Vikranth Rona Movie Review: విక్రాంత్ రోణ మూవీ రివ్యూ- విజువల్ వండర్
28 July 2022, 14:54 IST
హీరో అనే ఇమేజ్ ఛట్రంలో బందీకాకుండా విలక్షణ పాత్రలతో జాతీయ స్థాయిలో గుర్తింపును సొంతం చేసుకున్నాడు కిచ్చా సుదీప్(kiccha sudeep). అతడు హీరోగా నటించిన తాజా చిత్రం విక్రాంత్ రోణ(Vikranth Rona). దాదాపు మూడు వందల కోట్ల వ్యయంతో త్రీడీలో రూపొందిన నేడు పాన్ ఇండియన్ స్థాయిలో నేడు ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సినిమా ఎలా ఉందంటే...
కిచ్చా సుదీప్
Vikranth Rona Movie Review: కేజీఎఫ్-2 తర్వాత దేశవ్యాప్తంగా సినీ అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తించిన కన్నడ చిత్రం విక్రాంత్ రోణ. కిచ్చా సుదీప్ హీరోగా త్రీడీ సాంకేతికతతో పాన్ ఇండియన్ స్థాయిలో ఈ సినిమా రూపొందింది. ఈగ, సైరా నరసింహారెడ్డితో పాటు పలు అనువాద చిత్రాలతో టాలీవుడ్ ప్రేక్షకులకు కిచ్చా సుదీప్ సుపరిచుతుడు కావడంతో విక్రాంత్ రోణ తెలుగులో భారీ స్థాయిలో రిలీజ్ అయ్యింది. పీరియాడికల్ అడ్వెంచర్ ఫాంటసీ డ్రామాగా రూపొందిన ఈ చిత్రానికి అనూప్ భండారీ దర్శకత్వం వహించారు. దాదాపు మూడు వందల కోట్ల వ్యయంతో కన్నడంలోనే భారీ బడ్జెట్ చిత్రాల్లో ఒకటిగా రూపొందిన ఈ సినిమా తెలుగు ప్రేక్షకుల్ని మెప్పించిందా? వరుస పరాజయాలతో వెలవెలబోతున్న థియేటర్లకు తిరిగి ప్రేక్షకుల్ని రప్పించిందా? లేదా? అన్నది తెలియాలంటే కథలోని వెళ్లాల్సిందే...
అడవి మధ్యలోని ఊరి కథ…
కమరొట్టి అడవి మధ్యలో ఉండే ఓ గ్రామం. ఆ ఊరిలో వరుసగా చిన్నారులు హత్యకు గురవుతుంటారు. ఆ కేసును ఛేదించే ప్రయత్నంలో పోలీస్ ఇన్స్‌పెక్టర్ హత్యకు గురవుతాడు. అతడి స్థానంలో ఆ ఊరికి కొత్తగా విక్రాంత్ రోణ (సుదీప్) ఇన్స్‌పెక్టర్‌గా వస్తాడు. ఆ ఊరిలో జరుగుతున్న హత్యల తాలూకు మిస్టరీ వెనకున్న ఒక్కో చిక్కుముడిని విప్పుకుంటూ వెళుతుంటాడు. మరోవైపు ఆ ఊరి పెద్ద జనార్ధన్ తనయుడు సంజీవ్ (నిరూప్ భండారీ)చిన్నతనంలోనే ఊరి విడిచి పారిపోతాడు. చాలా ఏళ్ల తర్వాత తిరిగి కమరొట్టిలో అడుగుపెడతాడు.
జనార్ధన్ బంధువు విశ్వనాథ్ కూడా తన కూతురు పన్నా (నీతా అశోక్) పెళ్లి కోసం ఊరికి వస్తాడు. సంజీవ్ తో పన్నా ప్రేమలో పడుతుంది. జనార్ధన్, విశ్వనాథ్ కారణంగా ఆ ఊరిలో చాలా ఏళ్ల క్రితం ఓ కుటుంబం మొత్తం బలైపోతుంది. వారంతా ఆత్మలుగా మారి చిన్నారులను హత్య చేస్తున్నారని ప్రజలు నమ్ముతుంటారు. నిజంగా ఆ చిన్న పిల్లలను ఆత్మలే హత్య చేశాయా? ఆ మర్డర్స్ వెనకున్న మిస్టరీని విక్రాంత్ రోణ ఎలా ఛేదించాడు? ఆ ఊరితో విక్రాంత్ రోణ భార్య పిల్లలకు ఉన్న సంబంధమేమిటి? పన్నా ప్రేమించిన సంజీవ్ అసలు ఎవరు? అన్నదే ఈ విక్రాంత్ రోణ చిత్ర ఇతివృత్తం.
