Market Mahalakshmi Review: మార్కెట్ మహాలక్ష్మీ రివ్యూ - పార్వతీశం లవ్‌స్టోరీ ఎలా ఉందంటే?
19 April 2024, 7:30 IST
Market Mahalakshmi Review: పార్వతీశం, ప్రణీకాన్వికా హీరోహీరోయిన్లుగా నటించిన మార్కెట్ మహాలక్ష్మీ మూవీ శుక్రవారం థియేటర్ల ద్వారా ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ చిన్న సినిమా ప్రేక్షకుల్ని మెప్పించిందా? లేదా? అంటే?
మార్కెట్ మహాలక్ష్మి
Market Mahalakshmi Review: కేరింత ఫేమ్ పార్వతీశం, ప్రణీకాన్వికా జంటగా నటించిన మూవీ మార్కెట్ మహాలక్ష్మీ. వీఎస్ ముఖేష్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు అఖిలేష్ నిర్మించాడు. మెసేజ్ ఓరియెంటెడ్ లవ్‌స్టోరీగా రూపొందిన ఈ మూవీ శుక్రవారం థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమా ఎలా ఉందంటే...
సాఫ్ట్ వేర్ కుర్రాడి లవ్‌స్టోరీ...
హీరో (సినిమాలో పార్వతీశం క్యారెక్టర్ ఎక్కడ వినిపించదు) సాఫ్ట్‌వేర్ కంపెనీలో జాబ్ చేస్తుంటాడు. పెళ్లి విషయంలో అతడికంటూ కొన్ని ఆలోచనలు, అభిప్రాయాలు ఉంటాయి. ఎవరిపై ఆధారపడకుండా ఇండిపెండెంట్‌గా బతికే అమ్మాయి తనకు భార్యగా రావాలని కలలు కంటాడు. హీరో తండ్రి (కేదార్ శంకర్) మాత్రం కట్నం ఎక్కువగా ఇచ్చే పిల్లతోనే అతడి పెళ్లి జరిపించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఏవేవో కారణాలు చెప్పి తండ్రి తీసుకొచ్చిన సంబంధాలు రిజెక్ట్ చేస్తున్న హీరోకు ఓ రోజు కూరగాయల మార్కెట్‌లో మహాలక్ష్మి (ప్రణీకాన్వికా) కనబడుతుంది.
కూరగాయలు అమ్ముతూ తన కుటుంబాన్ని పోషించుకునే మహాలక్ష్మి తొలిచూపులోనే హీరో ప్రేమలో పడతాడు. మహాలక్ష్మినే పెళ్లి చేసుకోవాలని ఫిక్సవుతాడు. మహాలక్ష్మి మాత్రం అతడి ప్రపోజల్‌ను రిజెక్ట్ చేస్తుంది? మహాలక్ష్మి ప్రేమను గెలుచుకోవడానికి హీరో ఎలాంటి ప్రయత్నాలు చేశాడు?
హీరో ప్రేమను మహాలక్ష్మి ఎందుకు రిజెక్ట్ చేసింది? మహాలక్ష్మి కుటుంబనేపథ్యమేమిటి? మహాలక్ష్మి ప్రేమ కోసం హీరో ఎలాంటి త్యాగానికి సిద్ధపడ్డాడు? హీరో ప్రేమను తొలుత తిరస్కరించిన అతడి తండ్రి కొడుకు మంచి మనసును ఎలా అర్థం చేసుకున్నాడు? అన్నదే మార్కెట్ మహాలక్ష్మి కథ.
రొటీన్ ఫార్ములాకు భిన్నంగా..
వెండితెర ప్రేమకథలు చాలా వరకు పేదింటికి చెందిన ఓ మాస్ కుర్రాడు...గొప్పింటికి చెందిన క్లాస్ అమ్మాయిల చుట్టే తిరుగుతుంటాయి. బాక్సాఫీస్ సక్సెస్ ట్రేడ్‌మార్క్‌గా ఆ ఫార్ములా ముద్రపడిపోయింది. ఈ ఫార్ములా కథలకు భిన్నంగా క్లాస్ అబ్బాయి...మాస్ అమ్మాయి ప్రేమకథతో చాలా తక్కువ సినిమాలొచ్చాయి. ఆ కోవలో మార్కెట్ మహాలక్ష్మీ నిలుస్తుంది.
మెసేజ్ విత్ లవ్‌స్టోరీ...
