Jio Cinema Subscription Plans: అదిరిపోయే సబ్‌స్క్రిప్షన్ ప్లాన్స్ తీసుకొచ్చిన జియో సినిమా.. నెలకు రూ.29కే..
25 April 2024, 11:18 IST
- Jio Cinema Subscription Plans: జియో సినిమా తమ సబ్‌స్క్రైబర్లను పెంచుకునేందుకు రెండు అదిరిపోయే ప్లాన్స్ ను తీసుకొచ్చింది. ఈ రెండు ప్లాన్స్ అందరికీ అందుబాటు ధరల్లోనే ఉండటం విశేషం.
అదిరిపోయే సబ్‌స్క్రిప్షన్ ప్లాన్స్ తీసుకొచ్చిన జియో సినిమా.. నెలకు రూ.29కే..
Jio Cinema Subscription Plans: జియో సినిమా ఓటీటీ తన సబ్‌స్క్రిప్షన్ ప్లాన్ల ధరలను భారీగా తగ్గించింది. తమ ప్లాట్‌ఫామ్ పై ఉన్న రెండు ప్రీమియం కంటెంట్ ను అందించే ఈ ప్లాన్స్ గతంలో ఉన్న ధరను సగానికి తగ్గించింది. ఈ కొత్త ప్లాన్స్ గురువారం (ఏప్రిల్ 25) నుంచి అందుబాటులోకి వచ్చినట్లు వయాకామ్ 18 వెల్లడించింది. ఆ ప్లాన్స్ ఏంటో చూడండి.
జియో సినిమా కొత్త ప్లాన్స్
జియో సినిమా ఓటీటీలోని ప్రీమియం కంటెంట్ ను నెలకు కేవలం రూ.29 చెల్లించి చూడొచ్చు. అది కూడా యాడ్స్ లేకుండానే. గతంలో దీని ధర రూ.59గా ఉండేది. దీని ధరను రూ.29కి తగ్గించడమే కాదు.. ఈ ప్లాన్ ద్వారా ఒక సమయంలో ఒక డివైస్ నుంచి లాగిన్ అయి.. 4కే క్వాలిటీ కంటెంట్ కూడా చూడొచ్చు. అంతేకాదు వాటిని డౌన్‌లోడ్ చేసుకొని తర్వాత చూసుకునే వీలు కూడా కల్పించారు.
ఇక ఫ్యామిలీ ప్లాన్ విషయంలోనూ స్పెషల్ ఆఫర్ తీసుకొచ్చారు. గతంలో దీని ధర నెలకు రూ.149గా ఉండగా.. ఇప్పుడు రూ.89కి తగ్గించారు. ఈ ప్లాన్ కింద జియో సినిమాలోని ప్రీమియం కంటెంట్ ను నాలుగు డివైస్ లపై ఒకేసారి చూసే వీలుంటుంది. ఇక ఈ రెండు ప్లాన్స్ లో గతంలో యాడ్స్ ఉండగా.. ఇప్పుడు వాటిని కూడా తొలగించింది. ఈ రెండు ఆఫర్ల ద్వారా తమ సబ్‌స్క్రైబర్లను భారీగా పెంచుకోవాలని జియో సినిమా ప్లాన్ చేస్తోంది.
అందుబాటు ధరల్లోనే..
క్వాలిటీ ఎంటర్‌టైన్మెంట్ కు అందుబాటులో ధరలో యాక్సెస్ ఇవ్వడం తమ లక్ష్యమని వయాకామ్ 18 డిజిటల్ సీఈవో కిరణ్ మణి అన్నారు. 4కే క్వాలిటీలో జియో సినిమాలో ఉన్న ఇండియన్ మూవీస్, వెబ్ సిరీస్ తోపాటు హాలీవుడ్ సినిమాలను కూడా చూడొచ్చు. అందులోనూ ఐదు భాషల్లో ఈ కంటెంట్ అందుబాటులో ఉంటుంది.
ఇప్పటికే జియో సినిమా సభ్యులుగా ఉన్న వాళ్లు ఫ్యామిలీ ప్లాన్ కింద అదనంగా వచ్చిన ప్రయోజనాలను ఎలాంటి అదనపు రుసుము లేకుండా పొందే వీలుంది. ఇక ఇప్పటికే సబ్‌స్క్రైబర్లకే కాకుండా ఐపీఎల్ లాంటి స్పోర్ట్స్ ఈవెంట్స్ ను అందరికీ ఉచితంగా అందిస్తోందీ ఓటీటీ. జియో సినిమాలో పీకాక్, హెచ్‌బీవో, పారామౌంట్, వార్నర్ బ్రదర్స్ డిస్కవరీలకు చెందిన కంటెంట్ మొత్తం ఉంది.
వీటిలో గేమ్ ఆఫ్ థ్రోన్స్, హౌస్ ఆఫ్ ద డ్రాగన్, ఓపెన్‌హైమర్, బార్బీలాంటి టాప్ మూవీస్ కూడా ఇంగ్లిష్ తోపాటు హిందీ, తెలుగు, తమిళం, బెంగాలీ, మరాఠీ భాషల్లో అందుబాటులో ఉన్నాయి. ఇక ఈ ఓటీటీకి సబ్‌స్క్రైబ్ చేసుకున్న వాళ్లు కలర్స్, నికెలోడియోన్ లాంటి ఛానెల్స్ ను కూడా చూసే వీలుంది.
గతేడాది నుంచి ఐపీఎల్ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకున్న జియో సినిమా.. ఏ డివైస్ లో అయినా ఫ్రీగా చూసే వీలు కల్పించి సంచలనం సృష్టించింది. ఈ మెగా లీగ్ బ్రాడ్‌కాస్టింగ్ హక్కులు మాత్రం ఇంకా స్టార్ స్పోర్ట్స్ దగ్గరే ఉన్నాయి.