Devara Trailer NTR: చేతికి కట్టుతీసేసిన ఎన్టీఆర్.. దేవర కోసం ముంబైకు స్టార్ హీరో
08 September 2024, 16:32 IST
- Devara Trailer - Jr NTR: దేవర సినిమా ప్రమోషన్ల కోసం ముంబైకు బయలుదేరారు స్టార్ హీరో ఎన్టీఆర్. ట్రైలర్ లాంచ్ అక్కడే ఉంటుందని తెలుస్తోంది. కాగా, తన చేతికి కట్టుతీసేశారు ఎన్టీఆర్.
Devara Trailer NTR: చేతికి కట్టుతీసేసిన ఎన్టీఆర్.. దేవర కోసం ముంబైకు స్టార్ హీరో
మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ నటించిన దేవర సినిమా ఫీవర్ ఇప్పటికే ఫుల్‍గా ఉంది. ఈ చిత్రం సెప్టెంబర్ 27న థియేటర్లలో రిలీజ్ కానుంది. తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయళం బాషల్లో విడుదల అవుతుంది. ఈ మూవీ ట్రైలర్ మరో రెండు రోజుల్లో సెప్టెంబర్ 10న రానుంది. ఈ హైవోల్టేజ్ యాక్షన్ మూవీపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఆర్ఆర్ఆర్ సెన్సేషనల్ హిట్ తర్వాత ఎన్టీఆర్ నుంచి వస్తున్న చిత్రం కావటంతో దేవరపై పాన్ ఇండియా రేంజ్‍లో ఫుల్ హైప్ ఉంది. ప్రమోషన్లను షురూ చేసేందుకు మూవీ టీమ్ రెడీ అయింది.
ముంబైకు ఎన్టీఆర్
దేవర సినిమా ప్రమోషన్ల కోసం నేడు (ఆగస్టు 8) ముంబైకు బయలుదేరారు జూనియర్ ఎన్టీఆర్. దేవర ట్రైలర్ లాంచ్ ఈవెంట్ 10వ తేదీన ముంబైలోనే జరుగుతుందని తెలుస్తోంది. హిందీ మీడియాతో ఎన్టీఆర్ సహా దర్శకుడు కొరటాల శివ కూడా మాట్లాడే అవకాశం ఉంది.
చేతికి కట్టుతీసేసి..
ఎన్టీఆర్ ఎడమ చేతి మణికట్టుకు గత నెల స్వల్ప గాయమైంది. దీంతో అభిమానులు ఆందోళన వ్యక్తం చేశారు. అయితే, రెండు వారాల్లో అది తగ్గిపోతుందని ఆయన టీమ్ వెల్లడించింది. ఇటీవల కర్ణాటకలోని ఆలయాలను దర్శించుకునేందుకు వెళ్లిన సమయంలోనూ ఎన్టీఆర్ చేతికి కట్టు కనిపించింది. దీంతో గాయం ఇంకా తగ్గలేదా అనే టెన్షన్ నెలకొంది.
అయితే, ఎన్టీఆర్ ఇప్పుడు ఎడమ చేతికి ఉన్న ఆ కట్టు తీసేశారు. ఆయన ముంబైకు బయలుదేరిన సమయంలో చేతికి కట్టు కనిపించలేదు. దీంతో గాయం పూర్తిగా నయమైందని ఆయన అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. బ్లాక్ ఔట్‍ఫిట్‍లో స్టైలిష్‍గా ముంబైకు బయలుదేరారు ఎన్టీఆర్. బ్లాక్ హుడీ, జీన్స్ ధరించి.. బ్లాక్ గ్లాసెస్‍తో ఆయన లుక్ అదిరిపోయింది.
సెప్టెంబర్ 10న రానున్న దేవర ట్రైలర్ కోసం సినీ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కొరటాల శివ ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం నుంచి ఇప్పటి వరకు వచ్చిన గ్లింప్స్, మూడు పాటలు చాలా పాపులర్ అయ్యాయి. చిత్రంపై అంచనాలను భారీగా పెంచేశాయి. ముఖ్యంగా సాంగ్స్ నెక్స్ట్ లెవెల్ క్రేజ్ తెచ్చుకున్నాయి. ఫియర్ సాంగ్, చుట్టమల్లేతో పాటు గత వారమే వచ్చిన దావూదీ పాటలు దుమ్మురేపుతున్నాయి. ఈ మూవీకి అనిరుధ్ రవిచందర్ సంగీతం పెద్ద బలంగా నిలువడం ఖాయంగా కనిపిస్తోంది.
దేవర సినిమాకు తెలుగుతో పాటు హిందీలోనూ మంచి క్రేజ్ ఉంది. దీన్ని మరింత పెంచేలా ముంబై నుంచే ప్రమోషన్లలను మూవీ టీమ్ షురూ చేస్తోంది. ట్రైలర్ రిలీజ్ అయ్యాక ఈ చిత్రంపై బజ్ మరింత పెరగడం పక్కాగా కనిపిస్తోంది. ఇప్పటికే విదేశాల్లో బుకింగ్స్ మొదలైన చోట భారీగా టికెట్లు అమ్ముడవుతున్నాయి.
దేవర చిత్రంలో ఎన్టీఆర్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్‍గా నటించారు. సైఫ్ అలీ ఖాన్ విలన్ పాత్ర పోషించారు. శృతి మరాఠే, ప్రకాశ్ రాజ్, శ్రీకాంత్, షైన్ టామ్ చాకో కీరోల్స్ చేశారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి కాగా.. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జోరుగా సాగుతున్నాయి. ఈ చిత్రాన్ని ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ సుమారు రూ.300కోట్ల భారీ బడ్జెట్‍తో ప్రొడ్యూజ్ చేశాయి.