Janhvi Kapoor Telugu: తెలుగు నేర్చుకోనందుకు సిగ్గు పడుతున్నా.. దేవర ఆ బాధ లేకుండా చేసింది: జాన్వీ కపూర్
23 February 2024, 19:41 IST
- Janhvi Kapoor Telugu: ఒకప్పుడు టాలీవుడ్ ను ఏలిన దివంగత శ్రీదేవి ముద్దుల తనయ జాన్వీ కపూర్ తాను తెలుగు నేర్చుకోనందుకు సిగ్గు పడుతున్నానని చెప్పింది. జూనియర్ ఎన్టీఆర్ తో కలిసి ఆమె నటిస్తున్న దేవర మూవీలో జాన్వీ తెలుగులో మాట్లాడనుంది.
తెలుగు నేర్చుకోనందుకు సిగ్గు పడుతున్నానని చెప్పిన జాన్వీ కపూర్
Janhvi Kapoor Telugu: జాన్వీ కపూర్ తల్లి శ్రీదేవి తెలుగులో ఓ సూపర్ స్టార్. కానీ జాన్వీకి మాత్రం ఇప్పటికీ ఒక్క ముక్క తెలుగు రాదు. నిజానికి తాను తెలుగు నేర్చుకోనందుకు సిగ్గు పడుతున్నానని, తన జీవితంలో ఇప్పటికీ విచారించాల్సిన అతిపెద్ద విషయమని ఆమె చెప్పడం గమనార్హం. ప్రస్తుతం ఆమె జూనియర్ ఎన్టీఆర్ మూవీ దేవరలో నటిస్తోంది. తెలుగులో ఆమెకు ఇదే తొలి సినిమా.
తెలుగుపై జాన్వీ కపూర్
ది వీక్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో జాన్వీ కపూర్ తెలుగు నేర్చుకోకపోవడం, దేవర మూవీపై స్పందించింది. మన భాష నేర్చుకోకపోవడం అనేది చాలా దురదృష్టకరమని ఆమె చెప్పింది. "నేనెప్పుడూ తెలుగు నేర్చుకోలేదు. దానికి నేను సిగ్గుపడుతున్నాను. తెలుగు నాకు అర్థమవుతుంది కానీ మాట్లాడలేను. నా జీవితంలో ఇది కాస్త బాధ కలిగించే అంశం. అది కొంత కాలంగా నాలో అలా ఉండిపోయింది" అని జాన్వీ చెప్పింది.
అయితే తాను తొలి తెలుగు సినిమా దేవర చేస్తున్నందుకు సంతోషంగా ఉందని తెలిపింది. ఈ సినిమా షూటింగ్ ఇంకా పూర్తి కాలేదని, కొన్ని పాటలు ఇంకా షూట్ చేయాల్సి ఉందని వెల్లడించింది. ఈ మూవీ డైలాగులు తనకు పంపించారని, వాటిని బాగా నేర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలిపింది. ప్రస్తుతం తన దృష్టంతా ఆ డైలాగుల పైనే ఉందని, అందుకే ఇంటర్వ్యూ ఇవ్వాలా వద్దా అని ఆలోచించినట్లు చెప్పింది.
"దేవర మూవీ షూటింగ్ ఇంకా చేస్తున్నాను. ఇంకా పాటలు మిగిలి ఉన్నాయి. నిన్ననే వాళ్లు నా డైలాగ్స్ పంపించారు. వాటిని నేర్చుకునే పనిలో ఉన్నారు. దేవర టీమ్ చాలా ఓపిగ్గా ఉంటుంది. తెలుగు విషయంలో నాకు సాయం చేస్తున్నారు. వాళ్లు పెద్ద పెద్ద స్టార్లతో పని చేస్తున్నారు. నాకు ఏ అవసరం వచ్చినా సాయం చేయడానికి సిద్ధంగా ఉంటారు" అని జాన్వీ చెప్పింది.
మా నాన్న ఏం చెప్పారో ఏమో..
ఇక జాన్వీ రామ్ చరణ్ తోనూ నటిస్తోందని ఆమె తండ్రి బోనీ కపూర్ వెల్లడించిన విషయం తెలిసిందే. అయితే దీనిపై ఆమె కాస్త ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ప్రొడ్యూసర్లు చెప్పకుండా ఆయన ఎలా చెప్పారన్నట్లుగా జాన్వీ స్పందించింది. "మా నాన్న ఏదో అనౌన్స్‌మెంట్ చేశారు. ఆయన ఏం చెప్పారో నాకు తెలియదు. ఇతర సినిమాల గురించి ఇప్పుడే మాట్లాడటం తొందరపాటు అవుతుంది. మా నాన్న నాతోగానీ, ప్రొడ్యూసర్లతోగానీ మాట్లాడలేదు" అని జాన్వీ చెప్పడం గమనార్హం.
జాన్వీ కపూర్ ప్రస్తుతం దేవర షూటింగ్ చేస్తుండగా.. త్వరలోనే రామ్ చరణ్ తో కలిసి బుచ్చిబాబు సానా డైరెక్షన్ లోనూ నటిస్తోందని ఆమె తండ్రి బోనీ కపూర్ ఈ మధ్యే ఓ ఇంటర్వ్యూలో చెప్పిన విషయం తెలిసిందే. ఇవి కాకుండా ఆమె మిస్టర్ అండ్ మిసెస్ మహి, ఉలజ్, సన్నీ శంకర్ కీ తులసి కుమారీ సినిమాల్లో నటిస్తోంది. జాన్వీ నటించిన దేవర మూవీ ఏప్రిల్ 5న రిలీజ్ కావాల్సి ఉండగా.. ఇప్పుడు అక్టోబర్ 10కి వాయిదా వేశారు.