Krishnam Raju: ఆయన నిజంగా రాజే.. ఈ ఒక్క ఉదాహరణ చాలదా?
11 September 2022, 9:50 IST
- Krishnam Raju: కృష్ణం రాజు మనసున్న మారాజుగా నిలిచిపోతారు..
కృష్ణం రాజు
కృష్ణం రాజు.. ఆరడుగుల అందగాడు. సినిమాల్లోనూ, రాజకీయాల్లోనూ సక్సెస్ అయ్యారు. పూర్తిగా భిన్నమైన క్యారెక్టర్. ఆయన మనసు కూడా అంతే. ఒక్క ఉదాహరణ చాలు.. కృష్టం రాజు నిజంగానే రాజు అని చెప్పడానికి.
తెలుగు సినిమా ఇండస్ట్రీని ఒక్కసారిగా షాక్ కు గురి చేసిన వార్త రెబల్ స్టార్ కృష్ణం రాజు మృతి. ఆహార్యం ఎంత గొప్పగా కనిపిస్తుందో ఆయన మనసు కూడా అంతే గొప్పది. 83 ఏళ్ల కృష్ణం రాజు తీవ్ర అనారోగ్యంతో హైదరాబాద్ లోని ఓ ప్రయివేట్ ఆసుపత్రిలో మృతి చెందారు. సినిమాల్లోనూ, కేంద్రమంత్రిగా ఎన్నో సేవలు చేశారు. కానీ ఆయన చేసే పనులు పెద్దగా పబ్లిసిటీ ఉండదు. ఇచ్చిన ఆయనకు, సాయం తీసుకున్న వారికి మాత్రమే గుర్తుంటాయి. ఆయన మనసు రాజే అని చెప్పేందుకు ఇటీవల వాళ్ల ఇంట్లో జరిగిన ఓ కార్యక్రమం చాలు.
ఇప్పుడు చెప్పుకోబోయేది చిన్న వార్తలాగే అనిపించొచ్చు. కానీ అలా ఎంతమంది ఉంటారు అనేదే ప్రశ్న. ఇటీవలే తమ పనిమనిషిని కృష్టం రాజు కుటుంబం సత్కరించింది. తమ ఇంట్లో 25 ఏళ్లుగా పనిచేస్తున్న పద్మ అనే మహిళను.. తమ ఇంట్లో మనిషిలాగే చూసింది. కొన్నేళ్లుగా తమ కుటుంబానికి సేవలు చేస్తున్న ఆ పనిమనిషిని ఘనంగా సన్మానించారు కృష్ణం రాజు. తమ ఇంటి ఆడపడుచులా బొట్టు పెట్టి గౌరవించింది ఆయన కుటుంబం. ఇలా ఎంత మంది చేస్తారు చెప్పండి.
పద్మ.. కృష్ణం రాజు ఇంట్లో 25 ఏళ్లుగా పనిచేస్తుంది, ప్రభాస్ చిన్నప్పటి నుంచి ఆమె ఉంది. కృష్ణం రాజు ఇంట్లోని వాళ్లందరికీ ప్రతిపనికీ ఆమె గుర్తుకువస్తుంది. తమ ఇంట్లో మనిషి అయిపోయింది. ఆమెను సత్కరించుకోవడం తమ బాధ్యత అనుకున్నారు కృష్ణం రాజు. thanks for 25 years service అని.. కేక్ కట్ చేయించి, పూలగుచ్చం ఇచ్చి, బొట్టు పెట్టి గౌరవించారు. అంతేకాదు బంగారు చెయిన్ కూడా కానుకగా ఇచ్చారు. ఏ పని చేసినా.. పబ్లిసిటీ కొరుకునే సెలబ్రిటీలనూ చూస్తుంటాం. కానీ కృష్ణం రాజు ఇందుకు భిన్నం.
కృష్ణం రాజు బిడ్డ ప్రసీద తన ట్విట్టర్ ఖాతాలో ఈ విషయాన్ని షేర్ చేసుకుంటే బయటకి తెలిసింది. ఇలా ఎంతమంది ఉంటారు చెప్పండి. నిజంగా కృష్ణం రాజు మనసు రాజే. ఎలాంటి పబ్లిసిటీ లేకుండా.. తన ఇంట్లో పని చేసే మనిషిని ఎంత చక్కగా గౌరవించుకున్నారు. కృష్ణంరాజు భార్య పనిమనిషికి బొట్టు పెడుతున్న దృశ్యం చూసేందుకు ఎంతో గొప్పంగా ఉంది. నిజంగా ఇండస్ట్రీ వాతావరణంలో కృష్ణంరాజు.. ఓ డిఫరెంట్. ఆయన పేరులోనే కాదు.. ఆయన చేసే పనులు కూడా రాజులాగే.
ఇక కృష్ణం రాజు చేసిన సినిమాలది ప్రత్యేక స్థానం. ఆహార్యం, నటన, మాడ్యులేషన్ తో ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. టాలీవుడ్ చరిత్రలో నిలిచిపోయే పాత్రలు చేశారు రెబల్ స్టార్. జీవనతరంగాలు సినిమాలో బ్యాడ్ సన్ గా చక్కగా నటించారు. కటకటాల రుద్రయ్యలో మాస్ పాత్ర ఇప్పటికీ గుర్తుకువస్తుంటుంది. ఇక భక్త కన్నప్ప సినిమా మాత్రం.. ఎప్పుడూ గుర్తుండిపోయే పాత్ర. బొబ్బిలి బ్రహ్మన్న, విశ్వనాధ నాయకుడు, అమరదీపం, మనవూరి పాండవులు, తాండ్ర పాపారాయుడు.. ఇలా ఎంత చెప్పినా తక్కువే.