Manchu Vishnu Kannappa: కన్నప్పలో మంచు విష్ణు వాడిన విల్లు ప్రత్యేకతలు ఇవే! ఎలా తయారు చేశారంటే?
11 July 2024, 12:43 IST
Manchu Vishnu Kannappa Bow Specialities: పాన్ ఇండియన్ సినిమా కన్నప్పలో మంచు విష్ణు ఉపయోగించే విల్లు అందరి దృష్టిని ఆకర్షించింది. అయితే ఆ విల్లుకు చాలా ప్రత్యేకతలు ఉన్నాయని మంచు విష్ణు తెలిపారు. అలాగే కన్నప్పలో వాడిన ఆ విల్లును దేంతో తయారు చేశారో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే.
కన్నప్పలో మంచు విష్ణు వాడిన విల్లు ప్రత్యేకతలు ఇవే! ఎలా తయారు చేశారంటే?
Manchu Vishnu Kannappa Bow Specialities: డైనమిక్ స్టార్ విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప సినిమాపై ఉన్న అంచనాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కన్నప్ప టీజర్ అన్ని వర్గాల ఆడియెన్స్‌ను ఆకట్టుకుంది. ఇక తాజాగా విష్ణు తన కన్నప్ప సినిమాలో భాగంగా వాడిన విల్లు విశిష్టతను గురించి చెప్పుకొచ్చారు.
‘కన్నప్ప’లో తిన్నడు (మంచు విష్ణు) వాడిన విల్లు కేవలం ఆయుధం మాత్రమే కాదు. ఆ ధనస్సు ధైర్యానికి సూచిక. తండ్రీకొడుకుల మధ్య బంధానికి సూచికగా నిలుస్తుంది. కన్నప్ప తండ్రి నాధనాథ తన చేతులతో తయారు చేసిన ఆ విల్లు కుటుంబ వారసత్వంగా మారింది. ఆ విల్లుతో కన్నప్ప యుద్ధభూమిలో అసమానమైన బహుముఖ ప్రజ్ఞను ప్రదర్శిస్తారు.
కేవలం ఐదేళ్ల వయసున్న కన్నప్ప అనే యువకుడు ఓసారి అడవిలో క్రూరమైన పులిని ఎదుర్కొంటాడు. ఒక సాధారణ కర్రతో పోరాటం చేసి ఆ పులి నుంచి తప్పించకుంటాడు. అంత చిన్న వయసులో తన కొడుకు ధైర్య సాహసాల్ని చూసి నాధనాథుడు మురిసిపోతాడు. కన్నప్ప శౌర్యానికి ప్రతీకగా ప్రత్యేకమైన విల్లును తయారు చేస్తాడు.
ఆ పులి ఎముకలు, దంతాలతో చేసిన ఆ విల్లు బలానికి, ధైర్య సాహసాలకి ప్రతీకగా నిలుస్తుంది. ఆ విల్లుని రెండుగా విరిస్తే యుద్దంలో పోరాడేందుకు కత్తుల్లానూ ఉపయోగపడేలా రూపొందించారు. విష్ణు చెప్పిన కథను శ్రద్దగా విన్న న్యూజిలాండ్‌లోని చిత్ర కళా దర్శకుడు క్రిస్ ప్రత్యేకమైన విల్లుని తయారు చేశారు. కన్నప్ప సినిమా విజన్‌కు అనుగుణంగా, విష్ణు మంచు అంచనాలకు తగ్గట్టుగా ఆ ధనస్సుని రూపొందించాడు.
ఈ విల్లుతోనే న్యూజిలాండ్‌లో రెండు నెలల పాటు కన్నప్ప సినిమాను చిత్రీకరించారు. ఈ సందర్భంగా విల్లు గురించి మంచు విష్ణు మాట్లాడుతూ.. "ఈ తిన్నడు విల్లు కన్నప్పలో అంతర్భాగం అయింది. అతను దాన్ని అచంచలమైన గర్వంతో ఉపయోగిస్తూ.. తన తెగను, అడవిలో సమతుల్యతను కాపాడుకుంటాడు. ఈ కథ యువతలో ధైర్యాన్ని నింపుతుంది. విన్న వారందరిలో ఆశ్చర్యాన్ని రేకెత్తిస్తుంది. మేము అనుకున్నదాన్ని అనుకున్నట్టుగా రూపొందించినందుకు సంతోషంగా ఉంది" అని తెలిపారు.
ఇదిలా ఉంటే, కన్నప్ప చిత్రంతో తెరపై మన పౌరాణిక గాథను ఆవిష్కరించనున్నారు. ఈ కన్నప్ప సినిమాకు బాలీవుడ్ పాపులర్ డైరెక్టర్ ముఖేష్ సింగ్ దర్శకత్వం వహించారు. ఇక ఈ సినిమాలో మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్, బాలీవుడ్ సీనియర్ యాక్షన్ హీరో అక్షయ్ కుమార్, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వంటి అగ్ర హీరోలు నటించారు. కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కన్నప్పను నిర్మిస్తున్నారు.
అలాగే కన్నప్ప సినిమాతో మోడల్ ప్రీతి ముకుందన్ హీరోయిన్‌గా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తోంది. మోడల్ అయిన ప్రీతి ముకుందన్ క్లాసికల్ డ్యాన్సర్ కూడా. ఎన్నో రకాల ఆడిషన్స్ తర్వాత ప్రీతి ముకుందన్‌ను హీరోయిన్‌గా ఎంపిక చేశారు మేకర్స్. ఆ పాత్రకు ప్రీతి సరిగ్గా సరిపోతుందని మేకర్స్ భావించారు. శివుని భక్తుడైన 'భక్త కన్నప్ప' ఆకర్షణీయమైన కథను మరింత అద్భుతంగా చెప్పనున్నట్లు మేకర్స్ తెలియజేశారు. త్వరలో కన్నప్ప థియేటర్లలో గ్రాండ్ రిలీజ్ కానుంది.
టాపిక్