Naga Chaitanya Dhoota: దూతగా మారిన నాగ చైతన్య.. గిఫ్ట్‌లతో ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్
21 November 2023, 21:30 IST
- Naga Chaitanya Dhoota: నాగ చైతన్య తన తొలి వెబ్ సిరీస్ దూత కోసం వెరైటీ ప్రమోషన్లతో బిజీగా ఉన్నాడు. ప్రైమ్ వీడియోలో రానున్న ఈ సిరీస్ కోసం అతడు ఫ్యాన్స్ దగ్గరికి వెళ్లి వాళ్లను గిఫ్ట్‌లతో సర్‌ప్రైజ్ చేశాడు.
దూత ప్రమోషన్లలో భాగంగా అభిమానులను కలిసిన నాగ చైతన్య
Naga Chaitanya Dhoota: అమెజాన్ ప్రైమ్ వీడియో నాగ చైతన్యతో తెలుగులో భారీ బడ్జెట్ తో రూపొందించిన వెబ్ సిరీస్ దూత. చై తొలిసారి ఓటీటీలో అడుగుపెట్టబోతున్నాడు. ఈ సిరీస్ డిసెంబర్ 1న ప్రేక్షకుల ముందుకు రానుండగా.. ప్రస్తుతం చైతన్య ప్రమోషన్లలో బిజీగా ఉన్నాడు. ఇందులో భాగంగా అతడు ఫ్యాన్స్ దగ్గరికి వెళ్తున్నాడు.
థ్రిల్లర్ జానర్ లో రాబోతున్న ఈ దూత వెబ్ సిరీస్ అభిమానులను థ్రిల్ చేస్తుందని నాగ చైతన్య చెప్పాడు. అయితే అభిమానులను నేరుగా వాళ్ల ఇంటికే వెళ్లి సర్‌ప్రైజ్ చేసే కాన్సెప్ట్ మాత్రం చాలా భిన్నంగా ఉంది. ముందుగా ఓ యాంకర్ వెళ్లి అభిమానులతో మాట్లాడుతూ ఉంటాడు. చై అంటే తమకు ఎంత అభిమానమో వాళ్లు చెబుతుంటారు.
ఇంతలో చైతన్యనే నేరుగా తమ ముందు ప్రత్యక్షమయ్యే సరికి వాళ్లు ఆశ్చర్యపోతారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వాళ్లతో కలిసి మాట్లాడిన చై.. దూత వెబ్ సిరీస్ గురించి కూడా ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పాడు. ఇది హారర్ జానర్ కాదని.. థ్రిల్లర్ సిరీస్ అని అతడు తెలిపాడు. ఈ సిరీస్ కోసం తాను ఆతృతగా ఎదురు చూస్తున్నానని, అందరూ చూడాలని కోరాడు.
అంతేకాదు తాను కలిసిన అభిమానులందరికీ ఈ దూత వెబ్ సిరీస్ ప్రీమియర్ టికెట్లు కూడా అందజేయడం విశేషం. టికెట్లతోపాటు అందరికీ ఓ గిఫ్ట్ కూడా ఇచ్చాడు. విక్రమ్ కే కుమార్ డైరెక్ట్ చేసిన ఈ దూత వెబ్ సిరీస్.. ప్రైమ్ వీడియో తెరకెక్కించిన అత్యంత భారీ బడ్జెట్ తెలుగు సిరీస్. దీనికోసం ప్రైమ్ వీడియో ఏకంగా రూ.45 కోట్లు ఖర్చు పెట్టింది.
చాలా రోజుల కిందే షూటింగ్ పూర్తవడంతో ఈ సిరీస్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. డిసెంబర్ 1 నుంచి దూత స్ట్రీమ్ అవనుండగా.. త్వరలోనే ట్రైలర్ రిలీజ్ కానుంది. దూత సిరీస్ తెలుగుతోపాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లోనూ స్ట్రీమ్ అవుతుంది. 8 ఎపిసోడ్ల ఈ సిరీస్ లో చైతన్యతోపాటు తరుణ్ భాస్కర్, పార్వతి తిరువోతు, ప్రియా భవానీ శంకర్, ప్రాచీ దేశాయ్ నటించారు.