Drishyam Hollywood Remake: హాలీవుడ్‌లో రీమేక్ అవుతున్న మలయాళ సూపర్ థ్రిల్లర్ మూవీ దృశ్యం
29 February 2024, 13:53 IST
- Drishyam Hollywood Remake: మలయాళంలో మొదట రూపొంది తర్వాత తెలుగు, హిందీల్లోనూ రీమేక్ అయిన సూపర్ హిట్ మర్డర్ మిస్టరీ మూవీ దృశ్యం ఇప్పుడు హాలీవుడ్‌లోనూ రీమేక్ కాబోతోంది. ఈ విషయాన్ని ప్రొడక్షన్ హౌజ్ పనోరమా స్టూడియోస్ వెల్లడించింది.
హాలీవుడ్‌లో రీమేక్ అవుతున్న మలయాళం మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ దృశ్యం
Drishyam Hollywood Remake: దృశ్యం ఫ్రాంఛైజీ ఇప్పుడు గ్లోబల్ లెవల్ కు వెళ్తోంది. ఈ సూపర్ డూపర్ హిట్ మూవీని హాలీవుడ్ లో రీమేక్ చేయబోతుండటం విశేషం. ఈ విషయాన్ని గురువారం (ఫిబ్రవరి 29) ప్రొడక్షన్ హౌజ్ పనోరమా స్టూడియోస్ వెల్లడించింది. గల్ఫ్‌స్ట్రీమ్ పిక్చర్స్, జేఓఏటీ ఫిల్మ్స్ తో కలిసి తాము హాలీవుడ్ రీమేక్ చేయనున్నట్లు తెలిపింది.
దృశ్యం హాలీవుడ్ రీమేక్
మొదట మలయాళంలో రూపొందిన దృశ్యం సినిమా తర్వాత తెలుగులో వెంకటేశ్, హిందీలో అజయ్ దేవగన్ చేశారు. తెలుగులోనూ మంచి హిట్ కొట్టినా.. హిందీలో అయితే అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాల లిస్టులోకి దృశ్యం 2 చేరింది. దీంతో ఈ ఫ్రాంఛైజీ హాలీవుడ్ లోనూ మూవీని రీమేక్ చేయడానికి సిద్ధమైంది. మలయాళంలో మూవీని రూపొందించిన ఆశిర్వాద్ సినిమాస్ నుంచి పనోరమా స్టూడియోస్ అంతర్జాతీయ రీమేక్ హక్కులను సొంతం చేసుకుంది.
దృశ్యం స్టోరీని అంతర్జాతీయ ప్రేక్షకులతో పంచుకోబోతున్నందుకు సంతోషంగా ఉందని ఈ పనోరమా స్టూడియోస్ సీఎండీ కుమార్ మంగత్ పాఠక్ అన్నారు. ప్రస్తుతం కొరియా, హాలీవుడ్ లలో దృశ్యం తీసిన తర్వాత వచ్చే ఐదేళ్లలో మరో పది దేశాల్లోనూ సినిమాను రీమేక్ చేయాలనుకుంటున్నట్లు వెల్లడించారు. అనుకోని పరిస్థితుల్లో ఓ హత్యలో ఇరుక్కున్న తన కుటుంబాన్ని చట్టం నుంచి కాపాడుకోవడానికి మూవీలోని హీరో ఏం చేశాడన్నదే ఈ దృశ్యం స్టోరీ.
మోహన్ లాల్ దృశ్యం
మొదట 2013లో తొలిసారి మలయాళంలో దృశ్యం మూవీ రిలీజైంది. జీతూ జోసెఫ్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో మోహన్ లాల్ నటించాడు. జార్జ్ కుట్టీ అనే పాత్రలో అతడు కనిపించాడు. ఓ పెద్ద పోలీస్ ఆఫీసర్ కొడుకును అనుకోని పరిస్థితుల్లో తన భార్య హత్య చేయడం, ఆ హత్యను కప్పిపుచ్చడానికి చూసినా.. చివరికి తన కుటుంబమే కేసులో ఇరుక్కోవడంతో చట్టం నుంచి తన వాళ్లను తప్పించడానికి అతడు ఏం చేశాడన్నది మూవీలో చూడొచ్చు.
తెలుగులో వెంకటేశ్, మీనా ప్రధాన పాత్రల్లో ఈ మూవీని రీమేక్ చేశారు. గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో ఈ క్రైమ్ థ్రిల్లర్ టాలీవుడ్ ప్రేక్షకులను కూడా బాగా ఆకట్టుకుంది. తెలుగు, హిందీతోపాటు కన్నడ, సింహళ, మాండరిన్ భాషల్లోనూ దృశ్యం మూవీని రీమేక్ చేశారు. అంత పెద్ద పోలీస్ ఆఫీసర్, కోర్టుల్లో కేసుల నుంచి తన కుటుంబాన్ని కాపాడుకోవడం కోసం ఇందులో హీరో వేసే ఎత్తుగడలు, ట్విస్టులు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.
ఈ దృశ్యం మూడో పార్ట్ కూడా రాబోతుందని కొన్నాళ్ల కిందట మేకర్స్ వెల్లడించారు. ఇక ఈ సినిమా మలయాళం, తెలుగులో కంటే హిందీలో మెగా హిట్ అయిందని చెప్పొచ్చు. ముఖ్యంగా దృశ్యం 2 మూవీకి ఒరిజినల్ మలయాళంలో కేవలం రూ.25 కోట్లు రాగా.. హిందీలో మాత్రం ఏకంగా రూ.313 కోట్లు రావడం విశేషం. అజయ్ దేవగన్, శ్రియ శరణ్ ఆ సినిమాలో నటించారు. ఇప్పుడు హాలీవుడ్ లోకి వెళ్లబోతున్న ఈ ఫ్రాంఛైజీ అక్కడ ఎలాంటి విజయం సాధిస్తుందో చూడాలి.