పోలీస్ అన్వేషణ(Vikranth Rona Movie Review)…
మర్డర్ మిస్టరీ అంశాలకు అడ్వెంచర్ ఫాంటసీ గ్రాఫిక్స్ హంగులను జోడించి దర్శకుడు అనూప్ భండారీ విక్రాంత్ రోణ సినిమాను తెరకెక్కించారు. పీరియాడికల్ టచ్‌తో విజువల్ వండర్‌గా ఈ సినిమాను తీర్చిదిద్దారు. దర్శకుడు ఎంచుకున్న పాయింట్ కొత్తదేమీ కాదు. ఓ ఊరిలో జరుగుతున్న హత్యలు? వాటి వెనకున్న రహస్యాన్ని ఛేదించే ఓ పోలీస్ ఆఫీసర్ కథ ఇది. ఇలాంటి కథలు రక్తి కట్టాలంటే హీరోయిజం ఎలివేట్ కావాలి. సుదీప్ క్యారెక్టర్ ఎంట్రీ నుండి చివరి సీన్ వరకు డిఫరెంట్ గా డైరెక్టర్ డిజైన్ చేసుకుంటూ ప్రేక్షకుల్ని ఎంగేజ్ చేసే ప్రయత్నం చేశారు. ప్రతి సీన్ ను స్టైలిష్ గా తీర్చిదిద్దుతూ సుదీప్ అభిమానులను అలరించేలా సాగుతుంది.
ఒక్కో క్యారెక్టర్‌పై అనుమానాల్ని రేకెత్తించేలా స్క్రీన్‌ప్లేను రాసుకున్న తీరు బాగుంది. చివరి వరకు అసలు హంతకుడు ఎరవనేది రివీల్ కాకుండా ప్రేక్షకులు థ్రిల్ అయ్యేలా చెప్పడంలో దర్శకుడు కొంత వరకు సక్సెస్ అయ్యాడు. రివేంజ్ డ్రామాకు తండ్రీకూతుళ్ల అనుబంధాన్ని జోడిస్తూ కథను నడిపించిన తీరు బాగుంది. ఓ పోలీస్‌గానే కాకుండా ఆ ఊరితో సుదీప్ క్యారెక్టర్ కు ఉన్న సంబంధాన్ని ఎమోషనల్ గా చూపించారు
మలుపులు బలం…
ఓ చిన్నారి హత్యతో సినిమా విభిన్నంగా మొదలవుతుంది. అడవి మధ్యలో ఉన్న ఆ ఊరిని, అక్కడ ఉన్న అంతుచిక్కని రహస్యాలను ఆవిష్కరిస్తూ ఉత్కంఠగా సినిమాను మొదలుపెట్టారు . ఆ ఊరిలోకి ఓ డెవిల్ వచ్చాడు అంటూ సుదీప్ పాత్రను సముద్రం బ్యాక్‌డ్రాప్‌లో స్టైలిష్ పరిచయం చేయడం కొత్తగా ఉంది. కమరొట్టిలో సుదీప్ అడుగుపెట్టడం, కేసును అన్వేషిస్తూ వెళ్లడం ఆకట్టుకుంటాయి. ఒకానొక సమయంలో కేసును అన్వేషించే సుదీప్ అసలైన విలన్ అనే అనుమానాన్ని రేకెత్తిస్తూ విరామంలో వచ్చే మలుపు ఆకట్టుకుంటుంది. సెకండాఫ్‌లో అదే ఉత్కంఠను కొనసాగించాడు. క్లైమాక్స్‌లో వచ్చే మలుపు బాగుంది. ఊహించని ట్విస్ట్ తో ముగించారు.
