India vs Netherlands T20 World Cup: నెదర్లాండ్స్‌పై భారత్ ఘనవిజయం.. పసికూనపై అదరగొట్టారు
27 October 2022, 16:11 IST
- India vs Netherlands T20 World Cup: సిడ్ని వేదికగా నెదర్లాండ్స్‌తో జరిగిన టీ20 వరల్డ్ కప్ మ్యాచ్‌లో టీమిండియా ఘనవిజయం సాధించింది. 56 పరుగుల తేడాతో గెలిచింది. 180 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక నెదర్లాండ్స్ 123 పరుగులకే పరిమితమైంది.
నెదర్లాండ్స్‌పై భారత్ ఘనవిజయం
India vs Netherlands T20 World Cup: టీ20 ప్రపంచకప్ సూపర్-12లో భాగంగా నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా ఘన విజయాన్ని సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన కేవలం 2 వికెట్లు నష్టపోయి 180 పరుగుల భారీ లక్ష్యాన్ని పసికూన ప్రత్యర్థి ముందు ఉంచగా.. నెదర్లాండ్స్ లక్ష్యాన్ని ఛేదించలేక పరుగులకే పరిమితమైంది. పసికూన జట్టుపై భారత బౌలర్లు సంపూర్ణ ఆధిపత్యాన్ని చెలాయించారు. నెదర్లాండ్స్ జట్టులో టిమ్ ప్రింగిల్ చేసిన 20 పరుగులే అత్యధిక వ్యక్తిగత స్కోరంటే ఆ జట్టు ఇన్నింగ్స్ ఏ విధంగా సాగిందో అర్థం చేసుకోవచ్చు. టీమిండియా బౌలర్లలో భువనేశ్వర్, అర్ష్‌దీప్, అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్ తలో రెండు వికెట్లు తమ ఖాతాలో వేసుకున్నారు.
180 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో బరిలోకి దిగిన నెదర్లాండ్స్ జట్టుకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ విక్రమ్ జీత్ సింగ్‌ను(1) భువి క్లీన్ బౌల్డ్ చేయడంతో ప్రత్యర్థి పతనం ప్రారంభమైంది. అనంతరం కాసేపటికే మరో ఓపెనర్ మ్యాక్స్‌ను(16) అక్షర్ పెవిలియన్ చేశాడు. ఫలితంగా పవర్ ప్లే ముగిసే సమయానికి నెదర్లాండ్స్ 27 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఇలాంటి సమయంలో బాస్ డీ లీడే(16), కొలిన్ కాసేపు క్రీజులో నిలుచున్నప్పటికీ ధాటిగా మాత్రం ఆడలేకపోయారు. బాస్ డీ లీడేను అక్షర్ ఔట్ చేయగా.. ఆ తర్వాత అశ్విన్ కొలిన్(17) పనిపట్టాడు.
అప్పటి నుంచి నెదర్లాండ్స్ పతనం కొనసాగుతూనే ఉంది. ఏ సందర్భంలోనూ భారత్‌కు సవాల్ విసరలేకపోయారు. చివర్లో ట్రిమ్ ప్రింగిల్ ఓ ఫోర్, ఓ సిక్సర్‌తో మెరుపులు మెరిపించినప్పటికీ భారత బౌలర్లను ఎదుర్కోలేకపోయాడు. క్రమం తప్పకుండా నెదర్లాండ్స్ వికెట్లు పారేసుకోవడంతో మ్యాచ్‌పై విజయాన్ని ఎప్పుడో వదిలేసుకుంది. కేవలం ఓటమి అంతరాన్ని తగ్గించేందుకు చివరి వరకు ఆడి ఆలౌట్ ప్రమాదాన్ని తప్పించుకుంది. అయితే నెదర్లాండ్స్ తన కోటా 20 ఓవర్లు ఆడి 9 వికెట్ల నష్టానికి 123 పరుగులు చేసింది. ఫలితంగా భారత్ 56 పరుగుల భారీ తేడాతో ఘన విజయాన్ని అందుకుంది.
అంతకుముందు బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది. గత మ్యాచ్‌లో విజృంభించిన విరాట్ కోహ్లీ(62).. మరోసారి బ్యాట్ ఝుళిపించాడు. ఈ సారి కూడా అర్ధశతకంతో ఆకట్టుకోగా.. అతడికి కెప్టెన్ రోహిత్ శర్మ(53), సూర్యకుమార్(51) అర్ధసెంచరీలతో తోడుగా నిలిచారు. ధారాళంగా పరుగులు తీయనప్పటికీ ఆచితూచి ఎంతవరకు ఆడాలో అంతవరకు ఆడి ఆకట్టుకున్నారు. ఓపెనర్లు రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్(9) మినహా మిగిలిన వికెట్లు తీయలేకపోయారు నెదర్లాండ్స్ బౌలర్లు. విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్ 95 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. నెదర్లాండ్స్ బౌలర్లలో ఫ్రెడ్ క్లాసెన్, వాన్ మాకరెన్ చెరో వికెట్ తీశారు.