Kanguva Review: కంగువ రివ్యూ - సూర్య డ్యూయల్ రోల్‌లో నటించిన విజువల్ వండర్ మూవీ ఎలా ఉందంటే?
Kanguva Review:సూర్య, దిశా పటానీ జంటగా నటించిన కంగువ మూవీ శుక్రవారం రిలీజైంది. శివ దర్శకత్వం వహించిన ఈ మూవీపై తెలుగులో భారీగా అంచనాలు నెలకొన్నాయి. ఆ అంచనాలకు తగ్గట్లుగా ఈ మూవీ ఉందా? లేదా? అంటే?
Kanguva Review: సూర్య హీరోగా నటించిన కంగువ మూవీ భారీ అంచనాల నడుమ శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. దాదాపు 350 కోట్ల బడ్జెట్‌తో పీరియాడికల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా దర్శకుడు శివ ఈ మూవీని తెరకెక్కించాడు. దిశా పటానీ హీరోయిన్‌గా నటించింది. కంగువ మూవీతో సూర్య తెలుగు ఆడియెన్స్‌ను మెప్పించాడా? లేదా? అంటే?
ఫ్రాన్సిన్ వర్సెస్ కంగువా…
ఫ్రాన్సిన్ (సూర్య), కోల్ట్ (యోగిబాబు) గోవాలో బౌంటీ హంటర్స్‌గా పనిచేస్తోంటారు. క్రిమినల్స్‌ను పట్టుకోవడంలో పోలీసులకు సాయం చేస్తుంటారు. మరో బౌంటీ హంటర్ ఏంజెలీనాను (దిశా పటానీ) ప్రేమిస్తాడు ఫ్రాన్సిస్. కానీ ఓ గొడవ కారణంగా ఫ్రాన్సిస్‌కు బ్రేకప్ చెబుతుంది ఏంజెలీనా. ఓ రష్యన్ ల్యాబ్ నుంచి జెటా అనే చిన్నారి తప్పించుకొని ఫ్రాన్సిస్ దగ్గరకు వస్తాడు. ల్యాబ్ మనుషుల బారి నుంచి జెటాను ఫ్రాన్సిస్ రక్షిస్తాడు.
ఈ క్రమంలో ఫ్రాన్సిస్‌కు జెటాకు పూర్వజన్మలో సంబంధం ఉందనే నిజం బయటపడుతుంది. అదేమిటి? 1070 కాలంలో విదేశీయుల బారి నుంచి ప్రణవాది తెగను కాపాడిన కంగువ ఎవరు? కంగువతో జెటాకు ఎలాంటి రిలేషన్ ఉంది?
కంగువకు కపాల కోనకు చెందిన రుధిర నేత్రకు(బాబీ డియోల్) మధ్య వైరం ఏర్పడటానికి కారణం ఏమిటి? ప్రణవాది తెగను విదేశీయులను అప్పగించాలని రుధిర నేత్ర ఎందుకు అనుకున్నాడు. పంచద్వీప సమూహంలోని ప్రణవాది, కాపాలతో పాటు మరో మూడు తెగల మధ్య రొమేనియన్లు ఎలాంటి విద్వేషాలు సృష్టించారు? రుద్రాంగ నేత్రుడు ఎవరు అన్నదే కంగువ మూవీ కథ.
పీరియాడికల్ ట్రెండ్…
గత కొన్నాళ్లుగా అన్ని భాషల్లో పీరియాడికల్ సినిమాల ట్రెండ్ ఎక్కువైపోయింది. కాలంలో ముప్పై, నలభై ఏళ్లు వెనక్కి వెళ్లి 1980, 90ల కాలం నాటి కథలను వెండితెరపై ఆవిష్కరిస్తూ ఆడియెన్స్‌ను మెప్పించే ప్రయత్నం చేస్తోన్నారు నేటితరం దర్శకులు. కంగువ మూవీతో డైరెక్టర్ శివ ఏకంగా వెయ్యి ఎళ్లు వెనక్కి వెళ్లిపోయాడు.
జాతుల మధ్య పోరాటం...
1070 కాలంలో ఉన్న ఆటవిక తెగలకు నేటి కాలాన్ని ముడిపెడుతూ కంగువ కథను రాసుకున్నాడు. ఆ కాలంలో ఆధిపత్యం కోసం జాతులు, వర్గాల మధ్య పోరాటం ఎలా సాగేది? ఈ వర్గ పోరాటాన్ని అలుసుగా తీసుకొని మన దేశాన్ని హస్తగతం చేసుకోవడానికి విదేశీయులు ఎలాంటి కుట్రలు పన్నారు? ఓ పోరాట యోధుడు విదేశీయుల కుట్రలను ఎలా ఎదుర్కొన్నాడనే అంశాలతో యాక్షన్, సైన్స్ ఫిక్షన్ అంశాలతో విజువల్ వండర్‌గా కంగువను తీర్చిదిద్దారు
కనెక్షన్ కుదరలేదు...
