Happy birthday Mammootty: మమ్ముట్టికి కార్లంటే మహా ఇష్టం.. 369 నెంబర్ అంటే మరీ పిచ్చి.. ఆ నెంబర్ సీక్రెట్ ఎంటో తెలుసా?
07 September 2022, 13:28 IST
- Mammotty Birthday: మలయాళ నటుడు మమ్ముట్టికి కార్లంటే అమితమైన ఇష్టం. తన వద్ద ఉన్న లగ్జరీ కార్లకు ఆయన 369 అనే సంఖ్యను రిజిస్ట్రేషన్ నెంబర్‌గా ఉపయోగిస్తుంటారు. ఈ నెంబర్ వెనకున్న ఆసక్తికరమైన కథేంటో ఇప్పుడు చూద్దాం.
మమ్ముట్టి కార్ నెంబర్ 369
Happy birthday Mammootty: మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి తెలుగులోనూ కొన్ని సినిమాలు చేసి సుపరిచితులయ్యారు. స్వాతికిరణం, యాత్ర త్వరలో విడుదల కానున్న ఏజెంట్ లాంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యారు. ఇవి కాకుండా ఆయన నటించిన చాలా మలయాళ సినిమాలు ఇక్కడ డబ్ అయ్యాయి. తన నటనతో ప్రేక్షకుల మదిలో సుస్థిర స్థానం సంపాదించుకున్న మమ్ముట్టి పుట్టిన రోజు నేడు. బుధవారంతో ఆయనకు 71 ఏళ్లు పూర్తవుతాయి. స్వతహాగా మమ్ముట్టికి కార్లంటే అమితమైన ఇష్టం. ఆయన వద్ద కొన్ని లగ్జరీ కార్లు ఉన్నాయి. ఈ కార్లకు 369 అనే ఫ్యాన్సీ నెంబర్‌ను ఆయన ఉపయోగిస్తుంటారు. ఆయనకు ఈ నెంబర్ అంటే ఎంతో ఇష్టం. మరి ఈ నెంబర్ వెనకున్న కథేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
మమ్ముట్టి తన కెరీర్ ప్రారంభంలో 369 లాక్ కోడ్ కలిగిన ఓ బ్రీఫ్ కేసును ఉపయోగించేవారు. ఈ నెంబర్ 3 గుణకం అయినందుకు ఆ సంఖ్యపై ఆయన అభిమానాన్ని పెంచుకున్నాడు. అందుకే ఆయన తన కార్లన్నింటికీ ఇదే నెంబర్ తీసుకునేవారు. ఆయన వద్ద ప్రస్తుతం చాలా విలాసవంతమైన కార్లు ఉన్నాయి. వాటన్నింటికీ ఇదే నెంబర్‌ను ఉపయోగించడం గమనార్హం.
మీడియా వర్గాల సమాచారం ప్రకారం మమ్ముట్టి కార్ల కలెక్షన్లలో బీఎండబ్ల్యూ ఈ 46 ఎం3, మినీ కూపర్, ఎస్ జాగ్వార్ ఎక్స్‌జే, టొయోటా ల్యాండ్ క్రూయిజర్, ఆడి ఏ7, మిత్సుబిషి పజేరో స్పోర్ట్, టొయోటా ఫార్చ్యూనర లాంటి వాహనాలు ఉన్నాయి. ఈ కార్లన్నింటికీ 369 నెంబర్ రిజిస్టరై ఉంది. ఈ రిజిస్ట్రేషన్ నెంబర్ ఉన్న ఫేస్ బుక్ పేజీని ఆయనకు అంకితం చేయడమైంది. 2014లో మమ్ముట్టి దేశంలోని మొదటి మారుతీ 800 కారును కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపారు. దీన్ని దిల్లీకి చెందిన హర్బాల్ సింగ్ అనే వ్యక్తి నుంచి కొన్నారు. ఈ వాహనాన్ని అతడికి 1983 డిసెంబరు 14న అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ తన చేతుల మీదుగా అందజేశారు. వాస్తవానికి మమ్ముట్టి మొదటి కారు కూడా మారుతీనే. ఆ వాహనాన్ని 80వ దశకంలోనే కొనుగోలు చేశారు.
మమ్ముట్టి ఇటీవల మలయాళ యాక్షన్-థ్రిల్లర్ సీబీఐ 5: ది బ్రెయిన్‌లో కనిపించారు. కె మధు దర్శకత్వం వహించారు. ఎస్ఎన్ స్వామి స్క్రిప్ట్ అందించారు, CBI5 పాపులర్ ఇన్వెస్టిగేటివ్ ఫ్రాంచైజీలో ఐదవ భాగంగా విడుదలైంది. ఇందులో మమ్ముట్టి సేతురామ అయ్యర్ CBI పాత్రను పోషించారు.
ఇది కాకుండా ఇటీవల మలయాళ థ్రిల్లర్ పుజులో కూడా కనిపించారు. ఇది థియేటర్లలో కాకుండా నేరుగా సోనీ లివ్‌లో విడుదలైంది. ప్రస్తుతం మమ్ముట్టి తెలుగు సినిమా ఏజెంట్ విడుదల కోసం ఎదురుచూస్తున్నారు. ఇందులో అతను కీలక పాత్ర పోషించాడు.