సాఫ్ట్‌వేర్ జాబ్ చేసే కుర్రాడు...కూరగాయలు అమ్మే మాస్ అమ్మాయితో ఎలా ప్రేమలో పడ్డాడనే పాయింట్‌తో దర్శకుడు ముఖేష్ ఈ కథను రాసుకున్నాడు. ఈ లవ్‌స్టోరీకి మహిళా సాధికారతను చాటిచెప్పే ఓ మెసేజ్‌తో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్, కామెడీని జోడిస్తూ స్క్రీన్‌పై ఆవిష్కరించారు.
పెళ్లి విషయంలో నేటితరం యువతం ఆలోచనల్లో ఎలా ఉంటున్నాయి... కట్నాల సంస్కృతితో పాటు పెళ్లి కారణంగా ఆడపిల్లల జీవితం వచ్చే మార్పులు, సంప్రదాయాల పేరుతో ఆడపిల్లలకు జరిగే అన్యాయం ఏమిటనే అంశాలను ఈ సినిమాలో కన్వీన్సింగ్‌గా దర్శకుడు చూపించాడు.
ఆడపిల్లలకు ఎవరిపై ఆధారపడకుండా ఇండిపెండెంట్‌గా బతికే ధైర్యం ఉండాలనే మెసేజ్‌ను ఈ సినిమా ద్వారా ఇచ్చాడు. ఉద్యోగాల పేరుతో కన్నవారికి దూరంగా బతికే పిల్లల సంఘర్షణను, బిడ్డలకు దూరమై తండ్రులు పడే ఆవేదనను ఈ సినిమాలో చూపించారు.
ఫస్ట్ హాఫ్ ఫన్...
హీరోకు పెళ్లి చేయాలని తండ్రి చేసే ప్రయత్నాలతోనే ఈ సినిమా మొదలవుతుంది. మహాలక్ష్మితో హీరో ప్రేమలో పడే సన్నివేశాల చుట్టూ ఫస్ట్ హాఫ్ నడుస్తుంది. మహాలక్ష్మి ప్రేమను దక్కించుకునేందుకు పడే పాట్లతో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్‌తో సెకండాఫ్ స్క్రీన్‌ప్లేను అల్లుకున్నాడు డైరెక్టర్. ఫస్ట్ హాఫ్‌లో ఎక్కువగా కామెడీ, లవ్ స్టోరీకి ఇంపార్టెన్స్ ఇవ్వగా...సెకండాఫ్ ఎమోషనల్‌గా సాగుతుంది.
నాచురాలిటీ మిస్...
కామెడీ ఆశించిన స్థాయిలో పండలేదు. హీరోయిన్ ప్రేమ కోసం సాఫ్ట్‌వేర్ జాబ్ చేసే హీరో మార్కెట్‌లో షాప్ పెట్టుకొనే సీన్స్‌లో కామెడీ డోసు మరింత బాగా ఉండేలా చూసుకుంటే బాగుండేది. లవ్‌స్టోరీలో నాచురాలిటీ మిస్సయిన ఫీలింగ్ కలుగుతుంది.
పార్వతీశం సెటిల్డ్ యాక్టింగ్...
కూరగాయలు అమ్ముకునే అమ్మాయితో ప్రేమలో పడ్డ సున్నితమనస్కుడిగా పార్వతీశం సెట్టిల్డ్ గా పెర్ఫామెన్స్ తో మెప్పించాడు. ఎమోషనల్ సీన్స్‌లో పరిణితిని కనబరిచాడు. ఈ సినిమాలో యాక్టింగ్ పరంగా హీరోయిన్ ప్రణీకాన్వికా ఎక్కువ మార్కులు పడతాయి. ఇదే తొలి సినిమా అయినా మాస్ రోల్‌లో ఒదిగిపోయింది. కొన్ని సీన్స్‌లో పార్వతీశాన్ని తన యాక్టింగ్‌తో డామినేట్ చేసింది. . ముక్కు అవినాష్, బాషా కామెడీ కొన్ని చోట్ల వర్కవుట్ అయ్యింది. హర్షవర్ధన్, కేదార్ శంకర్, జయ, పద్మ తదితరులు తమ పరిధుల మేరకు పాత్రలకు న్యాయం చేశారు.
లోపాలున్నాయి…కానీ
మార్కెట్ మహాలక్ష్మీ మంచి మెసేజ్‌తో తెరకెక్కిన ప్రేమకథా చిత్రం. కథ, స్క్రీన్‌ప్లే పరంగా చిన్న చిన్న లోపాలు ఉన్నాయి. వాటిని పట్టించుకోకుండా చూస్తే ఎంజాయ్ చేయచ్చు.
రేటింగ్: 2.5/5