కథ కంటే దర్శకుడు సూర్య ఇమేజ్, అతడి హీరోయిజాన్ని నమ్ముకొనే ఈ సినిమాను తెరకెక్కించినట్లుగా అనిపిస్తుంది. యాక్షన్ ఎపిసోడ్స్‌తో పాటు కంగువ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చే సీన్స్‌ను రాసుకున్న తీరుతో పాటు వాటిని విజువల్‌గా స్క్రీన్‌పై ఆవిష్కరించిన విధానం మెప్పిస్తుంది. కానీ రెండు కాలాల మధ్య కనెక్షన్ అర్థవంతంగా చెప్పడంలో దర్శకుడు కన్ఫ్యూజ్ అయ్యాడు.
ఎన్ని గ్రాఫిక్స్, ఫైట్స్ ఉన్న కథను నడిపించే ఓ బలమైన ఎమోషనల్ లేకపోతే అంతా వృథానే అనిపిస్తుంది. అదే ఫీలింగ్ కంగువ చూస్తున్నప్పుడు కలుగుతుంది. కోనలు మధ్య సాగే పోరాటం చాలా వరకు ప్రెడిక్టబుల్‌గా అనిపిస్తుంది. తమిళ నేటివిటీ ఎక్కువ కావడం, అనవసరమైన ఫైట్ సీక్వెన్స్‌లు, అతిగా అరుస్తూ ఆర్టిస్టులు చెప్పే డైలాగ్స్‌ను తెలుగు ఆడియెన్స్ భరించడం కొంత కష్టమే.
హీరో అతిథి పాత్ర...
1070 కాలంతో కథను మొదలుపెట్టి 2024లోకి రావడం, జెటాపై ప్రయోగాలు, మరోవైపు ఫ్రాన్సిస్, ఏంజెలినా గొడవలు, కోల్ట్ కామెడీతో ఫస్ట్ హాఫ్ టైమ్‌పాస్ చేశారు డైరెక్టర్. ఈ సీన్స్‌లో కామెడీ, లవ్ స్టోరీ ఏది సరిగ్గా వర్కవుట్ కాలేదు. ఓ ట్విస్ట్‌తో సెకండాఫ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు.
ఫస్ట్ హాఫ్‌తో పోలిస్తే సెకండాఫ్‌లోని కొన్ని సీన్స్ బాగానే అనిపిస్తాయి. చీకటి కోన ఎపిసోడ్ లాంటివి ఇంకొన్ని పడితే కంగువ నెక్స్ట్ లెవల్‌లో ఉండేది. క్లైమాక్స్ యాక్షన్ ఎపిసోడ్ గ్రాండియర్‌గా ఉంది. రుద్రాంగి నేత్రుడి క్యారెక్టర్‌లో ఓ హీరో సర్‌ప్రైజ్ ఎంట్రీతో సెకండ్ పార్ట్‌పై క్యూరియాసిటీ కలిగించారు డైరెక్టర్.
టెక్నికల్‌గా మాత్రం కంగువ అద్భుతంగా అనిపిస్తుంది. గ్రాఫిక్స్, క్యారెక్టర్స్‌ను డిజైన్ చేసుకున్న తీరు బాగున్నాయి. ప్రతి ఫ్రేమ్ రిచ్‌గా అనిపిస్తాయి.
సూర్య వన్ మెన్ షో...
సూర్య వన్ మెన్ షోగా ఈ మూవీ నిలుస్తుంది. ఫ్రాన్సిస్ కంటే కంగువ పాత్ర కోసమే సూర్య ఎక్కువగా కష్టపడ్డాడు. లుక్, యాక్టింగ్‌తో మెప్పించాడు. బాబీ డియోల్ గెటప్‌లో ఉన్న క్రియేటివిటీ క్యారెక్టర్‌ను రాసుకోవడంలో కనిపించలేదు. హీరోగా తగ్గట్లుగా విలన్ పాత్రను మలచుకోలేకపోయాడు డైరెక్టర్. దిశా పటానీ పాత్ర కొన్ని సీన్స్‌కే పరిమితమైంది. యోగిబాబు, రెడిన్ కింగ్‌స్లే అరవ కామెడీని నవ్వించలేకపోయాయి.
యాక్షన్ మూవీ లవర్స్‌కు మాత్రమే...
కంగువ గ్రాఫిక్స్, యాక్షన్ మూవీ లవర్స్‌ను మాత్రం మెప్పిస్తుంది. ప్రమోషన్స్‌లో చెప్పినట్లుగా ఇప్పటివరకు ఎవరూ టచ్ చేయని కొత్త కథతో లార్జర్‌దేన్ లైఫ్ ఎక్స్‌పీరియన్స్‌ను అందించే మూవీ ఇదని యూనిట్ చెప్పిన మాటల్లో పూర్తిగా నిజం లేదనిస్తుంది.
రేటింగ్: 3/5