India vs Netherlands: రోహిత్, విరాట్, సూర్య హాఫ్ సెంచరీల మోత.. టీమిండియా 179/2
27 October 2022, 14:16 IST
- India vs Netherlands: టీ20 వరల్డ్‌కప్‌లో నెదర్లాండ్స్‌పై హాఫ్ సెంచరీల మోత మోగించారు రోహిత్, విరాట్, సూర్యకుమార్. అయితే టీమిండియా మాత్రం ఆశించినంత భారీ స్కోరు మాత్రం చేయలేకపోయింది.
విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ
India vs Netherlands: టీ20 వరల్డ్‌కప్‌లో నెదర్లాండ్స్‌పై ఇండియా 20 ఓవర్లలో 2 వికెట్లకు 179 రన్స్ చేసింది. ఓపెనర్ రోహిత్ శర్మతోపాటు విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్‌లు హాఫ్ సెంచరీలతో చెలరేగారు. అయితే ఆ టీమ్‌పై ఫ్యాన్స్ ఇంతకంటే ఎక్కువ స్కోరే ఆశించారు. విరాట్ 62, రోహిత్ 53, సూర్య 51 రన్స్ చేశారు. ఇన్నింగ్స్ చివరి బాల్‌కు సిక్స్ కొట్టి కేవలం 25 బాల్స్‌లోనే సూర్య హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. కోహ్లి 44 బాల్స్‌లో 62 రన్స్ చేశాడు. చివరి ఓవర్లో 17 రన్స్ రావడంతో ఇండియా ఆ మాత్రం స్కోరైనా చేసింది. విరాట్, సూర్య మూడో వికెట్‌కు 8 ఓవర్లలోనే అజేయంగా 95 రన్స్ జోడించారు.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా అభిమానులు ఆశించిన స్థాయిలో ఆడలేకపోయింది. నెదర్లాండ్స్‌పై ఆకాశమే హద్దుగా మన బ్యాటర్లు చెలరేగుతారని భావించినా.. అలా జరగలేదు. డచ్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతోపాటు ఫీల్డింగ్‌లోనూ అదరగొట్టారు. దీంతో ఓపెనర్లు రోహిత్, రాహుల్ ఆచితూచి ఇన్నింగ్స్ ప్రారంభించారు. రాహుల్ (9) ఈ మ్యాచ్‌లోనూ విఫలమయ్యాడు.
అయితే ఫామ్ కోసం తంటాలు పడుతున్న రోహిత్ మాత్రం నెదర్లాండ్స్ బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. చాలా రోజుల తర్వాత రోహిత్ తనదైన షాట్లతో అలరించాడు. అతడు భారీ షాట్లు ఆడుతుండటంతో మరోవైపు విరాట్ కోహ్లి స్ట్రైక్ అతనికే ఎక్కువగా ఇచ్చాడు. రోహిత్ 39 బాల్స్‌లో 53 రన్స్ చేసి ఔటయ్యాడు. అతని ఇన్నింగ్స్‌లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లు ఉన్నాయి.
రోహిత్ ఔటైన తర్వాత విరాట్ ఛార్జ్ తీసుకున్నాడు. సూర్యకుమార్ యాదవ్‌తో కలిసి స్కోరు బోర్డు పరుగులెత్తించాడు. వరుసగా రెండో మ్యాచ్‌లోనూ అతడు హాఫ్ సెంచరీ చేశాడు. అటు పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో విఫలమైన సూర్యకుమార్ ఈ మ్యాచ్‌లో మునుపటి తనను చూపించాడు.