Kanguva Effect: తమిళ్ ప్రొడ్యూసర్లకి షాకిచ్చిన మద్రాస్ హైకోర్టు.. ఆ నిషేధానికి మంగళం
03 December 2024, 20:08 IST
Kanguva OTT Release Date: కంగువా సినిమా ప్లాప్ అవ్వడానికి కారణాలు బోలెడు. కానీ.. నెగటివ్ రివ్యూస్ కారణంగానే సినిమాకి కలెక్షన్లు దెబ్బతిన్నాయని వాదించిన కోలీవుడ్ నిర్మాతల మండలి ఏకపక్షంగా ఓ నిర్ణయం తీసుకుంది. కానీ..?
కంగువాలో సూర్య, బాబీ డియోల్
సూర్య నటించిన కంగువా సినిమా తర్వాత సాహసోపేత నిర్ణయం తీసుకున్న కోలీవుడ్ నిర్మాతల మండలికి ఊహించని షాక్ తగిలింది. శివ దర్శకత్వంలో తెరకెక్కిన కంగువా సినిమాకి రిలీజ్ రోజే నెగటివ్ టాక్ రావడంతో.. రెండో రోజుకి కలెక్షన్లు దారుణంగా పడిపోయాయి. దాంతో బడ్జెట్‌లో సగం కూడా కంగువా వసూలు చేయలేకపోయింది.
థియేటర్ల వద్ద రివ్యూలు బ్యాన్
మూవీ కలెక్షన్లు ఇలా పడిపోవడానికి కారణం థియేటర్ల వద్ద నెగటివ్ రివ్యూస్ అని కోలీవుడ్ నిర్మాతలు భావిస్తున్నారు. థియేటర్ల వద్ద వచ్చే రివ్యూలను సోషల్ మీడియా, యూట్యూబ్‌లో పోస్టింగ్ చేయడం ద్వారా సినిమాపై నెగటివ్ ఇంపాక్ట్ పెరుగుతోందని నిర్మాతలు అభిప్రాయపడుతున్నారు. దాంతో కంగువా సినిమా తర్వాత కోలీవుడ్ నిర్మాతల మండలి.. ఏకపక్షంగా సాహసోపేత నిర్ణయం తీసుకుంది.
కోర్టుని ఆశ్రయించిన రివ్యూయర్లు
థియేటర్ల వద్ద ఎలాంటి రివ్యూలు చెప్పకూడదని నిషేధం విధించింది. దీనికి థియేటర్ల యజమానులు కూడా సహకరించాలని కోరగా.. వాళ్లు కూడా ఒప్పుకున్నారు. దాంతో ఇకపై ఏ సినిమా రిలీజైన థియేటర్ల వద్ద రివ్యూలను చెప్పకుండా బ్యాన్ విధించారు. అయితే.. నిర్మాతల మండలి నిర్ణయంపై కొంత మంది రివ్యూయర్లు మద్రాసు హైకోర్టుని ఆశ్రయించారు.
ఆధారాలు అడిగిన కోర్టు
రివ్యూయర్లు వేసిన పిటీషన్‌పై ఈరోజు విచారణ జరిపిన మద్రాస్ హైకోర్టు.. థియేటర్ల వద్ద రివ్యూలు చెప్పడం వల్ల నష్టం జరిగినట్లు మీ వద్ద ఏమైనా ఆధారాలు ఉంటే సమర్పించాలని నిర్మాతల మండలిని ఆదేశించింది. నష్టాలకి సంబంధించి స్పష్టమైన ఆధారాలు ఉంటే మాత్రమే.. రివ్యూలు థియేటర్ల వద్ద చెప్పొద్దంటూ ఆదేశాలు ఇవ్వగలమని కోర్టు స్పష్టం చేసింది.
ఓటీటీలోకి కంగువా ఎప్పుడంటే?
కంగువా సినిమా రూ.300 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కగా.. బాక్సాఫీస్ వద్ద రూ.105.03 కోట్లని మాత్రమే వసూలు చేయగలిగింది. కంగువా డిసెంబరు 13 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్‌కి రాబోతోంది. సినిమాలో తొలి 20 నిమిషాలు సాగదీత, స్క్రీన్‌ప్లేలో తికమక, నాసిరకం మ్యూజిక్ మూవీ ప్లాప్‌కి కారణంగా రివ్యూయర్లు చెప్తున్నారు.
టాపిక్