రొటీన్ కథ…
రొటీన్ రివేంజ్ ఫార్ములాతో విక్రాంత్ రోణ సినిమా రూపొందింది. ఈ పాయింట్ తో తెలుగు, తమిళంలో చాలా సినిమాలొచ్చాయి. ఈ రివేంజ్ పాయింట్ కు గ్రాఫిక్స్ హంగులను అద్దుతూ కొత్త మెరుపులు దిద్దే ప్రయత్నం చేశారు. సినిమా నెమ్మదిగా సాగడం పెద్ద మైనస్ గా మారింది. నాలుగైదు పాత్రలను పదే పదే చూపిస్తూ టైమ్ పాస్ చేసినట్లుగా అనిపిస్తుంది. సుదీప్ హీరోయిజాన్ని చాటడానికి ఉపయోగించిన యాక్షన్ ఎపిసోడ్స్ కథకు సంబంధం లేనట్లుగా సాగుతాయి.
విజువల్స్ హైలైట్…
విజువల్ గా సినిమాను చాలా గ్రాండియర్‌గా తీర్చిదిద్దారు దర్శకుడు. ప్రొడక్షన్ డిజైనింగ్, సౌండ్, గ్రాఫిక్స్ సినిమాకు ప్రధాన బలంగా నిలిచాయి. అడవి వాతావరణం, ఇళ్లు అన్ని కొత్త అనుభూతిని కలిగిస్తాయి. యాక్షన్ సీన్స్‌ను కొత్తగా డిజైన్ చేశారు. క్లైమాక్స్ లో గ్రాఫిక్స్ ఆకట్టుకుంటాయి.
స్టైలిష్ క్యారెక్టర్ లో సుదీప్…
విక్రాంత్ రోణ పాత్రలో సుదీప్ తన నటనతో ఆకట్టుకున్నాడు. సినిమా మొత్తం స్టైలిష్ గా కనిపించాడు. ఎమోషనల్ సీన్స్‌లో ఆకట్టుకున్నాడు. సంజీవ్ గా దర్శకుడి సోదరుడు నిరూప్ భండారీ సర్‌ప్రైజింగ్ రోల్ లో కనిపించాడు. పాజిటివ్ యాంగిల్ కనిపించే నెగెటివ్ క్యారెక్టర్ లో మెప్పించాడు. నీతా అశోక్ క్యారెక్టర్ చాలా రియలిస్టిక్ గా ఉంది. రక్కమ్మ అనే స్పెషల్ క్యారెక్టర్ లో జాక్వెలిన్ ఫెర్నాండేజ్ కనిపించింది. ఆమెపై తెరకెక్కించిన ప్రత్యేక గీతం మాస్ ప్రేక్షకుల్ని అలరిస్తుంది.
మ్యూజిక్ బలం...
రైటర్‌గా విఫలమైన దర్శకుడిగా మాత్రం అనూప్ భండారీ ప్రతిభను చాటుకున్నాడు. రొటీన్ పాయింట్‌ను కొత్తగా స్క్రీన్‌పై ప్రజెంట్ చేశాడు. సాంకేతికంగా తనకు మంచి పట్టు ఉందని ఈ సినిమాతో నిరూపించాడు. అజనీష్ లోకనాథ్ పాటలు, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఈ సినిమాకు పెద్ద ప్లస్‌గా నిలిచాయి. హీరో ఇంట్రాడక్షన్ థీమ్ బాగుంది. డబ్బింగ్ విషయంలో కొంత జాగ్రత్తలు తీసుకుంటే బాగుండేది.
కొత్త ఎక్స్‌పీరియన్స్…
కథ, కథనాలను పక్కనపెడితే విజువల్ గా మాత్రం విక్రాంత్ రోణ డిఫరెంట్ ఎక్స్‌పీరియన్స్‌ను అందిస్తుంది.హాలీవుడ్ శైలిలో మనవాళ్లు సినిమా చేయచ్చునని నిరూపించింది. గ్రాఫిక్స్, ప్రొడక్షన్ డిజైనింగ్ కోసం సినిమా చూడొచ్చు.
రేటింగ్: 2.75/5
టాపిక్