ఒడిలో ఆస్కార్.. విశ్వ వేదికపై 'నాటు' దెబ్బ

Naatu Naatu wins Oscar: అందరూ అనుకున్నట్లే జరిగింది. అంతర్జాతీయ వేదికపై భారతీయులంతా గర్వపడేలా ఆర్ఆర్ఆర్ మూవీ ఆస్కార్ గెలిచింది. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో నాటు నాటు సాంగ్ అవార్డు సొంతం చేసుకుంది.

నాటు నాటు సాంగ్‌కు ఆస్కార్ అవార్డులతో చంద్రబోస్, కీరవాణి (Chris Pizzello/Invision/AP)

Naatu Naatu wins Oscar: ఆస్కార్.. ఎప్పుడూ అందని ద్రాక్షే. అసలు నామినేషన్‌ కోసం ఎంపిక కావడమే పెద్ద గొప్ప విషయం. అలాంటిది అకాడమీ అవార్డుల్లో తుది నామినేషన్ అందుకుని ప్రపంచ వేదికపై తెలుగు ఖ్యాతిని చాటింది ఆర్ఆర్ఆర్ మూవీ. చివరకు ఆస్కార్ అవార్డు కూడా కైవసం చేసుకుని కొత్త చరిత్రకు నాంది పలికింది. ఆర్ఆర్ఆర్ సినిమాలో నాటు నాటు పాట బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్‌ను కైవసం చేసుకుంది. యావత్ ప్రపంచం మన సినిమాపై దృష్టి సారించేలా సరికొత్త అధ్యాయాన్ని లిఖించింది.

నాటు నాటు బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో అవార్డు దక్కించుకుంది. ఈ మేరకు వేదికపై ఎంఎం కీరవాణి, చంద్రబోస్ వెళ్లి అవార్డును స్వీకరించారు. పురస్కారం తీసుకునే సమయంలో ఆర్ఆర్ఆర్ టీమ్ ఆనందోత్సాహాలతో కేరింతలు కొట్టింది.

ఆస్కార్ గెలవడానికి ఎక్కువ అవకాశమున్న పాటగా నాటు నాటుపై మొదటి నుంచి సానుకూల ధోరణి ఏర్పడింది. అందుకే 95వ అకాడమీ అవార్డుల కోసం రోజులు లెక్కబడుతూ ఉత్కంఠగా ఎదురు చూసేలా చేసింది. అగ్ర దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన నాటు నాటు సాంగ్ ఆస్కార్‌కు నామినేట్ కావడంతోనే తెలుగు సినిమా చరిత్ర సృష్టించినట్లయింది. ఓ తెలుగు చిత్రానికి ఆస్కార్‌ రావడం ఇదే తొలిసారి.

ఈ వేడుకకు తారక్, రాజమౌళి, చరణ్ ముగ్గురు భారతీయ సంప్రదాయం ఉట్టిపడేలా షెర్వాణి ధరించి హాజరయ్యారు. చరణ్, తారక్ నలుపు రంగు దుస్తుల్లో మెరిశారు. ముఖ్యంగా ఎన్‌టీఆర్ భుజంపై పులి బొమ్మ కనిపించేలా డిజైన్ చేసిన షెర్వాణి ధరించారు. రెడ్ కార్పెట్‌పై హుందాగా నడిచారు.