Dhootha Delayed: నాగచైతన్య వెబ్ సిరీస్ ధూత ఆలస్యం ఎందుకు అవుతోంది? అదే కారణమా?
18 May 2023, 17:54 IST
- Dhootha Delayed: నాగచైతన్య ఓటీటీలో అరంగేట్రం చేస్తున్న వెబ్ సిరీస్ ధూత. హర్రర్ జోనర్‌లో తెరకెక్కుతోన్న ఈ సిరీస్ షూటింగ్ పూర్తయిన ఇంత వరకు విడుదలపై ఎలాంటి స్పష్టత రాలేదు. అయితే పాన్ ఇండియా రేంజ్‌లో ఇతర భాషల్లోనూ విడుదల చేయాలని ప్రైమ్ వీడియో భావిస్తోందట.
ధూత వెబ్ సిరీస్ ఆలస్యం
Dhootha Delayed: అక్కినేని నాగచైతన్య ఇటీవల కస్టడీ సినిమాతో సందడి చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ మూవీ మిక్స్‌డ్ టాక్ రావడంతో అక్కినేని ఫ్యాన్స్ నిరాశ చెందుతున్నారు. దీంతో అభిమానులను సంతృప్తి పరిచేలా మంచి హిట్‌తో రావాలని చై ఆలోచనలో పడ్డాడు. ఇదిలా ఉంటే నాగచైతన్య ప్రధాన పాత్రలో నటించిన ధూత అనే వెబ్ సిరీస్ ప్రకటించి చాలా రోజులైనప్పటి నుంచి దీని గురించి అప్డేట్లు పెద్దగా రాలేదు. ఈ సిరీస్ ద్వారా ఓటీటీలో అరంగేట్రం చేయనున్న చై.. ఈ సిరీస్‌పైనే ఆశలు పెట్టుకున్నాడు. అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది.
హర్రర్ జోనర్‌లో తెరకెక్కిన దూత.. షూటింగ్ ఇప్పటికే పూర్తయింది. పోస్డ్ ప్రొడక్షన్ పనులు కూడా దాదాపు పూర్తి కావొచ్చాయి. షూటింగ్ పూర్తయినా ఇంకా ఈ సిరీస్ నుంచి అప్డేట్ రాకపోవడంతో ఫ్యాన్స్ ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. అయితే తెలుగులో మాత్రమే తెరకెక్కిన ఈ సిరీస్‌ను ఇతర భాషల్లోనూ డబ్ చేసి పాన్ ఇండియా రేంజ్‌లో విడుదల చేయాలని ప్రైమ్ వీడియో భావిస్తోంది. తాజాగా ఈ విషయంపై నాగచైతన్య కూడా స్పందించారు.
“ధూత షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తయ్యాయి. అయితే కేవలం తెలుగులో మాత్రమే పూర్తయింది. అమెజాన్ ప్రైమ్ వీడియో భారీ స్థాయిలో రిలీజ్ చేయాలని చూస్తోంది. నేషన్ వైడ్‌గా స్ట్రీమింగ్ చేయాలని సన్నాహాలు చేస్తోంది.” అని నాగచైతన్య స్పష్టం చేశారు. ఆయన నటించిన కస్టడీ ఇటీవలే విడుదలైంది. ఇప్పుడు ఓటీటీలో అరంగేట్రం చేయడానికి ఆత్రుతతో ఉన్నారు. అంతేకాకుండా ధూత సిరీస్ నాగచైతన్య నటించిన తొలి హర్రర్ జోనర్ ప్రాజెక్టు. చాలా రోజుల నుంచి ఈ జోనర్‌లో నటించేందుకు చై పెద్దగా ఆసక్తి చూపించలేదు.
ధూత సిరీస్ విడుదల తేదీని అమెజాన్ ప్రైమ్ వీడియో ఇంకా ప్రకటించలేదని, ఈ ఏడాది చివర్లో ఇది వచ్చే అవకాశముందని నాగచైతన్య అన్నారు. ఈ సిరీస్‌లో చైతో పాటు పార్వతి తిరువోతు, ప్రియా భవాని శంకర్, ప్రాచీ దేశాయ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. విక్రమ్ కే కుమార్ దర్శకత్వం వహించిన ఈ సిరీస్‌ను శరత్ మరార్.. నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై నిర్మించారు.