Janhvi Kapoor: దేవరపై అప్‍డేట్ ఇచ్చిన హీరోయిన్ జాన్వీ కపూర్
Janhvi Kapoor - Devara Movie: దేవర సినిమాతో తెలుగులో అడుగుపెడుతున్నారు హీరోయిన్ జాన్వీ కపూర్. తాజాగా ఈ చిత్రం గురించి ఓ అప్‍డేట్ చెప్పారు.
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న దేవర సినిమా కోసం సినీ ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అయితే, ఏప్రిల్ 5వ తేదీన రిలీజ్ కావాల్సిన ఈ చిత్రం వాయిదా పడింది. ఏకంగా అక్టోబర్ 10న ఈ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నట్టు ఇటీవలే మూవీ టీమ్ తెలిపింది. కొరటాల శివ దర్శకత్వంలో సముద్రం బ్యాక్‍డ్రాప్‍లో యాక్షన్ థ్రిల్లర్‌గా దేవర రూపొందుతోంది. ఈ సినిమాతోనే బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ తెలుగులోకి ఎంట్రీ ఇస్తున్నారు. ఈ సినిమా గురించి తాజాగా ఆమె ఓ అప్‍డేట్ వెల్లడించారు.
దేవర సినిమా షూటింగ్ ఇంకా పూర్తి కాలేదని, ఇంకా కొన్ని పాటల చిత్రీకరణ జరగాల్సి ఉందని జాన్వీ కపూర్ చెప్పారు. తెలుగు డైలాగ్‍లు తనకు అందాయని, వాటిని నేర్చుకునేందుకు చాలా ఆసక్తిగా ఉన్నానని ఓ మీడియాతో మాట్లాడుతూ జాన్వీ చెప్పారు.
తాను కొన్ని రోజులు తెలుగులోనే మాట్లాడాలని అనుకుంటున్నానని జాన్వీ కపూర్. “ఇటీవలే తెలుగు డైలాగ్స్ నా దగ్గరికి వచ్చాయి. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా వాటిని నేర్చుకోవాలని అనుకుంటున్నా. రానున్న కొన్ని రోజుల్లో నేను ఇంగ్లిష్ మాట్లాడకుండా.. కేవలం తెలుగులోనే మాట్లాడాలని అనుకుంటున్నా” అని జాన్వీ కపూర్ చెప్పారు. ఈ చిత్రంలో ఇంకా కొన్ని పాటల షూటింగ్ మిగిలి ఉందని వెల్లడించారు.
దేవర సినిమాతోనే జాన్వీ టాలీవుడ్‍లో అడుగుపెడుతున్నారు. ఈ మూవీలో పల్లెటూరు అమ్మాయి తంగం పాత్ర చేస్తున్నారు జాన్వీ. లంగావోణీలో ఉన్న ఆమె లుక్ అదిరిపోయింది. ఆమెకు బాగా సూటైంది.
దేవర వాయిదా
దేవర పార్ట్ 1 సినిమా ఏప్రిల్ 5వ తేదీన రిలీజ్ కావాల్సింది. అయితే, షూటింగ్ మిగిలి ఉండడం, వీఎఫ్‍ఎక్స్ పనులు ఆలస్యం అవుతుండటంతో వాయిదా వేసింది మూవీ టీమ్. దసరా సందర్భంగా అక్టోబర్ 10వ తేదీన ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తామని ప్రకటించింది. ఒకవేళ పుష్ప 2 వాయిదా పడితే ఆగస్టు 15వ తేదీని కూడా పరిశీలించే ఛాన్స్ ఉందని ఇండస్ట్రీ వర్గాల టాక్.
బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ కూడా ఈ చిత్రంతోనే తెలుగులో ఎంట్రీ ఇస్తున్నారు. ఆయన చేతి గాయం కూడా ఈ చిత్రం ఆలస్యమయ్యేందుకు ఓ కారణమని తెలుస్తోంది. దేవరలో ఆయన విలన్‍గా నటిస్తున్నారు. మలయాళం నటుడు షైన్ టామ్ చాకో కూడా ఈ చిత్రంలో కీరోల్ చేస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.
దేవర సినిమాలో వీఎఫ్‍ఎక్స్ భారీ స్థాయిలో ఉంటుందని తెలుస్తోంది. ముఖ్యంగా అండర్ వాటర్ యాక్షన్ సీక్వెన్సులు హైలైట్‍గా ఉంటాయని టాక్. ఈ చిత్రంలో ఎన్టీఆర్ డ్యుయల్ రోల్‍లో కనిపించనున్నారు. జనవరిలో వచ్చిన దేవర గ్లింప్స్ అందరినీ విపరీతంగా ఆకట్టుకుంది. భీకర యాక్షన్‍తో గ్లింప్స్ అదిరిపోయింది. ఎన్టీఆర్ లుక్, యాక్షన్ మెప్పించింది. గ్లోబల్ హిట్ ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత ఎన్టీఆర్ చేస్తున్న చిత్రం కావటంతో దేవరపై అంచనాలు భారీగా ఉన్నాయి. అందుకు అనుగుణంగానే ఏ విషయంలోనూ రాజీ లేకుండా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మూవీ టీమ్ పట్టుదలగా ఉంది.